iDreamPost

నర రూప రాక్షసులనుకుంటే.. నిర్దోషులుగా మారారు

నర రూప రాక్షసులనుకుంటే.. నిర్దోషులుగా మారారు

చట్టం ముందు పది మంది దోషులు తప్పించుకోవచ్చునేమో కానీ.. ఒక నిర్దోషికి శిక్ష పడకూడదని భావిస్తుంది న్యాయ వ్యవస్థ. కానీ కొన్ని తీర్పులు చూస్తుంటే సందేహాలు, అనుమానాలు అలానే ఉండిపోతుంటాయి. అటువంటిదే ఈ కేసు కూడా. ఎప్పుడో 2005-06 మధ్యలో ఓ ఇంట్లో జరిగిన వరుస హత్యల కేసులో 17 ఏళ్ల తర్వాత నిందితులకు అనుకూలంగా తీర్చు వచ్చింది. మహిళలు, చిన్నారులపై అత్యాచారాలకు ఒడిగట్టి.. ఆపై హత్య చేశారన్న ఆరోపణలపై నిందితులుగా ఉన్న ఇద్దర్ని ఓ హైకోర్టు నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పునిచ్చింది. సాక్ష్యమే కోర్టుకు కీలకం.. దాని ఆధారంగానే జడ్జిమెంట్ ఉంటుంది. కానీ అప్పట్లో సంచలనమైన ఈ ఘటనలో నిందితులు.. నిర్దోషులుగా మారిపోయారు. ఇంతకు ఆ కేసు ఏంటంటే..?

2005-06లో ఉత్తరప్రదేశ్‌లోని నోయిడాలోని నిథారీ ప్రాంతంలోని మోనీందర్ పంధేర్ అనే వ్యక్తి ఇంట్లో వరుస హత్యలు జరిగాయి. సురీందర్ కోలీ.. మోనీందర్ ఇంట్లో సహాయకుడిగా ఉండేవాడు. కోలీ చిన్నారులు, మహిళలను ఆ ఇంటికి తీసుకు వచ్చి మోనీందర్ కలిసి అత్యాచారానికి ఒడిగట్టేవాడు. ఆ తర్వాత హత్యలు చేసేవారు. సాక్ష్యాలు దొరక్కుండా మృతదేహాలను నరికి, ఆ భాగాలను కాలువలో పడేసేశారు. అతని ఇంటికి సమీపంలోని డ్రెయిన్‌లో మానవ అవశేషాలు కనబడటంతో ఈ విషయం పోలీసుల దృష్టికి వెళ్లింది. ఆ కాలువలో తప్పిపోయిన పిల్లల శరీర భాగాలు ఉండటం.. ఆ ఇద్దర్నీ అదుపులోకి తీసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసును ఆ తర్వాత సీబీఐకి అప్పగించారు. 2007 నిందితులిద్దరిపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టింది.

విచారణలో సురీందర్ కోలీ.. తన యజమాని ఇంట్లో అనేక మంది పిల్లలపై అత్యాచారానికి పాల్పడ్డామని, హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. అత్యాచారమే కాదూ.. చంపి శరీర భాగాలను కూడా తిన్నట్లు అప్పట్లో అంగీకరించాడు. 20 ఏళ్ల యువతిపై హత్యాచారం కేసులో వీరిద్దరూ దోషులుగా తేలారు. ఆ ఇంట్లో గుట్టలు గుట్టలుగా మానవ అవశేషాలు ఉండటంతో ఆ ఇంటిని హౌస్ ఆఫ్ హర్రర్ అని పిలుస్తుంటారు. తాజాగా ఈ కేసు విచారణ చేపట్టిన అలహాబాద్ హైకోర్టు.. సురీంరద్ పై సుమారు 12 కేసులు నమోదు కాగా, అన్ని కేసుల్లోనూ ఆయన్ను నిర్దోషిగా విడుదల చేసింది. ఈ కేసులో సహ నిందితుడైన మోనీందర్ సింగ్ పై నమోదైన ఆరు కేసుల్లో ..రెండింటిలో నిర్దోషిగా విడుదలయ్యాడు. వారి మరణ శిక్షలు కూడా రద్దు అయ్యాయి. సరైన సాక్ష్యాధారాలు లేకపోవడంతో నిర్దోషులుగా విడుదల చేసినట్లు అధికారులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి