iDreamPost

నాలుగు ఎన్నికలు..నలుగురు ప్రత్యర్థులు.. విజేత మాత్రం బుజ్జినే

నాలుగు ఎన్నికలు..నలుగురు ప్రత్యర్థులు.. విజేత మాత్రం బుజ్జినే

చరిత్రను రాయలేం.. అలాగని బ్లూప్రింట్‌ తీసి సృష్టించలేం.. దానంతటికది ఏర్పడుతుంది.. ఓ సినిమాలో డైలాగ్‌. ఇది అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్‌ (బుజ్జి) రాజకీయ జీవితానికి అతికినట్లు సరిపోతుంది. 28 ఏళ్ల వయస్సులో తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచిన బుజ్జి.. ఇప్పటి వరకూ పోటీ చేసిన ప్రతి ఎన్నికలోనూ విజయం సాధించారు.

2004 నుంచి 2019 వరకూ రెండు దశాబ్ధాలుగా ఓటమి అనేది ఎరుగకుండా వరుసగా నాలుగు సార్లు ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. గెలిచిన నాలుగు సార్లు నలుగురు వేర్వేరు ప్రత్యర్థులు కావడం విశేషం. ప్రత్యర్థి ఎవరైనా.. గెలుపు మాత్రం బుజ్జీదే కావడం ప్రత్యేకమైన విషయం.

గొట్టిపాటి రవికుమార్‌ తొలిసారి 2004లో మార్టూరు నియోజకవర్గం నుంచి కాంగ్రెస్‌ అభ్యర్థిగా పోటీ చేశారు. తన పెదనాన్న, మాజీ మంత్రి గొట్టిపాటి హనుమంతరావు కుమారుడు, టీడీపీ అభ్యర్థి గొట్టిపాటి నరసయ్యపై పోటీ చేసి విజయం సాధించారు. అంతకుముందు ఎన్నికల్లో ఇక్కడ కాంగ్రెస్‌ ఘోర పరాజయం పాలైంది. 1999 ఎన్నికల్లో నరసయ్యకు వచ్చిన ఓట్లలో కాంగ్రెస్‌ అభ్యర్థి నర్రా శేషగిరిరావుకు సగం కూడా రాలేదు.

మార్టూరు నియోజకవర్గం ఏర్పడిన తర్వాత కాంగ్రెస్‌కు తొలి విజయం గొట్టిపాటి రవికుమార్‌ ద్వారానే లభించింది. అంతకు ముందు 1978 నుంచి 1999 వరకూ జనతాపార్టీ తరఫున జాగర్లమూడి చంద్రమౌళి (1978), స్వతంత్ర అభ్యర్థిగా గొట్టిపాటి హనుమంతరావు (1983, 1994) రెండుసార్లు, టీడీపీ తరఫున కరణం బలరామకృష్ణమూర్తి (1985, 1989) రెండు సార్లు, గొట్టిపాటి నరసయ్య ఒకసారి (1999) గెలుపొందారు.

2004 వరకు ప్రకాశం జిల్లాలో 13 అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్నాయి. 2008లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో ఆ సంఖ్య 12కు తగ్గడంతోపాటు.. కొన్ని నియోజకవర్గాలు రద్దు అయి.. కొత్త నియోజకవర్గాలు ఏర్పాటయ్యాయి. రిజర్వేషన్లు మారాయి. మార్టూరు నియోజకవర్గం రద్దు కావడంతో.. గొట్టిపాటి రవికుమార్‌ పరిస్థితి ఏంటన్న చర్చ మొదలైంది. అయితే స్థానికంగా జరిగిన ఓ బహిరంగ సభలో.. అప్పటి సీఎం వైఎస్‌ రాజశేఖరరెడ్డి.. అద్దంకి చూసుకో రవి.. అంటూ అభయం ఇవ్వడంతో.. బుజ్జి అద్దంకిని తన సొంత నియోజకవర్గంగా మార్చుకున్నారు.

ప్రకాశం జిల్లాలో రాజకీయ దురందరుడుగా పేరొందిన కరణం బలరాంపై 2009లో బుజ్జి రెండోసారి గెలుపొందారు. ఒకానొక దశలో బుజ్జికి మంత్రి పదవి వస్తుందనే చర్చ సాగింది. కరణం బలరాంతో ఢీ అంటే ఢీ అనేలా రాజకీయం నడిపారు. ప్రకాశం జిల్లాలో అత్యంత సమస్యాత్మకమైన నియోజకవర్గం అద్దంకే.

ఎమ్మెల్యేగా 2014 వరకూ కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్న రవికుమార్‌.. 2014కు ముందు వైసీపీలో చేరి ఆ పార్టీ తరఫున మూడోసారి పోటీ చేశారు. ఈ సారి కరణం బలరాం వ్యూహం మార్చారు. యువకుడైన రవికుమార్‌ను ఢీ కొట్టేందుకు తన కుమారుడు వెంకటేష్‌ను బరిలో దింపారు. అయినా విజయం దక్కలేదు. బుజ్జి హాట్రిక్‌ సాధించారు. వైసీపీ తరఫున గెలిచిన గొట్టిపాటి ఆ తర్వాత టీడీపీలోకి ఫిరాయించారు. ఒక ఒరలో రెండు కత్తులు ఇమడవన్న సామెత మాదిరిగా టీడీపీలో కరణం, గొట్టిపాటి వర్గాలు పోటాపోటీ రాజకీయాలు చేశాయి.

2019లోనూ గొట్టిపాటి అద్దంకి సీటును దక్కించుకున్నారు. పలుదఫాలు అద్దంకి నుంచి పోటీ చేసిన కరణం.. చీరాలకు వెళ్లాల్సి వచ్చింది. బుజ్జి టీడీపీ అభ్యర్థిగా మారడంతో.. వైసీపీ మాజీ ఎమ్మెల్యే బాచిన చెంచు గరటయ్యను బరిలోకి దింపింది. వైఎస్‌ జగన్‌ ప్రభంజనంలోనూ గొట్టిపాటి రవికుమార్‌ గెలిచి తన సత్తాను చాటారు. నాలుగు ఎన్నికల్లోనూ నలుగురు అభ్యర్థులను ఓడించి సరికొత్త చరిత్రను రవికుమార్‌ సృష్టించారు.

రాజకీయ ఆరంగేట్రం..

గొట్టిపాటిది రాజకీయ కుటుంబమైనా.. ఆ వారసత్వం హనుమంతరావు కుమారుడు నరసయ్యకు దక్కింది. రవికుమార్‌ తండ్రి గొట్టిపాటి శేషగిరిరావు వైద్యులు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి క్లాస్‌మేట్స్‌. రవికుమార్‌ తొలుత మార్టూరు నుంచి టీడీపీ తరఫున పోటీ చేయాలని భావించినా.. నరసయ్యను కాదని రవికుమార్‌కు టిక్కెట్‌ ఇచ్చే పరిస్థితి లేదు. దీంతో రవికి పిల్లనిచ్చిన మామ, వ్యాపారి కామేపల్లి సుబ్బారావు రాజకీయ వ్యూహం నడిపారు. కాంగ్రెస్‌ తరఫున తన అల్లుడును పోటీ చేయించేందుకు ఆసక్తి చూపారు. రవి తండ్రి శేషగిరి రావు.. వైఎస్‌ఆర్‌ క్లాస్‌మేట్‌ కావడం కూడా రవికి కలిసివచ్చింది. పైగా కాంగ్రెస్‌కు కూడా మార్టూరులో బలమైన అభ్యర్థి కావాల్సి వచ్చింది.

రవి వరుస విజయాలు సాధించడానికి అనేక కారణాలు ఉన్నాయి. రవికి సొంత ఇమేజ్‌ ఉంది. ఏ పార్టీలో ఉన్నా.. అనుచరులు తనతోనే ఉండేలా చూసుకుంటారు. రవి ఎదుర్కొన్న అభ్యర్థులందరూ పాతతరం నాయకులు కావడం… ప్రస్తుత రాజకీయాలకు అనుగుణంగా వారు రాజకీయం చేయకపోవడం మరో కారణం. ప్రత్యర్థి పార్టీలో అసంతృప్త నాయకులను తనవైపు తిప్పుకోవడంలో గొట్టిపాటి దిట్ట. డబ్బును ఖర్చు పెట్టడడంతో రవితో పోటీ పడే వారేవరూలేరు. యువత నాడిని పట్టుకోవడం, జనాల నాడికి అనుగుణంగా రాజకీయాలు చేయడం, ఎన్నికల మేనేజ్‌మెంట్‌లో రవి ఆరితేరాడు. తన మామ కామేపల్లి సుబ్బారావు నుంచి రవి ఈ లక్షణాలు అందిపుచ్చుకున్నారు.

గడచిన రెండేళ్లలోనూ రవికుమార్‌ ప్రజలకు అందుబాటులో ఉంటున్నారు. తన వర్గాన్ని కాపాడుకుంటున్నారు. ఇప్పటి వరకు పాత తరం నాయకులను ప్రత్యర్థులుగా ఎదుర్కొన్న బుజ్జి.. ఈ సారి అందుకు భిన్నంగా యువకుడును ఎదుర్కొనబోతున్నారు. వైసీపీ కో ఆర్డినేటర్‌గా గరటయ్య కుమారుడు బాచిన కృష్ణచైతన్య దూకుడుగా పని చేస్తున్నారు. నిత్యం ప్రజల్లో ఉంటూ బుజ్జికి సవాల్‌ విసురుతున్నారు. ఇటీవల జరిగిన మున్సిపల్‌ ఎన్నికల్లో అద్దంకి చైర్మన్‌ పీఠాన్ని వైసీపీ హస్తగతం చేసుకుంది. టీడీపీ తప్పక గెలుస్తుందనుకున్న అద్దంకిలోవైసీపీ జెండా ఎగరడంలో కృష్ణ చైతన్య కృష్టి ఎనలేనిది. యువకుడైన కృష్ణ చైతన్యను రవి ఎలా ఎదుర్కొనబోతున్నారు..? 2024లోనూ గెలిచి తనకు ఎదురులేదని బుజ్జి నిరూపించుకుంటారా..? కృష్ణ చైతన్య అయినా బుజ్జి వరుస విజయాలకు బ్రేక్‌ వేస్తారా..? చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి