iDreamPost

హిస్టరీ రిపీట్సంటే అంటే ఇదేనా ?

హిస్టరీ రిపీట్సంటే అంటే ఇదేనా ?

చరిత్ర పునరావృతం అవటమంటే చంద్రబాబునాయుడు విషయాన్ని చూస్తే అర్ధమైపోతుంది ఎవరికైనా. తన సలహాలు తీసుకోండి, ఆన్ లైన్లో ప్రతిపక్షాల నేతలతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడండి అంటూ చంద్రబాబు ప్రతిరోజు జగన్మోహన్ రెడ్డిని గోల పెట్టేస్తున్నాడు. తన అనుభవాన్ని అటు ప్రధానమంత్రి నరేంద్రమోడి ఇటు జగన్మోహన్ రెడ్డి ఇద్దరు గుర్తించటం లేదనే బాధ ఎక్కువగా కనబడుతోంది. సంక్షోభ సమయంలో తాను ప్రతిపక్షంలో కూర్చోవాల్సొచ్చిందే అన్న ఆక్రోశమే చంద్రబాబు మాటల్లో ఎక్కువగా వినబడుతోంది.

తన సలహాలను జగన్ తీసుకోవటం లేదనే అక్కసుతోనే ప్రతిరోజు మీడియా సమావేశాలు పెడుతూ ప్రభుత్వ పనితీరును తప్పుపడుతున్నాడు. సరే ఆయన మాటలను జనాలను ఎంతవరకూ పరిగణలోకి తీసుకుంటారు అన్నది వేరే విషయం. ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే హిస్టరీ రిపీట్స్ అన్న నానుడి చంద్రబాబు విషయంలో సరిగ్గా సరిపోతోందని చెప్పాలి. చంద్రబాబు అధికారంలో ఉన్నపుడు ఎలా వ్యవహరించారో ఇపుడు అదే ఫార్టీ ఇయర్స్ ఇండస్ట్రీకి ఎదురవుతోంది.

అధికారంలో ఉన్నపుడు చంద్రబాబు ఎలా వ్యవహరించారో గుర్తు చేసుకోండి. హుద్ హూద్ తుపాను వచ్చినపుడు ఒక్కసారి కూడా ప్రతిపక్షాలతో సమావేశం నిర్వహించలేదు. చేస్తున్న సహాయపనులకన్నా చేసుకుంటున్న ప్రచారమే ఎక్కువగా ఉందని ప్రతిపక్షాలు ఎంత మొత్తుకున్నా చంద్రబాబు ఏమాత్రం లెక్క చేయలేదు. ఎన్ని సూచనలు చేసినా పట్టించుకోలేదు. సరే తర్వాత వచ్చిన తిత్లీ తుపాను విషయంలో కూడా ఇదే పద్దతిలో ముందుకెళ్ళాడు.

ఇక రాజధాని నిర్మాణ విషయాన్ని చూద్దాం. రాజధానిని ఎక్కడ నిర్మించాలనే విషయంలో ప్రధాన ప్రతిపక్షమైన వైసిపి, ప్రతిపక్షాలు, జనాభిప్రాయం కూడా తీసుకోలేదు. తనకు కావాల్సిన కొందరితో మాట్లాడేసుకుని అమరావతిని రాజధానిగా నిర్ణయించేశాడు. అదే విషయాన్ని అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నపుడు ముందుగా లాబీల్లో మీడియాకు లీక్ చేశాడు. తర్వాత అసెంబ్లీలో ఏకపక్షంగా ప్రకటించేశాడు.

చివరగా విభజన హామీల అమలును కేంద్రప్రభుత్వం తుంగలో తొక్కేసింది. విభజన హామీల్లో కీలకమైన ప్రత్యేకహోదా, విశాఖపట్నం కేంద్రంగా ప్రత్యేక రైల్వేజోన్ ఏర్పాటును గాలికొదిలేసింది. పై రెండు అంశాల మీద కేంద్రంపై ఒత్తిడి పెంచేందుకు అఖిలపక్ష సమావేశాలు పెట్టాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అఖిలపక్ష సమావేశాలు అవసరమే లేదన్నాడు. తనకు చేతకాకపోతే కదా ప్రతిపక్షాలతో సమేవేశం పెట్టాల్సింది అంటూ ఎద్దేవా చేశాడు.

ఓ సందర్భంలో అయితే రాష్ట్రంలో అసలు ప్రతిపక్షాలే అవసరం లేదన్నాడు. అధికారంలో ఉన్నపుడు ప్రతిపక్షాలు అవసరం లేదని చెప్పిన ఇదే చంద్రబాబు ప్రతిపక్షంలోకి రాగానే మాత్రం అఖిలపక్ష సమావేశాలు పెట్టాలని పదే పదే డిమాండ్ చేయటమంటే ’హిస్టరీ రిపీట్స్’ అన్న నానుడినే గుర్తుకు తెస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి