iDreamPost

Summer Effect : భగభగమంటున్న భానుడు.. జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు..

Summer Effect : భగభగమంటున్న భానుడు.. జాగ్రత్తలు తీసుకోకపోతే అంతే సంగతులు..

 

ప్రతి సంవత్సరం ఎండాకాలం వచ్చిందంటే ఉష్ణోగ్రతలు అంతకంతకు పెరుగుతూనే ఉన్నాయి. ఈసారి కూడా ఉష్ణోగ్రతలు మరింత పెరిగాయి. రెండు తెలుగు రాష్ట్రాలు నిప్పులకుంపటిలా మారాయి. ఇప్పటికే పలుచోట్ల ఉష్ణోగ్రతలు 42, 43 డిగ్రీలకి చేరుకోవడంతో ఎండలు, వడగాడ్పులు, ఉక్కబోత రోజురోజుకూ పెరిగిపోతున్నాయి. ఇక మే నెలలో ఎండలు మరింత పెరిగి 45 నుండి 48 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదు అవ్వొచ్చని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది.

మే నెలలో రాబోయే భానుడి ప్రతాపానికి శరీరానికి చెమటలు పట్టి శరీరం నుంచి సోడియం, పొటాషియం, క్లోరైడ్స్‌ తగ్గుతాయని, అలా జరగకుండా అందరూ జాగ్రత్తగా ఉండాలని వైద్యులు సూచిస్తున్నారు. రోగనిరోధకశక్తి తక్కువగా ఉండే వృద్ధులు, చిన్నపిల్లలు ఇళ్లలోనే ఉన్నా అధిక ఉష్ణోగ్రతలు వారిపై ప్రభావం చూపుతాయి కాబట్టి మరింత జాగ్రత్తగా ఉండాలి. ప్రస్తుత పరిస్థితుల్లో ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల మధ్యలో ఇంటి నుంచి బయటకు వెళ్లకపోవడమే మంచిది. ఆఫీసుల్లో, ఇళ్లలో ఏసీలు పెట్టుకున్న వాళ్ళు ఒకేసారి ఏసీ వాతావరణం నుంచి ఎండలోకి రాకూడదు. కాసేపు మాములు వాతావరణానికి ఉండి అప్పుడే బయటకి రావాలి. లేదా వడదెబ్బ తగలడం, నీరసం లాంటివి వస్తాయి.

ఈ ఎండల్లో ఉపశమనంగా ఉండటానికి తరచూ నీళ్లు, చక్కర కలిపిన మజ్జిగ, నిమ్మకాయ నీళ్లు, తాజా పండ్లరసాలు, ఓఆర్‌ఎస్ లాంటి పానీయాలు తీసుకోవాలి. అంతేకాని బయట అమ్మే రంగునీళ్లు, శుభ్రత లేని పానీయాలు, ఎనర్జీ డ్రింకులు, కూల్ డ్రింక్స్ తీసుకోవడం వల్ల ఆరోగ్యం పాడయ్యే ప్రమాదముంది. కాబట్టి ఈ నెల రోజులు అందరూ జాగ్రత్తలు పాటిస్తూ, మధ్యాహ్నం సమయాల్లో బయటకి రాకుండా ఇళ్లల్లోనే ఉండాలి అని వైద్యులు తెలిపారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి