iDreamPost

తెలుగు గవర్నర్‌కు తప్పిన ప్రమాదం

తెలుగు గవర్నర్‌కు తప్పిన ప్రమాదం

కేంద్ర మాజీ మంత్రి, హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌ బండారు దత్తాత్రేయ రోడ్డు ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. ఆయన ప్రయాణిస్తున్న కారు అదుపుతప్పి జాతీయ రహదారి పక్కన గుంతలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన హైదరాబాద్‌ – విజయవాడ జాతీయ రహదారిపై యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్‌ మండలం కైతాపురం వద్ద సోమవారం జరిగింది. ప్రమాద సమయంలో దత్తాత్రేయ ముందు సీటులోనే కూర్చుకుని ఉన్నారు. అయితే ఆయన సీటు బెల్ట్‌ ధరించి ఉండడంతో ఎలాంటి గాయాలు కాలేదు. దత్తాత్రేయతోపాటు కారు డ్రైవర్, సిబ్బందికి ఎలాంటి ప్రమాదం జరగలేదు.

తెలంగాణ రాష్ట్రానికి చెందిన 73 ఏళ్ల బండారు దత్తాత్రేయ బీజేపీలో ఆ రాష్ట్ర అగ్రనేతగా ఉన్నారు. బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడి వరకూ వివిధ హోదాల్లో పని చేశారు. ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వచ్చిన దత్తాత్రేయ తొలిసారి సికింద్రాబాద్‌ నియోజకవర్గం నుంచి 1991లో లోక్‌సభకు ఎన్నికయ్యారు. వాజపేయి కేబినెట్‌లో సహాయ మంత్రిగా పని చేశారు. 1998లో రెండోసారి గెలిచి.. వాజపేయి కేబినెట్‌లో సహాయ మంత్రిగా పని చేశారు. 1999 ఎన్నికల్లోనూ మూడోసారి సికింద్రాబాద్‌ నుంచి గెలిచి మళ్లీ మంత్రి పదవి దక్కించుకున్నారు. 2004, 2009లో ఓటమిపాలైన దత్తాత్రేయ.. 2014లో నాలుగోసారి గెలిచి నరేంద్ర మోదీ కేబినెట్‌లో కార్మిక శాఖ సహాయ మంత్రిగా పని చేశారు. 2019 ఎన్నికలకు ముందు ఆయన్ను మోదీ ప్రభుత్వం హిమాచల్‌ ప్రదేశ్‌ గవర్నర్‌గా పంపింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి