iDreamPost

వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలి? స్కూళ్లు, కాలేజీలకు ఎప్పుడు సెలవు?

  • Author singhj Published - 09:51 PM, Mon - 28 August 23
  • Author singhj Published - 09:51 PM, Mon - 28 August 23
వినాయక చవితి ఏ రోజు జరుపుకోవాలి? స్కూళ్లు, కాలేజీలకు ఎప్పుడు సెలవు?

మన దేశంలో అతిపెద్ద పండుగల్లో ఒకటిగా వినాయక చవితిని చెప్పుకోవచ్చు. ఈ రాష్ట్రం, ఆ రాష్ట్రం అనే తేడాల్లేకుండా భారత్​లోని అన్ని రాష్ట్రాల్లోనూ ఈ పండుగను ఘనంగా సెలబ్రేట్ చేసుకుంటారు. ఈ పండుగ సమయంలో గ్రామాల దగ్గర నుంచి నగరాల వరకు అన్నీ వినాయక ప్రతిమలతో నిండిపోతాయి. వినాయక మండపాల దగ్గరే గాక చాలా మంది తమ ఇళ్లలో గణేషుడి బొమ్మను వివిధ రకాల పువ్వులు, పత్రితో పూజించి నవరాత్రుల తర్వాత నిమజ్జనం చేస్తుంటారు. భారతీయ సంప్రదాయంలో అన్ని వర్గాలు జరుపుకునే గణేష్ చవితి అతి పెద్ద పండుగగా చెప్పుకోవచ్చు. ఇక, ఈ ఏడాది వినాయక చవితి పండుగను ఏ రోజు జరుపుకోవాలనే దానిపై సందిగ్థత నెలకొంది.

వినాయక చవితిని సెప్టెంబర్ 18న జరుపుకోవాలా? లేదా సెప్టెంబర్ 19న జరపాలా అనే దానిపై కన్​ప్యూజన్ ఏర్పడింది. ఈ విషయంపై ప్రజల్లో సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. దీనిపై పండితుల మధ్య కూడా చర్చోపచర్చలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో తెలంగాణ విద్వత్సభ కీలక ప్రకటన చేసింది. శోభకృత్ నామ సంవత్సరంలో గణేష్ చతుర్థిని భాద్రపద శుక్ల చుతర్థి సోమవారం (సెప్టెంబర్ 18) నాడు నిర్వహించుకోవాలని సూచించింది.  18వ తేదీ ఉదయం 9.58 గంటలకు చవితి ఆరంభమై.. 19న ఉదయం 10.28 గంటలకు ముగుస్తుందని తెలిపింది. కాబట్టి వినాయక చవితి పండుగను సోమవారమే జరుపుకోవాలని పేర్కొంది.

సెప్టెంబర్ 18 నుంచి నవరాత్రులను మొదలుపెట్టాలని రాష్ట్ర ప్రజలకు తెలంగాణ విద్వత్సభ సూచించింది. రాష్ట్ర సర్కారుతో పాటు అన్ని పీఠాలకు శాస్త్రబద్ధంగా నిర్ణయించిన పండుగల జాబితాను విద్వత్సభ సమర్పిస్తూ ఉంటుంది. వినాయక చవితి పండుగను ఎప్పుడు జరుపుకోవాలనే విషయంలో ప్రజల్లో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ నేపథ్యంలో విద్వత్సభ ఈ ప్రకటన చేసింది. వర్గల్​ విద్యాసరస్వతి క్షేత్రంలో 100 మంది సిద్ధాంతుల సమక్షంలో జులై 22వ, 23వ తేదీల్లో షష్ఠమ వార్షిక విద్వత్సమ్మేళనం నిర్వహించారు. ఇందులో చర్చించి పండుగ తేదీ మీద నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ఇదే విషయాన్ని రాష్ట్ర ప్రభుత్వానికి తెలియజేశామని ప్రకటనలో పేర్కొన్నారు. అయితే స్కూళ్లు, కాలేజీలకు పండుగ సెలవును ప్రభుత్వం ఏ తేదీన ఇస్తుందో చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి