iDreamPost

హోటళ్లలో గడువు ముగిసిన ఆహార పదార్ధాలు.. పారడైజ్‌కు భారీ జరిమానా!

  • Published Jun 21, 2023 | 4:34 PMUpdated Jun 21, 2023 | 4:41 PM
  • Published Jun 21, 2023 | 4:34 PMUpdated Jun 21, 2023 | 4:41 PM
హోటళ్లలో గడువు ముగిసిన ఆహార పదార్ధాలు.. పారడైజ్‌కు భారీ జరిమానా!

ప్రస్తుతం సమాజాన్ని పీడిస్తున్న అతి పెద్ద సమ్య.. కల్తీ. పసిపిల్లలు తాగే పాల దగ్గర నుంచి.. మనం తినే ప్రతి ఆహారం ఇలా కల్తీకి గురవుతూనే ఉంది. అధికారుల ఎన్ని చర్యలు తీసుకున్నా కల్తీ జాడ్యానికి చెక్‌ పెట్టలేకపోతున్నారు. సాధారణ కాకా హోటల్స్‌ మొదలు.. పేరు మోసిన ఫైవ్‌స్టార్‌ హోటల్స్‌, రెస్టారెంట్స్‌ ఇలా ప్రతి చోటా కల్తీ ఆహారం వెలుగు చూసి.. జనాలను కలవరపెడుతుంది. ఇక తాజాగా విజిలెన్స్‌ అధికారులు, ఆహార భద్రత విభాగం అధికారులు.. పలు హోటల్స్‌లో తనిఖీలు నిర్వహించారు. అక్కడ డేట్‌ అయిపోయిన ఆహార పదార్థాలను వినియోగిస్తున్నారని గుర్తించారు. వీటిల్లో పారడైజ్‌ ఫుడ్‌ కోర్ట్‌ కూడా ఉండటం గమనార్హం.

కడప రీజినల్‌ విజిలెన్స్‌ అండ్‌ ఎన్‌ఫోర్స్‌మెంట్‌ అధికారి, అదనపు ఎస్పీ షేక్‌ మాసుంబాష ఆదేశాల మేరకు మంగళవారం విజిలెన్స్‌ అధికారులు, జిల్లా ఫుడ్‌ సేఫ్టీ అధికారుల బృందం, కడప నగరపాలక సంస్థ శానిటరీ అధికారులు హోటళ్లపై ఏకకాలంలో వరుసగా దాడులు నిర్వహించారు. కడప నగరంలోని ఐదు హోటళ్లు, పారడైజ్‌ ఫుడ్‌కోర్టుల్లో గడువు ముగిసిన ఆహార పదార్థాలను గుర్తించిన అధికారులు.. సదరు రెస్టారెంట్‌ యాజమాన్యం మీద ఫుడ్‌ సేఫ్టీ అండ్‌ స్టాండర్డ్‌ యాక్ట్‌ 2006 కింద కేసులు నమోదు చేశారు. ఆయా హోటళ్లకు మొత్తం రూ.1,80,000 జరిమానా విధించారు.

ఈ హోటళ్లలో రాజ్‌ మయూర గార్డెనియా యాజమాన్యానికి రూ.50,000, మయూర బేకరీకి రూ.60,000, ఆంధ్రరుచులుకు రూ.10,000, స్వప్న బార్‌ అండ్‌ రెస్టారెంట్‌కు రూ.40,000, రాయలసీమ స్పైస్‌కు రూ.20,000 జరిమానా విధించారు. హోటల్స్‌, రెస్టారెంట్‌ యాజమాన్యం.. భారత ఆహార సంస్థ నిర్దేశించిన ప్రమాణాలతో వంటకాలను తయారు చేసి అమ్మాలని అధికారులు సూచించారు. ఆహార పదార్థాల్లో చైనా సాల్ట్‌, ఫుడ్‌ కలర్‌ ఇతర నిషేధిత పదార్థాలు వాడరాదని, పార్సిల్‌ విషయంలో ప్లాస్టిక్‌ కవర్లు వాడరాదని చెప్పారు. నాణ్యతా ప్రమాణాలు పాటించని సంస్థలపై భారీ ఎత్తున జరిమానా విధించడమే కాకుండా క్రిమినల్‌ కేసులు కూడా నమదు చేసి వ్యాపార సంస్థలు సీజ్‌ చేస్తామని అధికారులు హెచ్చరించారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి