iDreamPost

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా : సీపీఐ నారాయణ

ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నా : సీపీఐ నారాయణ

ఆంధ్రప్రదేశ్‌ రాజధాని అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై విచారణ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని స్వాగతిస్తున్నామని సీపీఐ కేంద్ర కార్యవర్గ సభ్యుడు కె.నారాయణ అన్నారు. ఈ విషయంలో పారదర్శకంగా వ్యవహరించాలన్నారు. అక్రమ పద్ధతుల్లో ఎవరు భూములు కొనుగోలు చేసినా క్షమించరాదని పేర్కొన్నారు.

తమ పార్టీ మొదటి నుంచి ఈ విషయంపై ఒకే నిర్ణయంపై ఉందని తెలిపారు. ప్రారంభంలోనే విచారణ జరిపించాలని తాము డిమాండ్‌ చేశామని చెప్పుకొచ్చారు. ఇప్పటికైనా సమగ్ర దర్యాప్తు జరిపించిన తర్వాత, దోషులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.

కాగా, అమరావతిలో జరిగిన భూ కుంభకోణంపై లోకయుక్తా లేదా, సీబీ సీఐడీ, సీబీఐ లలో ఏదో ఒక సంస్థతో సమగ్ర దర్యాప్తు చేయించేందుకు ఇటీవల సీఎం జగన్‌ నేతృత్వంలోని మంత్రివర్గం నిర్ణయించిన విషయం తెలిసిందే. ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ అథ్యక్షతన ఏర్పాటైన మంత్రివర్గ ఉపసంఘం రాజధానిలో ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగిందని నివేదిక ఇచ్చింది. తమ విచారణలోనే 4 వేల ఎకరాలకు పైగా అక్రమంగా కొన్నట్లు తేలిందని మంత్రివర్గ ఉససంఘం పేర్కొంది.

మరోవైపు తాము అక్రమంగా ఎలాంటి భూములు కొనలేదని, ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ జరిగితే ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని టీడీపీ అధికార వైఎస్సార్‌సీపీని ప్రశ్నిస్తోంది. ఈ నేపథ్యంలో దర్యాప్తు చేయించాలని ప్రభుత్వం నిర్ణయించింది. న్యాయ నిపుణుల సలహా మేరకు ఏ సంస్థకు అప్పగించేది త్వరలో నిర్ణయించనున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి