iDreamPost

తొలి టీ20 ఓటమిపై హార్దిక్ కామెంట్స్.. తిట్టిపోస్తున్న నెటిజన్స్!

తొలి టీ20 ఓటమిపై హార్దిక్ కామెంట్స్.. తిట్టిపోస్తున్న నెటిజన్స్!

టీమిండియా టూర్ ఆఫ్ వెస్టిండీస్ 2023లో భారత్ ఆధిపత్యానికి బ్రేక్ పడింది. టెస్టు, వన్డే సిరీస్ తర్వాత గురువారం ప్రారంభమైన టీ20 సిరీస్ లో టీమిండియా తడబడింది. తప్పకుండా గెలవాల్సిన మ్యాచ్ లో హార్దిక్ సేన కేవలం 4 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. బౌలర్లు తమ వంతు పాత్రను పర్ఫెక్ట్ గా ప్లే చేశారు. కానీ, స్వల్ప లక్ష్యాన్ని ఛేదించడంలో భారత బ్యాటర్లు చేతులెత్తేశారు. 149 పరుగుల తక్కువ స్కోర్ ఛేజ్ చేయలేక టీమిండియా చతికిలడటంతో ఫ్యాన్స్ అసహనం వ్యక్తం చేస్తున్నారు. దానికితోడు హార్దిక్ చేసిన కామెంట్స్ క్రికెట్ ఫ్యాన్స్ కోపాన్ని ఇంకాస్త పెంచినట్లు అయింది.

తొలి టీ20ని టీమిండియా ఓటమితో ప్రారంభించింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న వెస్టిండీస్ స్టార్టింగ్ నుంచి డిఫెన్స్ లో పడిపోయింది. యుజ్వేంద్ర చాహల్ స్పిన్ మాయాజాలంతో 5వ ఓవర్లో రెండు వికెట్లు తీసి.. ఓపెనర్లను పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత కుల్దీప్ యాదవ్, హార్దిక్ పాండ్యా, అక్షర్ పటేల్ తమ వంతు పాత్ర పోషించారు. తలో వికెట్ తీసి వెస్టిండీస్ ని కేవలం 149 పరుగులకే కట్టడి చేయడంలో సఫలీకృతులయ్యారు. విండీస్ లో రోవ్మన్ పోవెల్(48), పూరన్(41), బ్రాండన్ కింగ్(28) తప్ప మిగిలిన ప్లేయర్లు పెద్దగా ఆకట్టుకోలేకపోయారు. ఈ లక్ష్యాన్ని ఛేదించడం పెద్ద విషయం కాదని అంతా అనుకున్నారు. కానీ, బొమ్మ రివర్స్ అయింది.

బ్యాటర్లు తడబాడుకు గురవ్వడంతో తొలి టీ20లో ఓటమి తప్పలేదు. జేసన్ హోల్డర్, రొమేరియో షెపర్డ్, ఒబెడ్ మెకాయ్ లు తలో రెండు వికెట్లు పడగొట్టారు. అకీల్ హుస్సేన్ కు ఒక వికెట్ దక్కింది. అకీల్ హుస్సేన్, జేసన్ హోల్డర్లు పరుగులు ఇవ్వకుండా చాలా కట్టడి చేస్తూ బౌలింగ్ చేశారు. ఇంక భారత్ బ్యాటింగ్ విషయానికి వస్తే.. తెలుగు కుర్రాడు తిలక్ వర్మ(39) మినహా ఎవరూ ఆశించిన మేర రాణించలేకపోయారు. ఓపెనర్లు ఇషాన్ కిషన్(6), శుభ్ మన్ గిల్(3) తీవ్రంగా నిరాశ పరిచారు. సూర్యకుమార్ యాదవ్(21), హార్దిక్ పాండ్యా(19), అక్షర్ పటేల్(13), సంజూ శాంసన్(12), అర్షదీప్ సింగ్(12) పరుగులు మాత్రమే చేయగలిగారు. ఏ ఒక్క బ్యాటర్ కూడా ఆశించిన ఫలితాన్ని రాబట్టలేకపోయారు.

ఇంక మ్యాచ్ అయిన తర్వాత కెప్టెన్ హార్దిక్ పాండ్యా పలు కీలక వ్యాఖ్యలు చేశాడు. ఓటమికి గల కారణాలను, తమ తప్పిదాలను మీడియాతో పంచుకున్నాడు. మేము ఛేదనను కరెక్ట్ గానే ప్రారంభించాము. కానీ, కొన్ని తప్పిదాల వల్ల ఆటను కోల్పోవాల్సి వచ్చింది. మరేం పర్వాలేదు. కుర్రాళ్లు అన్న తర్వాత తప్పులు చేయడం సహజం. మేమంతా కలిసి కట్టుగా ముందుకు వెళ్తాం. ఇక్కడ మంచి విషయం ఏంటంటే మాకు ఆట మీద మాకు పట్టు ఉంది. రాబోయే నాలుగు మ్యాచుల్లో మంచి ఫలితాలను రాబడతామని ఆశిస్తున్నాం. టీ20 క్రికెట్ లో మీరు వికెట్లు కోల్పోయారు అంటే.. ఎంత చిన్న లక్ష్యాన్ని అయినా ఛేదించడం కష్టం. ఈ గేమ్ లో కూడా అదే జరిగింది.

వికెట్లు పడిపోవడం వల్లే ఛేజింగ్ సాధ్యం కాలేదు. ముగ్గురు స్పిన్నర్లను ఎదుర్కోవడం కూడా సవాలు అనే చెప్పాలి. కుల్దీప్, చాహల్ కు అవకాశాలు ఇవ్వాలి అనుకుంటున్నాం. అక్షర్ పటేల్ అటు బ్యాటింగ్ లో కూడా తన సత్తా చాటాడు. ముఖేష్ కుమార్ ఈ రెండు వారాల్లో మూడు ఫార్మాట్లలో అరంగేట్రం చేయడం సంతోషంగా ఉంది. అతను చాలా మంచి వ్యక్తి. తిలక్ వర్మ ఇన్నింగ్స్ ప్రారంభించిన తీరు ఆకట్టుకుంది. సిక్సులతో మీ అంతర్జాతీయ క్రికెట్ కెరీర్ ను ప్రారంభించడం మంచి విషయమే. అలాంటి కాన్ఫిడెన్స్, తెగువ ఉన్న ఆటగాళ్లు టీమిండియాలో అద్భుతాలు సృష్టించగలరు” అంటూ హార్దిక్ పాండ్యా చెప్పుకొచ్చాడు. అయితే కెప్టెన్ గా టీమ్ ను హార్దిక్ బాగానే వెనకేసుకొచ్చాడు. కానీ, కెప్టెన్ హార్దిక్ విఫలమయ్యాడు అంటూ నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గెలవాల్సిన మ్యాచ్ లో కేవలం 4 పరుగుల తేడాతో ఓడిపోవడం ఏంటని ప్రశ్నిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి