iDreamPost

ప్రభుత్వం అప్రమత్తం.. మరి ప్రజలు..?

ప్రభుత్వం అప్రమత్తం.. మరి ప్రజలు..?

కోవిడ్‌ 19ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం అప్రమత్తంగా వ్యవహరిస్తోంది. డిసెంబరు 31 వరకు అన్ని అంతర్జాతీయ సర్వీస్‌లను నిలిపివేస్తూ తాజాగా ఉత్తర్వులు జారీ చేసింది. అంతర్జాతీయ విమానాల రాకపోకలకు అనుమతించిన తరువాతనే మన దేశంలో కోవిడ్‌ విజృంభణ ప్రారంభమైందని ఒక వాదన కూడా విన్పించేది. కారణం ఏదైనా విదేశాలకు రాకపోకలపై ఆంక్షలను వచ్చేనెల వరకు పొడిగించి కోవిడ్‌ కట్టడికి తన అప్రమత్తతను ప్రభుత్వం తేటతెల్లం చేసింది.

అయితే ప్రభుత్వాలు చెబుతున్న మాటలు, పెడుతున్న ఆంక్షలను ఫాలో అయ్యి బాధ్యతగా వ్యవహరించాల్సిన ప్రజల చేతుల్లోనే కోవిడ్‌ సెకెండ్‌వేవ్‌ అయినా, థర్డ్‌ వేవ్‌ అయినా ఆధారపడి ఉందని చెప్పక తప్పదు. ప్రస్తుతం ఉభయ తెలుగు రాష్ట్రాలు, తమిళనాడు, కర్నాటకలపై తుఫాను ప్రభావం కారణంగా అతి భారీ వర్షాలతోపాటు, వర్షాల్లేని ప్రాంతాల్లో విపరీతమైన చలి వాతావరణం నెలకొని ఉంది. విదేశాల్లో ఈ తరహా వాతావరణం కారణంగానే పాజిటివ్‌లు నమోదు పెరిగిందని అక్కడి వైద్యనిపుణులు హెచ్చరిస్తున్నారు.

ఇటువంటి పరిస్థితుల్లో ప్రజలు ఎవరికి వారు వ్యక్తిగతంగా జాగ్రత్తలు పాటించాల్సిన బాధ్యతను వైద్య రంగ ప్రముఖులు పదేపదే గుర్తు చేస్తున్నారు. ప్రత్యేక కార్గో విమానాలు మినహా అంతర్జాతీయ స్థాయిలో రాకపోకలు కట్టడి చేసేసారు. ఇక దేశంలోని ప్రజలకు మరింత అవగాహన కల్పించి వ్యక్తిగత జాగ్రత్తలు పాటించే విధంగా చైతన్య పరిచేందుకు ప్రభుత్వాలు కార్యాచరణను సిద్ధమవుతున్నాయి.

కోవిడ్‌ పాజిటివ్‌ల సంఖ్య తగ్గుతుందనుకునే లోపుగానే మళ్ళీ పెరుగతోంది. రోజుకో విధంగా నమోదవుతున్న కేసుల సంఖ్యతో అసలు కోవిడ్‌ ఎన్నోవేవ్‌ కొనసాగతుందో కూడా అర్ధంకాని అయోమయ పరిస్థితి నెలకొంది. ప్రస్తుతం దేశ వ్యాప్తంగా దాదాపు నలభైవేలకు అటూఇటూగా ప్రతి రోజు పాజిటివ్‌లు బైటపడుతున్నాయి. ఇప్పటి వరకు 1లక్షా35వేల మందికిపైగా మృత్యువాత పడ్డారు. 86,79,138 మంది కోవిడ్‌ భారి నుంచి కోలుకున్నారని ప్రభుత్వ లెక్కలు స్పష్టం చేస్తున్నాయి. 4,52,344 మంది ప్రస్తుతం ఆసుపత్రులు, హోం క్వారంటైన్‌ విధానంలో చికిత్స అందుకుంటున్నారు. కోవిడ్‌ భారిన పడి కోలుకుంటున్నవారి శాతం 93.66 శాతంగా ఉందని వివరిస్తోంది. మరణాల రేటు 1.46 శాతంగా ఉంటోందంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి