iDreamPost

బాబు కలగన్నాడు..అందుకు పరిహారం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెల్లించారు…!!

బాబు కలగన్నాడు..అందుకు పరిహారం ఆంధ్రప్రదేశ్ ప్రజలు చెల్లించారు…!!

చంద్రబాబుకి ఓ కల వచ్చింది. తాను ఓ కులీకుతుబ్ షా అని ఆయన ఊహించుకున్నారు. అంతే హైదరాబాద్ నగరం కట్టాలని ఆయన ఆశించారు. కానీ అప్పటికే ఆ నగరం మనుగడలో ఉంది. అంతే ఏం చేయాలోనని ఆలోచించాడు. హైదరాబాద్ ని వదిలి హఠాత్తుగా కృష్ణా తీరంలో వాలిపోయారు. అప్పటికి ఆయన ముఖ్యమంత్రి కాబట్టి ఆయన వెంట ఓ రూ. 5 కోట్లు ఖరీదు చేసే బస్సు, మందీ మార్బలం భారీగానే తరలివచ్చింది.

తీరా కృష్ణా నది ఒడ్డున చూస్తే చుట్టూ పచ్చదనం. మూడు పంటలు పండించే మాగాణి నేల. పైగా అప్పుడప్పుడూ కృష్ణమ్మ కన్నెర్ర చేస్తే వరద పాలయ్యే ప్రాంతం కూడా. అంతేగాకుండా భూకంపాల భయం కూడా పొంచి ఉంది. అయితేనేం..ఆయన అనుకున్నాడు. తన కలల నగరం కట్టాలని సంకల్పించారు. సరిగ్గా ఈరోజుకి 5 ఏళ్ల క్రితం. హస్తిన నుంచి మట్టి, నీరు వచ్చింది. తెలంగాణా నుంచి కేసీఆర్ కూడా వచ్చారు. వారితో పాటు సింగపూర్ బ్యాచ్ సిద్దమయ్యారు. అంతే ఓ మహానగరం తాను నిర్మిస్తున్నట్టు, అది సింగపూర్ స్థాయిలో ఉంటుందని, ప్రపంచంలోనే అత్యుత్తమ రాజధాని అవుతుందని ఆయన ప్రకటించారు. ఆరోజే చంద్రబాబు మాటలకు అదే వేదిక మీద కూర్చున్న మోడీ, కేసీఆర్ లోలోన నవ్వుకునే ఉంటారు. బాబు భ్రమరావతి పురుడుపోసుకునే నాటికి తమ హస్తిన, భాగ్యనగరం ఏ స్థాయిలో ఉంటాయోనని ఊహించుకుంటూనే చంద్రబాబు గారడీని తిలకించారు.

కట్ చేస్తే మూడేళ్లు గడిచింది. భూములిచ్చిన వాళ్లు..అది నాలెడ్జ్ సిటీ, ఇదిగో హెల్త్ సిటీ అంటూ ప్రకటనలు మాత్రమే వింటున్నారు. చివరకు ఏసీ కూడా పైపుల ద్వారా సరఫరా చేస్తానంటే ఫక్కున నవ్వుకుందామనుకున్నా..మీడియా చేస్తున్న ప్రచారంతో మిన్నకున్నారు. దాంతో 2050 నాటికి మహానగరం అవుతుందంటే అంతా నమ్మేస్తున్నారని చంద్రబాబు భ్రమల్లో పడ్డారు. కళ్లు తెరిస్తే, నోరువిప్పితే అమరావతి తప్ప ఆయనకు మరోటి కనిపించేది కాదు..జనాలకు మరోటి వినిపించేవారు కాదు. అంతా చూస్తే గ్రాఫిక్స్ లో కట్టిన రాజధాని గ్రౌండులో లేకపాయే.. మహానగరం మాటలకే సరిపోయే.. అభివృద్ది ఆయన మాటల్లోనే మిగిలిపోయే.. చివరకు భూమిలిచ్చిన వాళ్లకు కౌలు కూడా పెండింగులో పెట్టెనాయే.

అసలే పిట్టని కొట్టా..పొయ్యిలో పెట్టా అన్న చందంగా రాష్ట్ర అర్థిక పరిస్థితి ఉండబట్టే. అలాంటి సమయాన కూడా ఏకంగా చదరపు గజానికి రూ.4వేలు చొప్పున చెల్లించి సెక్రటేరియేట్ కట్టినా అది కూడా తాత్కాలికమాయే. చిన్న వరదకే మోకాలి లోతు నీటిలో వెళ్లాల్సిన హైకోర్ట్ భవనం కట్టినా అది కూడా టెంపరరీనే. ఇలా తన పాలనంతా తాత్కాలిక హంగులతో సరిపెట్టే. దానికే బాబు బ్యాచ్ బహుబాగు అనుకున్నారు. పండుగలు చేశారు. కానీ ప్రజలు అలా అనుకోరుగా.. బాబు ఊహానగరం తమకు కానరావడం లేదే అని కలత చెందారు. అమరావతి అంతా హంబక్ అని అనుకున్నారు. ప్రచారంతో కట్టిన భవనాలు , పేపర్లో కనిపించిన డిజైన్ల కోసం వెదికారు. అయినా ఆనవాళ్లు లేకపోయేసరికి బాబుని నమ్ముకుంటే ఇంతేనని డిసైడ్ అయ్యారు. అంతే ఆఖరికి ఆంధ్రరాష్ట్రమంతా వదిలేసి..అమరావతి పరిధిలో కూడా ఆయన పార్టీని,సొంత కొడుకిని కూడా చీదరించుకున్నారు.

ఇదంతా జరిగిన తర్వాత గానీ బాబు కళ్లు తెరవలేదు. తన కల ఎన్నటికీ నిజం కాదని అర్థం కాలేదు. హైదరాబాద్ ని నేనే కట్టానని చెప్పుకున్నంత సులువు కాదని బోధపడలేదు. అమరావతి నగరం ఆచరణ సాధ్యం కాదని అవగాహన కలగలేదు. అయినా అప్పటికే ఐదేళ్ళు ఆరిపోయింది. ఆ విధంగా ముందుకు పోదాం అంటూ ఆయన చెప్పుకున్న చందాన దేశమంతా ముందుకు పోయినా అమరావతి కి అడుగు కూడా పడలేదు. ఒక్క శాశ్వత భవనం సిద్దంకాలేదు. దాంతో బాబు కలలు నిజం చేయాలంటే అప్పటికే నాలుగేళ్లు కరిగిపోయి, రాజధాని లేని రాష్ట్రంగా మిగిలిన ఏపీకి ఏదో దారి చూడాలని జగన్ నిర్ణయించారు. డిసెంబర్ 17, 2019 నాడు అసెంబ్లీ సాక్షిగా పాలనా వికేంద్రీకరణ ప్రకటన చేశారు. ఏపీలో ఉన్న ఏకైక మెట్రో సిటీని కేంద్రంగా చేసుకుని పాలన సాగించాలని సంకల్పించారు.

అసలే తన కలనెరవేరలేదని కుతకుతలాడుతున్న చంద్రబాబుకి ఇప్పుడు కలగనే అవకాశం కూడా లేదని తెలియడంతో కాలు గాలిన పిల్లిలా మారారు. ఏకంగా జోలిపట్టి తిరిగారు. ఒకప్పుడు తన చుట్టూ వలయంలా మారి కాపాడాలని వేడుకున్న బాబు ఇప్పుడు తన కలల సౌథం కోసం పాకులాడుతున్నారు. అందుకు అన్ని దారులు చూసుకుని ఆఖరికి న్యాయవ్యవస్థ వరకూ వచ్చారు. అసెంబ్లీ చేసిన చట్టాలను కూడా కాదని, కొందరు అనుకూల న్యాయమూర్తుల సాయంతో కాలయాపన యత్నాలు చేస్తున్నారు. తాను చేయలేనిది, మరొకరు చక్కదిద్దడాన్ని సహించలేకపోతున్నట్టు కనిపిస్తోంది. తాను ఊహించుకున్నట్టు కులీకుతుబ్ షా కాకపోయినా కనీసం ఔరంగజేబులా అయినా మారాలని సంకల్పించినట్టుంది. అందుకే ఆంధ్రప్రదేశ్ అభివృద్ది కోసం చేస్తున్న ప్రయత్నాలకు తన వ్యక్తిగత ప్రయోజనాలను ముడిపెట్టి అడగడుగునా అడ్డుపుల్ల వేసే పనిచేస్తున్నారు. రాజధాని పేరుతో కొనుగోలు చేసిన భూములను కాపాడుకునే యత్నంలో రాష్ట్ర ప్రయోజనాలను పణంగా పెడుతున్నారు.

ఇవన్నీ జనాలకు అర్థం కాకుండా చేయాలని బాబు, ఆయన బ్యాచ్ తాపత్రయం. తాము కలలు కంటారు. వాటిని జనంతో నిజం అనిపించాలని వారి ఆశ. అది ఆచరణలో సాధ్యం కాదని 2019 మే 22 నాడు ఈవీఎంల సాక్షిగా అర్థమయ్యింది. అయినా దింపుడు కళ్లం ఆశ.. అబద్ధాలతో అందరినీ వంచించాలని కోరిక.. వారిని ఇంకా నడిపిస్తున్నట్టు కనిపిస్తోంది. భ్రమరావతి నుంచి బయటపడలేక, అభివృద్ధిని సహించలేక, ఆంధ్రప్రదేశ్ ముందుడుగు వేయడం జీర్ణించుకోలేక ఇప్పుడు సతమతమవుతున్నట్టు అంతా భావించాల్సి వస్తోంది. అయినప్పటికీ రేపటితో ఐదేళ్లు నిండుతున్న ఊహజనిత నగరానికి అప్పుడే అవతరణ, అంతర్ధానం వెనుక అసలు కారణం చంద్రబాబు అని జనం ఎప్పుడో నిర్ణయించారన్నది మనం గుర్తుంచుకోవాలి. చంద్రబాబు కలల నుంచి బయటకు రాకపోయినా, కాలం ముందుకే వెళుతుంది తప్ప ..ఆయన కోరుకున్నట్టు కాదని గ్రహించాల్సి ఉంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి