iDreamPost

నారావారి చెయ్యిదాటి పోయిన నారావారిపల్లె

నారావారి చెయ్యిదాటి పోయిన నారావారిపల్లె

నిన్న మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి స్వగ్రామం నారావారిపల్లెలో రాజధాని వికేంద్రీకరణకు మద్దతుగా చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి గారు తలపెట్టిన బహిరంగ సభ విజయవంతమైన తీరు చూస్తే బాబు గారి స్వగ్రామంలో , చుట్టుపక్కల గ్రామాల్లో కూడా రాజధాని వికేంద్రీకరణ పట్ల అత్యంత సానుకూలత ఏర్పడింది అని చెప్పొచ్చు .

సాధారణంగా అధికార పార్టీ నిర్వహించే బహిరంగ సభలకు ఆయా ప్రభుత్వాలు జనాన్ని తరలించే ప్రయత్నాలు చేస్తాయి . కానీ నారావారిపల్లెలో కనీస వసతులు మాత్రమే ఏర్పాటు చేసిన బహిరంగ సభకు ఇరవై ఐదు వేల మంది జనం స్వచ్ఛందంగా తరలిరావటం వైసీపీ పార్టీ పట్ల , జగన్ పట్ల బాబు స్వగ్రామంలో కూడా ఏర్పడ్డ నమ్మకానికి నిదర్శనం .

అంతే కాదు వైసీపీ అధికారంలోకి వచ్చాక చేపట్టిన నవరత్నాలు లాంటి సంక్షేమ పథకాలు , బాబు గారు అమరావతికే పరిమితం చేస్తున్న అభివృద్ధిని అన్ని ప్రాంతాలకు వికేంద్రీకరణ చేస్తున్న విధానం , రాయలసీమ త్రాగు , సాగు నీటి అవసరాలు గుర్తించి ప్రాధాన్యతా క్రమంలో ప్రాజెక్టుల నిర్మాణాన్ని చేపట్టడం , గ్రామ సచివాలయాలు , విలేజ్ వలంటీర్ వ్యవస్థల ద్వారా తమ గ్రామవాసులకు స్థానికంగానే ఉద్యోగ కల్పన జరగడం , వారి చేతుల మీదుగానే పింఛన్లు , ఇతరత్రా సంక్షేమ పథకాలు అందుకోవడం లాంటి కార్యక్రమాలన్నీ వైసీపీ ప్రభుత్వం పట్ల ఆకర్షణ ఏర్పరిచి సభకి జనం తరలిరావడానికి తోడ్పడింది .

బహిరంగ సభలు నిర్వహించడం వేరు విజయవంతం కావడం వేరు .సాధారణంగా అధికార పార్టీ ఏర్పాటు చేసే బహిరంగ సభల్లో ఆయా పార్టీల మంత్రులు , ఎమ్మెల్యేల ఊకదంపుడు ప్రసంగాలు , సోత్కర్ష , ప్రత్యర్థి పార్టీల పై ఆరోపణలతో విసుగెత్తుతాయి.

కానీ ఈ సభలో ఆ సంప్రదాయానికి స్వస్తి పలికి ప్రభుత్వ కార్యక్రమాలు , సంక్షేమ పథకాలు రూపకల్పన , నిర్వహణ భాద్యతలు మోసే కీలక అధికారుల చేత ఆయా అంశాల గురించి , వాటిలోని లోటుపాట్లు ప్రజలకు వివరించే బాధ్యతను కూడా అప్పగించి ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజయ్ కళ్ళం లాంటి రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ గారి చేత ప్రసంగింపజేయడం , వారి ప్రసంగం సైతం అనవసరమైన రాజకీయ వ్యాఖ్యలు లేకుండా సరళమైన పదజాలంతో పలు అంశాలపై స్పష్టతనిస్తూ సాగి సభకి పరిపూర్ణత చేకూర్చినట్లు అయ్యింది.

ఏదేమైనా ఇలాంటి ఓ మంచి సాంప్రదాయాన్ని ప్రవేశపెట్టిన వైసీపీ పార్టీని అభినందించవచ్చు . జాతీయ స్థాయి నుండి రాష్ట్రాస్థాయికి , రెండు జిల్లాల స్థాయికి దిగజారిపోయిన బాబు గారి గ్రాఫ్ సొంత గ్రామంలో మరింత దిగజారిపోయింది అని నిరూపించింది ఈ బహిరంగ సభ .

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి