iDreamPost

కొత్త ఏడాది నాటికి కొత్త రూపు

కొత్త ఏడాది నాటికి కొత్త రూపు

ఆంధ్రప్రదేశ్‌లో కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ఊపందుకుంది. ప్రస్తుతం ఉన్న 13 జిల్లాల స్థానంలో.. ప్రతి పార్లమెంట్‌ నియోజకవర్గాన్ని ఒక జిల్లాగా ఏర్పాటు చేయాలని సీఎం వైఎస్‌ జగన్‌ ఎన్నికల ముందే ప్రతిపాదించారు. ఈ మేరకు వైసీపీ అధికారంలోకి వస్తే 25 పార్లమెంట్‌ నియోజకవర్గాలను జిల్లాలుగా మారుస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీని అమలు చేసేందుకు రెండో ఏడాది ప్రారంభంలోనే చర్యలు చేపట్టారు. రాష్ట్రంలో 25 లేదా 26 జిల్లాలను ఏర్పాటు చేసేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని రాష్ట్ర మంత్రివర్గం ఇప్పటికే తీర్మానించింది. జిల్లాల ఏర్పాటుకు అవసరమైన యంత్రాంగంతో ప్రత్యేకంగా ఓ సచివాలయాన్ని ఏర్పాటు చేశారు. మూడు దశల్లో అధికారులతో కూడిన కమిటీలను ఏర్పాటు చేశారు.

వచ్చే ఏడాది సంక్రాంతి నాటికి కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను పూర్తి చేసే లక్ష్యంతో వైసీపీ ప్రభుత్వం ఉన్నట్లు తెలుస్తోంది. సచివాలయం, కమిటీల కాలపరిమితి జవవరి 6వ తేదీ వరకూ ఉంది. ఆ లోపు ఈ ప్రక్రియ అంతా పూర్తి చేసి సంక్రాంతి నాటికి జిల్లాలను ప్రకటించాలనే లక్ష్యంతో వైఎస్‌ జగన్‌ సర్కార్‌ పని చేస్తోంది. తాజాగా ఆయా పార్లమెంట్‌ నియోజకవర్గాలకు సంబంధించిన సమస్త సమాచారాన్ని పంపాల్సిందిగా జిల్లా కలెక్టర్లకు ఆదేశాలు అందాయి. పార్లమెంట్‌ నియోజకవర్గాల్లో ఉన్న ప్రభుత్వ, ప్రైవేటు భవనాలు, భూములు, ఉద్యోగులు, భౌగోళిక సరిహద్దులు, విస్తీరణం, జనాభా తదితర వివరాలు పంపాలని జిల్లా అధికారులకు ఆదేశాలు అందాయి. ఈ వివరాలతో కూడిన నివేదికను ఈ నెల 7 నాటికి ఇవ్వాలని సర్క్యూలర్‌ జారీ అయింది. అందుకు అనుగుణంగా సమాచారం ఇచ్చేందుకు జిల్లా యంత్రాంగం పని చేస్తోంది.

ఈ నెల 7 నాటికి పార్లమెంట్‌ నియోజకవర్గాల వారీగా సమాచారం అందిన తర్వాత కొత్త జిల్లా ఏర్పాటు ప్రక్రియ ఓ కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. ఇందు కోసం ఏర్పాటు చేసిన సచివాలయంలో జిల్లాల ఏర్పాటుపై కసరత్తు జరగనుంది. ఆ తర్వాత జిల్లాల సరిహద్దులు, జిల్లా కేంద్రం తదితర అంశాలతో కూడిన నివేదికను ప్రభుత్వానికి అందజేయనున్నారు. ఆ నివేదిక ఆధారంగా కొత్త జిల్లాల ఏర్పాటును జగన్‌ ప్రభుత్వం ప్రకటించే అవకాశం ఉంది. కరోనా వల్ల వాయిదా పడిన స్థానిక సంస్థల ఎన్నికలను కూడా కొత్త జిల్లాల ఏర్పాటు తర్వాత చేపట్టాలని ప్రభుత్వం యోచిస్తున్నట్లుగా చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వీలైనంత త్వరగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ పూర్తయ్యే సూచనలు కనిపిస్తున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి