iDreamPost

గ్రేటర్‌ వార్‌ : ‘‘ఒకే ఒక్క‌డు’’ డివిజన్‌ వెరీ హాట్‌

గ్రేటర్‌ వార్‌ : ‘‘ఒకే ఒక్క‌డు’’ డివిజన్‌ వెరీ హాట్‌

గ్రేటర్‌ వ్యాప్తంగా ఎన్నికల వేడి రాజుకుంటున్నా.. కొన్ని డివిజన్లలోని పోరు ప్రత్యేకంగా ఉంటోంది. అందులో ఒకటి కేపీహెచ్‌బీ డివిజన్‌. ఇక్కడి నుంచి ప్రస్తుతం మందడి శ్రీనివాసరావు టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌గా పోటీ చేస్తున్నారు. ఆయనకు రాజకీయంగా ఒకే ఒక్కడు అన్న గుర్తింపు ఉంది. అందుకు కారణం లేకపోలేదు. 2016 జీహెచ్‌ఎంసీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ 95 స్థానాల్లో పోటీ చేయగా ఒకే ఒక్క స్థానంలో విజయం సాధించింది. అదే కేపీహెచ్‌బీ డివిజన్‌. అప్పుడు టీడీపీ నుంచి గెలిచింది మందడి శ్రీనివాసరావే. అందుకే ఆయన ఒకే ఒక్కడుగా గుర్తింపు పొందారు. అనంతరం మారిన రాజకీయ సమీకరణాల నేపథ్యంలో మందడి టీఆర్‌ఎస్‌లో చేరారు.

తొలి కేండిడేట్‌..

గత ఎన్నికల్లో టీడీపీ నుంచి విజయంతో ఒకే ఒక్కడుగా గుర్తింపు ఉంటే.. ఈ ఎన్నికల్లో టీఆర్‌ఎస్‌ ప్రకటించిన తొలి అభ్యర్థిగా మందడి శ్రీనివాసరావు నిలిచారు. రెండు నెలల ముందే కేపీహెచ్‌బీలో జరిగిన టీఆర్‌ఎస్‌ కార్యాలయం ప్రారంభోత్సవానికి హాజరైన స్థానిక ఎమ్మెల్యే మాధవరం కృష్ణారావు డివిజన్‌ అభ్యర్థిగా శ్రీనివాసరావును ప్రకటించేశారు. రిజర్వేషన్లలో మార్పులు లేకుంటే ఆయనే పోటీ చేస్తారని చెప్పారు. అన్నట్లుగానే ప్రస్తుతం మందడి టీఆర్‌ఎస్‌ నుంచి పోటీలో ఉన్నారు. సెటిలర్లు అధికంగా ఉండే ఈ డివిజన్‌లో ఎన్నికల పోరు రసవత్తరంగా ఉంది.

హోరాహోరీ..

కేపీహెచ్‌బీ (114) డివిజన్‌ నుంచి బీజేపీ అభ్యర్థి ప్రీతం రెడ్డి పోటీ చేస్తున్నారు. తెలుగుదేశం పార్టీ నుంచి పద్మా చౌదరి బరిలో ఉన్నారు. కాంగ్రెస్‌ అభ్యర్థిగా కాపు సామాజిక వర్గానికి చెందిన యేసురాజు పోటీ చేస్తున్నారు. ప్రధానంగా టీఆర్‌ఎస్‌, బీజేపీ అభ్యర్థుల పోటీ నడుస్తోంది. గత ఎన్నికల్లో గ్రేటర్‌ అంతా టీఆర్‌ఎస్‌ గాలి వీచినా ఇక్కడ మాత్రం తెలుగుదేశం గెలిచింది. దీంతో ఈసారి కూడా గెలవాలనే తపనతో టీడీపీ కూడా పోరాడుతోంది. ఉనికి చాటుకోవడానికి కాంగ్రెస్‌ కసరత్తు చేస్తోంది. అన్ని పార్టీలూ ప్రచారాన్ని హోరెత్తిస్తున్నాయి. ఆరోపణలు, ప్రత్యారోపణలతో ప్రచారాన్ని వేడెక్కిస్తున్నారు. అభివృద్ధి నినాదంగా మందడి ప్రచారం చేస్తుంటే.. కేంద్ర పథకాల ద్వారా బీజేపీ ప్రజల్లోకి వెళ్తోంది.

డిష్యూం.. డిష్యూం..

బుధవారం నిర్వహించిన ఎన్నికల ప్రచారం సందర్భంగా డివిజన్‌లో టీడీపీ, టీఆర్‌ఎస్‌ వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎన్నికల ప్రచారాన్ని టీఆర్‌ఎస్‌ అభ్యర్థి మందడి శ్రీనివాసరావు వర్గీయలు అడ్డుకున్నారంటూ తెలుగుదేశం పార్టీ శ్రేణులు అలజడి సృష్టించారు. ప్రచారంలో భాగంగా టీడీపీ అభ్యర్థి పద్మా చౌదరి తరఫున ఆమె కూతురుప్రియదర్శిని పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి కేపీహెచ్‌బీ 9వ ఫేజ్‌లో ప్రచారం చేస్తున్నారు. అదే కాలనీలో టీఆర్‌ఎస్‌ కార్పొరేటర్‌ మందడి నివాసం ఉండటంతో ప్రచారాన్ని ఆపేసి వెళ్లిపోవాలంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు హుకుం జారీ చేశారు. దీంతో టీడీపీ, టీఆర్‌ఎస్‌ కార్యకర్తల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. తీవ్ర వాదోప‌వాదాలు జ‌రిగాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి