iDreamPost

80 ఏళ్ళ నిత్యయవ్వనుడు అమితాబ్

80 ఏళ్ళ నిత్యయవ్వనుడు అమితాబ్

ఏ నటుడికైనా రిటైర్మెంట్ ఉంటుంది. అది సహజం. ముఖ్యంగా ఆరు పదుల వయసు దాటాక ఒంట్లో శక్తి తగ్గిపోయి ఇంటికే పరిమితం కావాలన్న డాక్టర్ల సలహా ఎక్కువ పని చేయనివ్వకుండా ఆపుతుంది. కానీ కొందరు కారణ జన్ములు మాత్రం దానికి మినహాయింపుగా నిలుస్తారు. బిగ్ బి అమితాబ్ బచ్చన్ ఇందులో మొదటి వరసలో ఉంటారు. కొత్తగా విడుదలైన గుడ్ బైలో రష్మిక మందన్న తండ్రిగా చూసినా, 2000లో మొదలైన కౌన్ బనేగా కరోడ్ పతిలో అదే ఉత్సాహాన్ని ఇప్పటికీ కొనసాగించినా ఆ ఎనర్జీకి ఫిదా కాకుండా ఉండలేం. చిరంజీవి అడిగితే సైరాలో నటించారు. నాగార్జున రిక్వెస్ట్ చేస్తే మనంలో తళుక్కున మెరిశారు. బాషా భేదం లేని ఆర్టిస్టాయన.

నిజానికి అమితాబ్ తొలి రోజుల్లో అవకాశాల కోసం ప్రయత్నించినప్పుడు తిరస్కారమే ఎదురయ్యింది. అయినా పట్టువదలని విక్రమార్కుడిలా ప్రయత్నాలు చేస్తూనే వచ్చారు. సాత్ హిందూస్థానీతో 1969లో మొదలుపెడితే మొదటి బ్రేక్ 1972 జంజీర్ రూపంలో దక్కింది. 1975లో షోలే, దీవార్ లు అప్పటిదాకా రాజేష్ ఖన్నా సృష్టించిన రొమాంటిక్ సామ్రాజాన్ని కూలదోసి సరికొత్త యాక్షన్ జానర్ ని పరిచయం చేశాయి. అమితాబ్ స్టార్ డం ఎంతగా పెరిగిందంటే 1982లో కూలీ షూటింగ్ సందర్భంగా గాయపడితే దేశం మొత్తం ఆయన కోలుకోవాలని పూజలు వ్రతాలు చేసేంత. ప్రాణాపాయం నుంచి బయటపడటానికి నిజంగా అదే కారణమంటే ఒప్పుకోక తప్పదు.

1990 తర్వాత హిట్లు తగ్గిపోయి 1996లో ఏబిసి కార్పొరేషన్ స్థాపించాక డిజాస్టర్ సినిమాలతో తీవ్ర నష్టాలు ఎదురుకున్నారు. దివాలా ముంగిట్లో ఉన్నప్పుడు చేసిన టీవీ షో కౌన్ బనేగా కరోడ్ పతి ఆయనకో కొత్త కెరీర్ ని ప్రసాదించింది. బిగ్ బి యాంకరింగ్ కి ఆడియన్స్ కళ్లప్పగించి షోని మిస్ కాకుండా చూసేవారు. దెబ్బకు అప్పటిదాకా మనుగడ కోసం పోరాడుతున్న స్టార్ ఛానల్ నెంబర్ వన్ స్థానానికి చేరుకుంది. ముదిమి వయసులో అమితాబ్ చేసిన కభీ ఖుషి కభీ గం, మొహబ్బతే, వీర్ జారా, లక్ష్య లాంటి బ్లాక్ బస్టర్స్ ఎన్నో లెక్క బెట్టడం కష్టం. ఇప్పటికీ ఉత్సాహం తగ్గని నవయువకుడిలా బిగ్ బి ఇంత బిజీగా ఉండటం చూస్తే మనసులో ఎంత నిరాశ ఉన్నా చిటికెలో మాయమవ్వడం ఖాయం. అమితాబ్ జీవితమే ఒక వ్యక్తిత్వ వికాస పుస్తకం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి