iDreamPost

హైపవర్‌ కమిటీ ప్రజెంటేషన్‌.. జగన్‌ సర్కార్‌ ఏం చేయబోతోంది..?

హైపవర్‌ కమిటీ ప్రజెంటేషన్‌.. జగన్‌ సర్కార్‌ ఏం చేయబోతోంది..?

ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి, పరిపాలన వికేంద్రీకరణను సూచిస్తూ జీఎన్‌ రావు, బీసీజీ ఇచ్చిన నివేదికలపై సమగ్రంగా అధ్యయనం చేసిన హైపవర్‌ కమిటీ ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్‌కు పవర్‌ పాయింట్‌ ప్రజెంటేషన్‌ ఇచ్చింది. రెండు నివేదికలపై మూడు సార్లు సమావేశమైన ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ నేతృత్వంలోని కమిటీ ఈ రోజు తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ప్రజెంటేషన్‌ ద్వారా తమ సూచనలను వివరించింది.

మంత్రులు, ఉన్నతాధికారులతో జీఎన్‌ రావు, బీసీజీ కమిటీల నివేదికలను అధ్యయనం చేసి ప్రభుత్వానికి మార్గదర్శనం చేసేందుకు ఈ హైవవర్‌ కమిటీని నియమించిన విషయం తెలిసిందే. రేపు శనివారం రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనున్న నేపథ్యంలో హైపవర్‌ కమిటీ తన సూచనలను ఈ రోజు సీఎం వైఎస్‌ జగన్‌కు వివరించడం గమనార్హం. రేపు జరగబోయే మంత్రి వర్గ సమావేశంలో హైపవర్‌ కమిటీ ఇచ్చిన సూచనలపై సమగ్రంగా చర్చి, ఆమోదించనుంది.

రాష్ట్రంలో మూడు ప్రాంతాలలో మూడు రాజధానులు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ ఆలోచనకు ఈ నెల 20న జరగబోయే అసెంబ్లీ ప్రత్యేక సమావేశంలో ఓ రూపం రానుంది. అంతకు రెండు రోజుల ముందే రేపు జరగనున్న మంత్రివర్గ సమావేశంలో మూడు రాజధానులు, పరిపాలన వికేంద్రీకరణపై ప్రభుత్వం ఓ నిర్ణయానికి రానుంది.

ఇప్పటికే మూడు రాజధానుల ఏర్పాటకు సుముఖంగా ఉన్న వైఎస్‌ జగన్‌ సర్కార్‌ హై పవర్‌ కమిటీ మార్గదర్శకాల అనంతరం ఏం చేయబోతోందన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది. ఒకే రాజధానిగా అమరావతిని కొనసాగిస్తారా..? లేక మూడు రాజధానులు ఏర్పాటు చేస్తారా..? లేదా మరేదైనా నూతన నిర్ణయం తీసుకుంటారా..? అన్నది చర్చినీయాంశంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి