iDreamPost

కృష్ణుడిని మార్చిన సీత – Nostalgia

కృష్ణుడిని మార్చిన సీత – Nostalgia

1996లో  మెగాస్టార్ చిరంజీవి తమ్ముడిగా పవన్ కళ్యాణ్ తెరంగేట్రం ‘అక్కడ అమ్మాయి ఇక్కడ అబ్బాయి’తో జరిగింది. హిందీ మూవీ ‘ఖయామత్ సే ఖయామత్ తక్’ స్ఫూర్తితో దాదాపు దానికి  రీమేక్ గా రూపొందిన ఈ సినిమా అభిమానుల అండదండలతో కమర్షియల్ గా సేఫ్ అయ్యి పవన్ కి మంచి లాంఛింగ్ ప్యాడ్ గా ఉపయోగపడింది కానీ అంతకు మించి గొప్ప ఫలితాన్ని అందుకోలేకపోయింది. అందుకే రెండో చిత్రం కంటెంట్ విషయంలో జాగ్రత్తగా ఉండాలనే ఉద్దేశంతో తనకు ‘హిట్లర్’ రూపంలో అద్భుతమైన కం బ్యాక్ ఇచ్చిన ముత్యాల సుబ్బయ్యతో ఓ మూవీ చేయమని ప్రత్యేకంగా రికమండ్ చేశారు చిరు. అయితే అప్పటికప్పుడు కథ సిద్ధంగా లేదు.

ఇంతలో తమిళంలో సూపర్ హిట్ కొట్టిన ‘గోకులతిల్ సీత’ ను రీమేక్ హక్కులను నిర్మాత బి శ్రీనివాసరాజు కొన్నారు. కార్తీక్ సువలక్ష్మి జంటగా నటించిన ఈ సినిమా అక్కడ మంచి సక్సెస్ అందుకుంది. అజిత్ ‘ప్రేమలేఖ’ తీసిన అగతియన్ దీనికి దర్శకుడు. తెలుగులో తీసేందుకు ముత్యాల సుబ్బయ్య సరే అన్నారు. తనకు బాగా కలిసివచ్చిన రచయిత పోసాని కృష్ణమురళితో పూర్తి సంభాషణలతో స్క్రిప్ట్ సిద్ధం చేయించారు. సంగీత దర్శకుడిగా పవన్ కు మరోసారి కోటినే ఫిక్స్ అయ్యారు. టైటిల్ పాత్రకు రాశి ఎంపికయ్యింది. కోట, హరీష్, మల్లికార్జునరావు, సుధాకర్, శ్రీహరి, అచ్యుత్, బ్రహ్మానందం తదితరులు ఇతర తారాగణం.

కోటీశ్వరుడైన కళ్యాణ్(పవన్ కళ్యాణ్)కు జీవితంలో ఏదీ సీరియస్ గా తీసుకునే ఉద్దేశం ఉండదు. అమ్మాయిలు సరదా కోసమనుకునే అతని జీవితంలో సున్నితమనస్కురాలైన శిరీష(రాశి)ఆమె ప్రియుడు భాస్కర్(హరీష్) వచ్చాక కథ కీలక మలుపులు తిరుగుతుంది. మంచి లవ్ డ్రామాతో ముత్యాల సుబ్బయ్య నడిపించిన తీరు కామన్ ఆడియన్స్ కి నచ్చింది. అయితే పవన్ లేకుండా ఒక పాట రాశి మీద, మరో పాట హరీష్ రాశిల మీద తీయడం ఫ్యాన్స్ కు అంతగా రుచించలేదు. ఏదైతేనేం 1997 ఆగస్ట్ 22న విడుదలైన గోకులంలో సీత పవన్ కు మరో హండ్రెడ్ డేస్ మూవీ అయ్యింది. డెబ్యూ కంటే మంచి ఫలితాన్ని అందుకుంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి