iDreamPost

ఏపీలో బస్సులకు గ్రీన్‌ సిగ్నల్‌!.. షరతులు వర్తిసాయి..

ఏపీలో బస్సులకు గ్రీన్‌ సిగ్నల్‌!.. షరతులు వర్తిసాయి..

నాలుగో విడత లాక్‌డౌన్‌లో కేంద్రం సూచించిన మార్గదర్శకాల మేరకు ఆర్టీసీ బస్సులను దశలవారీగా నడపాలని ఏపీ ప్రభుత్వం నిర్ణయించింది. అలాగే ప్రైవేటు బస్సులు తిప్పేందుకు అనుమతివ్వాలని సూత్రప్రాయంగా నిర్ణయం తీసుకుంది. సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఉన్నతస్థాయి సమావేశంలో ఆర్టీసీ బస్సులను తిప్పడంపై చర్చ సాగింది. రెండు మూడు రోజుల్లో ఇందుకు సంబంధించి తేదీలు వెల్లడిస్తారు. అయితే ఇందులో కఠిన నిబంధనలు తప్పక పాటించాల్సిందే. బస్సులో సగం సీట్లలో మాత్రం ప్రయాణికులను నింపి నడపాలి. ప్రైవేటు బస్సుల్లో అయితే 20 మందికి మాత్రమే అనుమతి ఉంటుంది. ఆయా సీట్ల మధ్య భౌతిక దూరం ఉండేలా బస్సుల్లో ఏర్పాట్లు చేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పటికే ఆర్టీసీలోని ఒక్కో డిపోలోని 5 బస్సుల్లో ప్రయోగ్మాకంగా సీట్ల మార్పిడి చేశారు. ఇప్పుడు ఇదే విధానాన్ని సగం బస్సులకు వర్తింపజేయాలని అధికారులు ఆలోచిస్తున్నారు. ప్రయాణికులు తప్పనిసరిగా మాస్కులు ధరించాలనే నిబంధన ఉంటుంది. మాస్కులు లేకపోతే బస్సుల్లోకి అనుమతి ఉండదు.

మొదటి దశలో బస్టాంట్‌ నుంచి బస్టాండ్‌కు మాత్రమే..

ప్రస్తుతం వలస కార్మికులను ఆర్టీసీ బస్సుల్లో సొంత ప్రాంతాలకు తరలించే కార్యక్రమం శరవేగంగా సాగుతోంది. రెండు మూడు రోజుల్లో కార్మికుల తరలింపు పూర్తయ్యే అవకాశం ఉంది. ఆ తర్వాత బస్సులను ప్రయాణికుల కోసం తిప్పుతారు. మొదటి దశలో బస్టాండ్‌ నుంచి బస్టాండ్‌కు మాత్రం సర్వీసులు ఉంటాయి. మధ్యలో స్టాపుల్లో ప్రయాణికులను ఎక్కించుకోవడం ఉండదు. అదే సమయంలో ఎక్కిన ప్రతి ప్రయాణికుడి వివరాలను సేకరించనున్నారు. పేరు, అడ్రస్‌, ఎక్కడి నుంచి ఎక్కడికి వెళుతున్నారు అనే వివరాలు తీసుకుంటారు. దీనివల్ల ఏదైనా ఇబ్బంది వచ్చినప్పుడు ట్రేసింగ్‌ సులభంగా ఉంటుంది. అలాగే అన్ని బస్టాండ్లలో ప్రయాణికుడికి స్క్రీనింగ్‌ తప్పనిసరిగా ఉంటుంది. అనారోగ్య లక్షణాలు ఉంటే ప్రయాణానికి అనుమతించరు. అలాగే ఉద్యోగాల రీత్యా హైదరాబాద్‌, చెన్నై, బెంగళూరు లాంటి ప్రాంతాల్లో ఉండి, లాక్‌డౌన్‌ వల్ల అక్కడే ఉన్న వారి కోసం వెంటనే బస్సులు నడపాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయా రాష్ట్ర ప్రభుత్వాలతో మాట్లాడిన తర్వాత దీనిపై ఒక ప్రకటన వస్తుంది.

చార్జీల పెంపునపై అధికారులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం: మంత్రి పేర్ని నాని

గత 50 రోజులకుపైగా లాక్‌డౌన్‌తో ఏపీఎస్‌ ఆర్టీసీకి దాదాపు 700 కోట్లు నష్టం వచ్చిందని మంత్రి పేర్ని నాని వెల్లడించారు. అందువల్ల స్వల్పంగా చార్జీల పెంపునపై అధికారులతో మాట్లాడిన తర్వాత నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి