iDreamPost

దీదీ దే బెంగాల్.. ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే..

దీదీ దే బెంగాల్.. ఐదు రాష్ట్రాల ఎగ్జిట్ పోల్స్ ఫలితాలు ఇవే..

ఐదు రాష్ట్రాల్లో సుదీర్ఘ ఎన్నికల ప్రక్రియ ముగిసింది. చిట్ట చివరిదైన బెంగాల్ ఎనిమిదో దశ పోలింగ్ ముగిసిన వెంటనే పలు సంస్థలు ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ప్రకటించాయి. వీటి అంచనాల ప్రకారం పశ్చిమ బెంగాల్, అసోం, కేరళ రాష్ట్రాల్లో ప్రస్తుతం అధికారంలో ఉన్న పార్టీలు, కూటములే మరోసారి విజయం సాధించనున్నాయి. అయితే తమిళనాడులో మాత్రం సంప్రదాయం ప్రకారం అక్కడి ఓటర్లు ఈసారి డీఎంకేకు పట్టం కట్టనున్నట్లు తెలుస్తోంది. కేంద్ర పాలిత ప్రాంతం పుదుచ్చేరి ఎగ్జిట్ పోల్స్ ఫలితాలను ఇంతవరకు ఏ సంస్థా ప్రకటించలేదు. కాగా ఏపీలో తిరుపతి లోకసభ ఉప ఎన్నికలో అధికార వైఎస్సార్సీపీ భారీ విజయం సాధించనుండగా.. తెలంగాణలోని నాగార్జునసాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార టీఆరెస్ విజయం సాధిస్తున్నట్లు ఎగ్జిట్ పోల్స్ వెల్లడించాయి.

హ్యాట్రిక్ దిశగా తృణమూల్..

దేశవ్యాప్తంగా ఆసక్తి రేకెత్తించిన పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ నేతృత్వంలోని తృణమూల్ కాంగ్రెస్ వరుసగా మూడోసారి అధికారంలోకి వస్తుందని అధిక శాతం ఎగ్జిట్ పోల్స్ అంచనా వేశాయి. సీట్ల సంఖ్య మాత్రం బాగా తగ్గి సాధారణ మెజారిటీతో గట్టెక్కుతుందని పేర్కొన్నాయి. 294 స్థానాలు ఉన్న బెంగాల్లో టీఎంసీకి 158, బీజేపీకి 115 సీట్లు వస్తాయని టైమ్స్ నౌ అంచనా వేసింది. సీ ఓటర్, ఈటీజీ, బెంగాల్ పీ మార్క్, ఎన్డీటీవీ, న్యూస్ ఎక్స్ పోల్స్ టీఎంసీకి 152-169, బీజేపీకి 110-125 సీట్లు లభిస్తాయని అంచనా వేసాయి. సీఎన్నెన్, రిపబ్లిక్-సీఎన్ఎక్స్ సంస్థలు మాత్రం తృణమూల్ కు 128-138 సీట్లే వస్తాయని, బీజేపీకి 138-148 సీట్లు వస్తాయని.. రెండు పార్టీలు మ్యాజిక్ మార్కుకు(148)కి దూరంగా ఉండిపోతాయని పేర్కొన్నాయి.

అసోంలో మళ్లీ కమల వికాసం

అసోంలో రెండోసారి అధికార పగ్గాలు బీజేపీకి అందనున్నాయి. దాదాపు అన్ని ఎగ్జిట్ పోల్స్ కమలానికే ఓటు వేశాయి. రిపబ్లిక్-సీఎన్ఎక్స్, ఇండియా టుడే, ఎన్డీటీవీ, ఆజ్ తక్-యాక్సిస్ సంస్థలు 75 నుంచి 85 స్థానాలు వస్తాయని అంచనా వేశాయి. 126 స్థానాలు ఉన్న ఈ రాష్ట్రంలో అధికారం చేపట్టే మ్యాజిక్ ఫిగర్ 64 కాగా కాంగ్రెస్ కూటమి 40-50 దగ్గరే ఆగిపోయే అవకాశముందని పేర్కొన్నాయి.

Also Read : లెక్కింపునకు ముందే తిరుపతి ఫలితాన్ని తేల్చిన టీడీపీ అనుకూల మీడియా

డీఎంకే వైపే మొగ్గు..

తమిళనాడు ఓటర్లు తమ సంప్రదాయాన్ని అనుసరించి ఈసారి డీఎంకేకు పట్టం కడుతున్నట్లు వెల్లడైంది. ఎన్డీటీవీ, రిపబ్లిక్-సీఎన్ఎక్స్ అంచనా ప్రకారం 234 సీట్లున్న అసెంబ్లీలో డీఎంకే 160-170 స్థానాలు సాధించనుంది. అధికార అన్నాడీఎంకే 58-68 సీట్లకు పరిమితమయ్యే అవకాశం ఉంది.

ఎల్డీఎఫ్ మరోసారి..

కేరళలో సంప్రదాయానికి భిన్నంగా వరుసగా రెండోసారి వామపక్ష కూటమి(ఎల్డీఎఫ్) అధికారంలోకి రానుంది. 140 సీట్లున్న ఈ రాష్ట్రంలో అధికార కూటమికి 72 నుంచి 104 స్థానాల వరకు రావచ్చని ఇండియా టుడే-యాక్సిస్, రిపబ్లిక్-సీఎన్ఎక్స్, టుడే చాణక్య, ఎన్డీటీవీ అంచనా వేశాయి. ప్రతిపక్ష యూడీఎఫ్ కు 20 నుంచి 58 స్థానాలు వస్తాయని పేర్కొన్నాయి.

వైఎస్సార్సీపీకే తిరుపతి జై..

కాగా ఆంధ్రప్రదేశ్ లోని తిరుపతి పార్లమెంట్ ఉప ఎన్నికలో ఓటర్లు వైఎస్సార్సీపీకి బ్రహ్మరథం పట్టినట్లు వెల్లడైంది. ఆరా సంస్థ అంచనా ప్రకారం వైఎస్సార్సీపీకి 65.85, టీడీపీకి 23.10, బీజేపీకి కేవలం 7.4 శాతం ఓట్లు లభిస్తాయి. ఆత్మసాక్షి అంచనా ప్రకారం వైసీపీకి 59.25, టీడీపీకి 31.25, బీజేపీకి 7.5 శాతం ఓట్లు లభిస్తాయి.

సాగర్ లో కారు..

తెలంగాణలోని నాగార్జున సాగర్ అసెంబ్లీ ఉప ఎన్నికలో అధికార టీఆరెస్ విజయం ఖాయమైనట్లు కనిపిస్తోంది. ఆ పార్టీకి 50.48, కాంగ్రెస్ కు 39.93, బీజేపీకి 6.31 శాతం ఓట్లు వస్తాయని ఆరా సంస్థ అంచనా వేసింది. ఆత్మసాక్షి అంచనా ప్రకారం టీఆరెస్ కు 43.50, కాంగ్రెస్ కు 36.50, బీజేపీకి 14.60 శాతం ఓట్లు లభిస్తాయి.

Also Read : వైఎస్ ప్రభంజనానికి ఎదురొడ్డి గెలిచిన చిట్టబ్బాయి ఇకలేరు

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి