iDreamPost

పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో క‌రోనా టెర్ర‌ర్..!

పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో క‌రోనా టెర్ర‌ర్..!

తొలి ద‌శే అనుకుంటే.. క‌రోనా రెండో ద‌శ అంత‌కు మించిన స్పీడుతో అల్ల‌క‌ల్లోలం సృష్టిస్తోంది. వ్యాక్సినేష‌న్ లో భార‌త్ రికార్డు అని సంబ‌ర‌ప‌డేలోప‌లే.. కేసుల న‌మోదులోనూ ఆల్ టైం రికార్డు అనే వార్త‌లు ఆందోళ‌న క‌లిగిస్తున్నాయి. సామాన్యుల నుంచి సెల‌బ్రిటీల వ‌ర‌కు అంద‌రినీ మ‌హ‌మ్మారి క‌మ్మేస్తోంది. వ‌రుస ఎన్నిక‌ల నేప‌థ్యంలో రెండో ద‌శ‌లో అత్య‌ధిక మంది రాజ‌కీయ నేత‌లు క‌రోనా బారిన ప‌డ్డారు. తెలుగురాష్ట్రాల‌లోనూ క‌రోనా బారిన ప్ర‌జాప్ర‌తినిధులు చాలా మందే ఉన్నారు. తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్ కూడా ఆ జాబితాలో ఉన్నారు. ఆయ‌నతో పాటు త‌న‌యుడు, మంత్రి కేటీఆర్ కూడా క‌రోనా బారిన ప‌డ్డారు. దీనికంత‌టికీ కార‌ణం నాగార్జున సాగ‌ర్ ఉప ఎన్నిక‌నే ప్ర‌చారం ఉంది. తిరుప‌తి ఉప ఎన్నిక ఎఫెక్ట్ కూడా ఏపీలో ప‌లువురు నేత‌లు వైర‌స్ బారిన ప‌డ‌డానికి కార‌ణం. ఇదిలాఉండ‌గా, యూపీకి చెందిన ఇద్దరు మంత్రులు, ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడి మృత్యువాత ప‌డ‌డం పొలిటిక‌ల్ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతోంది.

ఆ జాబితాలో చాలా మంది ప్ర‌ముఖులు…

రెండో ద‌శ‌లో క‌రోనా బారిన ప‌డ్డ రాజ‌కీయ ప్ర‌ముఖుల జాబితా చాలానే ఉంది. వారిలో మాజీ ప్ర‌ధాని మ‌న్మోహ‌న్ సింగ్, రాహుల్ గాంధీ, ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్య‌నాథ్‌, తెలంగాణ ముఖ్య‌మంత్రి కేసీఆర్, రాజ‌స్థాన్ సీఎం అశోక్ గెహ్లోత్, కర్ణాటక ముఖ్యమంత్రి యడియూరప్ప ఏకంగా రెండు మార్లు కరోనా బారినపడ్డారు. కేరళ సీఎం పినరయి విజయన్, త్రిపుర సీఎం బిప్లాబ్ కుమార్ దెబ్, కర్ణాటక సీఎం యడియూరప్ప, హరియాణా సీఎం మనోహర్ లాల్ ఖట్టర్.. ఇలా ముఖ్య‌మంత్రులు, ముఖ్య నాయ‌కులు చాలా మంది క‌రోనా బారిన ప‌డ్డారు. వీరిలో చాలా మంది ఇప్ప‌టికే కోలుకున్నారు. మ‌రి కొంద‌రు చికిత్స పొందుతున్నారు. ఇక‌, మ‌హ‌మ్మారి బారిన ప‌డ్డ ఎమ్మెల్యేల జాబితా అయితే చాలానే ఉంది.

ముగ్గురు మంత్రులు, ఇద్ద‌రు ఎమ్మెల్యేలు మృతి

మహమ్మారి దెబ్బకి సామాన్యులతో పాటుగా ప్రముఖులు రాజకీయ నేతలు కూడా కన్నుమూస్తున్నారు. ఇక ఈ వైరస్ దేశంలో అతి పెద్ద రాష్ట్రమైన యూపీ లో చాలా వేగంగా విజృంభిస్తుంది. కరోనా వైరస్ ధాటికి మంత్రులు ఎమ్మెల్యేలు తట్టుకోలేకపోతున్నారు.రాష్ట్ర ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్తోపాటు చాలామంది మంత్రులు ఎమ్మెల్యేలు కరోనా బారినపడ్డారు. ఆ రాష్ట్రంలో కరోనా మృతుల సంఖ్య కూడా భారీగానే ఉంది. అలాగే ఇప్పటివరకు యూపీకి చెందిన ఇద్దరు మంత్రులు ముగ్గురు ఎమ్మెల్యేలు కరోనా బారినపడి మృత్యువాత పడ్డారు. నవాబ్ గంజ్ బీజేపీ ఎమ్మెల్యే కేసర్ సింగ్ గంగ్వార్ కరోనాతో బాధపడుతూ ఇటీవ‌లే మృతి చెందారు. అంతకుముందు ఆయన కరోనాపై ‘కరోనా ఎక్కడ ఉంది అసలు మాస్క్లు ధరించడం అవసరమా అని అప్పట్లో ప్రశ్నించాడు. అంతే కాకుండా కరోనా విజృంభిస్తున్నా కూడా ఆయన కనీసం మాస్క్ ధరించకుండా విచ్చలవిడిగా తిరిగాడు. అంతకుముందు ఉత్తరప్రదేశ్లో ఇద్దరు మంత్రులు కరోనా బారినపడి చనిపోయారు. మంత్రులు చేతన్ చౌహన్ కమలరాణి వరుణ్ లక్నో పశ్చిమ ఎమ్మెల్యే సురేశ్ శ్రీవాస్తవ ఆరయ్య సదర్ ఎమ్మెల్యే రమేశ్ దివాకర్ కరోనా బారినపడి కన్నుమూశారు. ఈ ప‌రిణామాల‌న్నీ రాజ‌కీయ వ‌ర్గాల్లో క‌ల‌క‌లం రేపుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి