iDreamPost

హాలీవుడ్ చిన్నపిల్లల సినిమాలు – అంతర్లీనం సందేశం

హాలీవుడ్ చిన్నపిల్లల సినిమాలు  – అంతర్లీనం సందేశం

సినిమా కూడా పాఠాలు నేర్చుకోవడానికి ఉపయోగపడే మాధ్యమమే… మరీ ముఖ్యంగా కార్టూన్ సినిమాలు..ఈ కింద చిన్న పిల్లల కోసం హాలీవుడ్ లో వచ్చిన వాటి నుంచి నేర్చుకోవటానికి చాలా అవకాశం ఉంది… వీలుంటే చూడండి, పిల్లలకి చూపించండి ..

సినిమా పేర్లు – వాటిలో అంతర్లీనంగా ఉన్న సందేశం..

The Croods (2013)


తరానికి తరానికి ఆలోచన మారుతుంది… ఆ ఆలోచనల మధ్య సంఘర్షణ తప్పదు… చీకటి లో ఉంటూ అదే జీవితం అనుకోవడం, దాన్ని తిట్టుకుంటూ ఇది మన ఖర్మ అనుకుంటూ బతికెయ్యడం కంటే వెలుగు ని వెతుక్కుంటూ వెళ్లడం మేలు.. దాని కోసం దారిలో ఎన్ని కష్టాలు వచ్చినా, ఒక్కోదాన్ని దాటుకుంటూ వెళ్తే వెలుగు చూడడం తథ్యం.

Ratatouille (2007)


ఒక ఎలుక తన సంకల్ప బలంతో అద్భుతమైన వంటలు చెయ్యడం దీని ఇతివృత్తం. సంకల్పబలం ఉండి, సరైన టైం లో ఒక ఆసరా దొరికితే ఏదైనా సాధించొచ్చు… మన బంగార్రాజు “మురారి” అని చెప్పి సంకల్పబలం కోసం చేసిన రక్తపాతాల్లాంటివి లేకుండా, ఆడుతూ పాడుతూ ఒక ఎలుక చేసే విన్యాసాలు, తన కళ తనకు ఉన్న అంకితభావం, తన మీద తనకు ఉన్న నమ్మకం – భలే ముచ్చటేస్తుంది…

Home (2015)


మనం సరిగ్గా ఆలోచించకపోతే – నిజాయితీ, ధైర్యం, తెలివి తనకు ఉన్నాయని నాయకుడు మనల్ని మాయమాటలతో నమ్మించటం తేలిక… తప్పు జరిగినప్పుడు దాన్ని ఎవరి మీదనో తోసేసి తప్పించుకునేవాడి కంటే, సమయం వచ్చినప్పుడు సరైన నిర్ణయం తీసుకుని మనల్ని నడిపించేవాడే నాయకుడు.. ద్వేషించే వారిని కూడా గొప్పగా చూడగలిగినప్పుడు ప్రపంచం మనకు మరింత అందంగా ఉంటుంది…

How to train your dragon (2010)


మన ముందు తరాలు ఫలానా వారిని ద్వేషించాయి కనుక, మనం మన తర్వాతి తరాలు అలానే ద్వేషించాలి అని లేదు… ప్రేమ తో కూడా ప్రపంచాన్ని జయించొచ్చు… ఒకరిని మనం శత్రువు గా ఫీల్ అయ్యి మన జీవితం మొత్తం ఆ ద్వేషం లో నే బతికెయ్యడం, ఆ శత్రువు మీద గెలవటానికి మన శక్తి మొత్తం ధారపొయ్యడం కంటే, అసలు శత్రువు అంటే ఏంటి, root cause అంటే ఏంటో చూడగలిగితే మనం అనుకున్నది తేలిగ్గా సాధించొచ్చు…

Inside Out (2015)


ప్రతి మనిషి లో రెండు లేదా అంతకంటే ఎక్కువ పార్శ్వాలు ఉంటాయి… ఒక్కోసారి ఒక్కో పార్శ్వం ఇంకో పార్శ్వాన్ని అదిమిపెట్టేస్తుంది… అలాంటి సమయం లో మం చుట్టూ ఉన్నవాళ్లు ఎవరైనా మనల్ని బాగా గమనించి మనకు మార్గనిర్దేశం చెయ్యగలితే, వాళ్ళ సలహా ని మనం అర్థం చేసుకుని పాటించగలిగితే మనం మనుషులు గా ఉంటూ కూడా ఆనందం గా ఉండొచ్చు… అన్ని రసాలూ పరిచయం చేసేదే జీవితం…

Kung Fu Panda (2008)


మనం ఎందుకూ పనికిరారు అనుకున్న వాళ్ళు ఒక్కోసారి చాలా గొప్పవాళ్ళు అవుతారు… చాలా సార్లు వాళ్ళ బలం వారికే తెలియదు… అతనెవరో చెప్తాడు “మనం దేన్నైనా సాధించాలి అనుకుని మనసా వాచా కర్మణా కష్టపడితే, పంచభూతాలూ మనకు తోడ్పాటు అందిస్తాయి” అని… ఇది ఎంతవరకూ నిజమో కానీ, ఆత్మబలం ముందూ ఏదైనా తలవంచక తప్పదు… ఆ బలం మనకు ఉండి అని నమ్మే ఒక శక్తి (స్నేహం, గురువు etc) మన దగ్గర ఉండి ప్రోత్సహిస్తే చాలు..

అంతర్లీనంగా ఉన్న సందేశం తో పాటు, చాలా సున్నితమైన హాస్యం కూడా ఉంటుంది…

పిల్లలకు  ఇలాంటివి చూపిస్తే  కూడా ప్రయోజనం ఉంటుంది ,ద్దలు కూడా హాయి గా చూడొచ్చు…

–By HariKrishna MB

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి