iDreamPost

కారణాలేంటి..? అధికార పార్టీలో అంతర్మథనం

కారణాలేంటి..? అధికార పార్టీలో అంతర్మథనం

ఎక్స్‌ అఫీషియో ఓట్లు కలుపుకున్నా గ్రేటర్‌లో టీఆర్‌ఎస్‌ అధికారం చేజిక్కుంచుకోలేని పరిస్థితి ఏర్పడింది. గ్రేటర్‌లో తమకు తిరుగులేదనుకుంటున్న తరుణంలో ఎందుకిలా జరిగింది..? కారణాలేంటి..? భవిష్యత్‌లో మరింత బలపడాలంటే ఏం చేయాలి..? అన్న అంశాలపై టీఆర్‌ఎస్‌లో అంతర్మథనం జరుగుతోంది. 100 స్థానాల కంటే ఎక్కువ సాధించాలని లక్ష్యంగా పెట్టుకున్న టీఆర్‌ఎస్‌ వర్గాలు 55 స్థానాలు పొందడానికే చాలా కష్టపడాల్సి వచ్చింది. దీంతో ఫలితాలను పున:సమీక్షించుకుంటామని టీఆర్‌ఎస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు కే తారక రామారావు ప్రకటించారు. ఇప్పటికే పార్టీలోని పలువురు నేతలు తమ పరిధిలో పరాజయాలపై పోస్టు మార్టం చేస్తున్నారు.

ఎక్కువ స్థానాలు సాధించినా..

అభివృద్ధి చేశాం.. అశీర్వదించండి మరింత డెవలప్‌ చేస్తాం.. హైదరాబాద్‌ను కాపాడుకుందాం.. ప్రశాంత వాతావరణం యథాతధంగా ఉండేలా పాటుపడదామన్న టీఆర్‌ఎస్‌ విజ్ఞప్తిని గ్రేటర్‌ ఓటర్లు అంతగా పట్టించుకున్నట్టు కనిపించడం లేదు. అత్యధిక స్థానాల్లో గెలిచినా.. మేయర్‌ పీఠానికి చాలా దూరంలో కారుకు బ్రేక్‌ పడింది. పార్టీ మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రాతినిధ్యం వహిస్తోన్న పలు నియోజకవ ర్గాల్లో ఊహించని స్థాయిలో అభ్యర్థులు ఓటమి పాలయ్యారు. ఎందుకిలా..? అన్న అంతర్మధనం అధికార పార్టీలో మొదలైంది. ఎల్‌బీనగర్‌ నియోజకవర్గంలో 11 డివిజన్లున్నాయి. గతంలో టీఆర్‌ ఎస్‌ సిటింగ్‌ స్థానాలైన ఇక్కడి 10 డివిజన్లలో ఒక్క స్థానమూ అధికార పార్టీ దక్కించుకోలేదు. వరద ముంపునకు గురైన ప్రాంతాలు ఈ నియోజకవ ర్గం పరిధిలో ఎక్కువగా ఉన్నాయి. ఇదే ఇక్కడ టీఆర్‌ఎస్‌కు ప్రతికూలంగా మారిందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. నాలాల విస్తరణ చేప ట్టకపోవడం వల్లే తమ ప్రాంతాలు ముంపునకు గురయ్యాయన్న అసంతృప్తి స్థానికుల్లో ఉంది. ప్రభుత్వం అందజేసిన రూ.10 వేల వరద సాయం అందకపోవడమూ ఓటర్లు బీజేపీ వైపు మొగ్గు చూపడానికి కారణంగా చెబుతున్నారు. సిటింగ్‌లకు మరోసారి అవకాశం ఇవ్వడమూ ప్రధాన కారణమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సిటింగ్‌ కార్పొరేటర్లలో చాలా మందిపై స్థానికంగా వ్యతిరేకత ఉంది. అయినా మరోసారి వారికి పార్టీ అవకాశం ఇచ్చింది. పార్టీలోని స్థానిక నేతల మధ్య ఆధిపత్య పోరు, ఎమ్మెల్యే, సిటింగ్‌ కార్పొరేటర్లలో కొందరికి పడకపోవడమూ పార్టీకి నష్టం చేసిందని చెబుతున్నారు.

తలసాని ఇలాకాలో కూడా..

2016 ఎన్నికల సమయంలో లక్ష రెండు పడకల ఇళ్లు నిర్మించి ఇస్తామని ప్రధాన హామీగా టీఆర్‌ఎస్‌ ప్రకటించింది. కానీ ఇప్పటి వరకు 2500 ఇళ్లు మాత్రమే లబ్ధిదారులకు అందజేశారు. 40 వేల ఇళ్లు పూర్తయ్యాయి… మరో 35 వేల ఇళ్ల పనులు తుది దశలో ఉన్నాయని, ఎన్నికల అనంతరం కేటాయింపు మొదలవుతుందని అధికార పార్టీ ప్రకటించింది. కానీ దీనిని ప్రజలు విశ్వసించలేదన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. సనత్‌నగర్‌ నియోజకవర్గంలోని ఐదు డివిజన్లలో రెండు చోట్ల బీజేపీ విజయం సాధించింది. సనత్‌నగర్‌, కంటోన్మెంట్‌ నియోజకవర్గాల పరిధిలో ఉండే మోండా డివిజన్‌నూ టీఆర్‌ఎస్‌ చేజార్చుకుంది. ఈ నియోజకవర్గం నుంచి పశుసంవర్ధక శాఖ మంత్రి తలసాని శ్రీనివాస్‌యాదవ్‌ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. మంత్రి కేటీఆర్‌ తో పాటు తలసాని కూడా గ్రేటర్‌ ఎన్నికలో టీఆర్‌ఎస్‌ గెలుపు బాధ్యతను భుజాన వేసుకున్నారు. కానీ తన నియోజకవర్గంలోనే ఆయన పూర్తి స్థాయిలో ఆధిపత్యం కొనసాగించలేకపోయారు. తన బంధువు, రాంగోపాల్‌ పేట్‌ డివిజన్‌ అభ్యర్థిని అత్తెల్లి అరుణగౌడ్‌ను కూడా గెలిపించుకోలేక పోయారు. ఇది గ్రేటర్‌లో చర్చనీయాంశంగా మారింది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి