iDreamPost

ప్రేమ కావ్యం బాల‌రాజు – Nostalgia

ప్రేమ కావ్యం బాల‌రాజు – Nostalgia

ప్రేమ కోసం ఒక అమ్మాయి, అబ్బాయి వెంట ప‌డుతూ కొండ కోన‌లు తిరుగుతూ క‌ష్టాలు ప‌డ‌టం బాలరాజు సినిమా. ప్రాతివత్యం గురించి ఉప‌న్యాసాలు చెప్పే రోజుల్లో, ప్రేమ‌తో సంబంధం లేకుండా బాల్య వివాహాలు జ‌రిగే కాలంలో ఇలాంటి సినిమా రావ‌డం నిజంగా ఆశ్చ‌ర్యం. చ‌లం ర‌చ‌నలా సాగే బాల‌రాజు 1948లో వ‌చ్చింది. ఈ కావ్యాన్ని రాసింది స‌ముద్రాల‌, స్క్రీన్ మీద చూపించింది ఘంట‌శాల బ‌ల‌రామ‌య్య‌.

నాగ‌య్య‌, నారాయ‌ణ‌రావులు హీరోలుగా వెలుగుతున్న కాలంలో ANRలాంటి లేత కుర్రాన్ని హీరోగా తీసుకోవ‌డం బ‌ల‌రామ‌య్య సాహ‌సం. ఆయ‌న‌కి నాగేశ్వ‌ర‌రావు మీద అంత గురి. నిజానికి బాల‌రాజులో హీరో ఎస్‌.వ‌ర‌ల‌క్ష్మినే. టైటిల్ బాల‌రాజే కానీ, క‌థంతా సీత‌దే.

స్వ‌ర్గ లోకంలో మోహిని (అంజ‌లిదేవి) య‌క్షున్ని ప్రేమిస్తుంది. అయితే ఇంద్రుడు ఆమెపై మోజుప‌డ‌తాడు. మోహిని తిర‌స్క‌రిస్తుంది. తండ్రి న‌చ్చ చెబుతాడు, ఆమె విన‌దు. ఈ సీన్‌లో స‌ముద్రాల డైలాగ్‌లు ఎంత బాగుంటాయంటే!

తండ్రి- ఏమిటీ ఆగ‌డం
మోహిని- ఆగ‌డం కాదు నాన్నా…ఆనందం…స్వేచ్ఛ‌గా ఆడుతూ పాడుతూ బ‌త‌క‌డ‌మే క‌దా బ్ర‌హ్మానందం.
తండ్రి -జీవితం అడ‌వికాచిన వెన్నెల చేస్తున్నావ్‌.
అర్హులు త‌ల ఊపిన‌ప్పుడే క‌ళ‌కు రాణింపు.
స‌రే ప్రేమ‌ను న‌మ్మిన వాళ్లు క‌ష్ట‌ప‌డ‌తారు. మోహిని , య‌క్షుడు శాపానికి గురై భూమి మీద పుడ‌తారు. బాల‌రాజు మేక‌ల కాప‌రి, సీత డ‌బ్బున్న వాడి కుమార్తె, ఒంటిస్తంభం మేడ‌లో ఉంటుంది.

బాల‌రాజు (ANR) , ఎల‌మంద (శివ‌రావ్‌) అడ‌వికి మేక‌లు తోలుకుని వ‌స్తారు. బాల‌రాజు పిల్ల‌న‌గ్రోవి తీస్తాడు. సంగీతం చెవుల‌కి సోకేస‌రికి , సీత‌లో ప్రేమ గీతం పుట్టింది.

మేడ దిగి వ‌చ్చింది. తొలి చూపులోనే ప్రేమ‌. అత‌నో అమాయ‌కుడు, ఏమీ అర్థం కాదు. ఇక్క‌డ మాట‌లు వినండి.

సీత – అలా చూస్తావేం…ఆ పాట కంటే నేను అందంగా ఉన్నానా?
పాటా అందంగా ఉంది, నేనూ అందంగా ఉన్నాను. అదే స‌ముద్రాల చ‌మ‌త్కారం.
బాల‌రాజు – ఎవ‌రు నువ్వు?
సీత – మ‌నిషినే
బాల‌రాజు – ఎందుకొచ్చావ్‌?
సీత – నీ పాట ఎంతో హాయిగా ఉంది.
బాల‌రాజు – నీకెలా తెలుసు?
సీత – నేను వ‌చ్చాన‌ని నీకెలా తెలుసు?
బాల‌రాజు – చూస్తే
సీత – వింటే
బాల‌రాజు – ఎవ‌రి పిల్ల‌వు?
సీత – ఏం నీ పాట‌కిచ్చి పెండ్లి చేస్తావా?
చిన్న‌చిన్న ప‌దాల‌తో లోతైన అర్థాలు.
పాట‌ను పెండ్లి చేసుకోవ‌డం – అద్భుత‌మైన భావ‌న‌
ఒక్క పాట‌తో వెళ్లిపోతుంద‌నుకుని మ‌ళ్లీ వేణువు తీస్తాడు.
“నీకు నీవారు లేరు
నాకు నావారు లేరు
గాలిలో తేలి పోదాం ప‌ద‌రా” అంటుంది.

అడ‌విలో ఆమెని వ‌దిలించుకోవాల‌ని అత‌ను…వ‌దిలి వెళ్ల‌లేని ఆమె, ఇంతే క‌థ‌. దొంగ‌లొస్తారు, క‌ష్టాలు వ‌స్తాయి. అన్నింటిని జ‌యిస్తుంది. చివ‌రికి ఇంద్రుడు కూడా ఆమె ప్రేమ‌కి భ‌య‌ప‌డి, స్వ‌ర్గానికి తిరిగి ర‌మ్మంటాడు.

ప్రేమ , స్వేచ్ఛ లేని స్వ‌ర్గం కూడా న‌ర‌క‌మే అనుకుని ఆ ప్రేమికులు భూమ్మీదే ఉండిపోతారు.

పురాణ క‌థ‌ల‌కి అల‌వాటు ప‌డిన కాలంలో , స్వ‌ర్గ లోకంతో మొద‌లు పెట్టి , భూమ్మీద ప్రేమ స్వ‌ర్గాన్ని పొందే క‌థ‌ని ఒక కావ్యంగా మ‌లిచారు. జ‌నం బ్ర‌హ్మ‌ర‌థం ప‌ట్టారు. శ‌త దినోత్స‌వాన్ని జ‌రుపుకున్న తొలి సినిమా.

న‌టులు , ఆయా ఊళ్ల‌కి వెళ్లి సినిమాని ప్ర‌మోట్ చేయ‌డం బాల‌రాజుతోనే మొద‌లైంది. నాగేశ్వ‌ర‌రావుని చూడ‌టానికి వ‌చ్చి సావిత్రి నీటి గుంత‌లో ప‌డిపోయింది విజ‌య‌వాడ‌లో. (మ‌హాన‌టి సీన్ గుర్తుందా?)

బాల‌రాజు త‌ర్వాత ANR మ‌ళ్లీ వెన‌క్కి చూసుకోలేదు. క‌స్తూరి శివ‌రావ్‌కి హీరోల‌కు మించిన క్రేజ్ వ‌చ్చింది. (టీ న‌గ‌ర్‌లోని బ‌జుల్లా రోడ్‌లో అనేక ఇళ్ల‌కి య‌జ‌మాని, బ్యూక్ కార్‌లో తిరిగిన శివ‌రావ్‌, చివ‌రికి అదే వీధిలో డొక్కు సైకిల్ మీద తిర‌గ‌డం విధి విచిత్రం. ఏడుగురు పిల్ల‌ల‌కి, ఆక‌లిని దారిద్ర్యాన్ని మాత్ర‌మే వ‌దిలి వెళ్లిన శివ‌రావ్ తెనాలిలో చ‌నిపోతే , డ‌బ్బుల్లేక శ‌వం మ‌ద్రాస్ చేర‌డానికి 3 రోజులు ప‌ట్టింది)

ఘంట‌శాల ఈ సినిమాకి అసిస్టెంట్ మ్యూజిక్ డైరెక్ట‌ర్‌. డ్యాన్స్ డైరెక్ట‌ర్‌గా వేదాంతం రాఘ‌వ‌య్య ప‌నిచేశారు. త‌ర్వాత రోజుల్లో ఆయ‌న డైరెక్ట‌ర్‌గా మారి దేవ‌దాసు లాంటి క్లాసిక్ తీశారు. అంజ‌లిదేవి ఆ రోజుల్లో వ్యాంప్ క్యారెక్ట‌ర్ వేసే వాళ్లు. త‌ర్వాత హీరోయిన్ అయ్యారు.

ఘంట‌శాల బ‌ల‌రామ‌య్య మ‌న‌వ‌డే నేటి మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌.

బాల‌రాజు మీసం ఆ రోజుల్లో యువ‌కుల‌కు ఫ్యాష‌న్‌. మ‌ధుర‌మైన గాత్రం ఉన్న ఎస్‌.వ‌ర‌ల‌క్ష్మి చివ‌రి రోజుల వ‌ర‌కు న‌టించారు.

ఆ రోజుల్లోనే వాన సీన్ ఉండ‌టం బాల‌రాజు ప్ర‌త్యేక‌త‌. అంతే కాదు, ఒకే ఫ్రేమ్‌లో ఇద్ద‌రు హీరోయిన్లు ఉంటారు. కెమెరా ట్రిక్స్ అభివృద్ధి చెంద‌ని కాలంలో అదో వింత‌.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి