iDreamPost

ఎట్టకేలకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన శివరాజ్

ఎట్టకేలకు మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసిన శివరాజ్

ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన దాదాపు నెల రోజుల తర్వాత మధ్యప్రదేశ్ లో సీఎం శివరాజ్ సింగ్ చౌహాన్ మంత్రివర్గాన్ని ఏర్పాటు చేశారు. తన ప్రభుత్వంలోని ఐదుగురు కు మంత్రి పదవులు కేటాయించారు. రాజ్ భవన్ లో గవర్నర్ లాల్జి టాండన్ మంత్రులతో ప్రమాణ స్వీకారం చేయించారు. మంత్రులగా బాధ్యతలు చేపట్టిన వారిలో నరోత్తం మిశ్రా, కమల్ పటేల్, మీనా సింగ్, తులసి శిలావత్, గోవింద్ సింగ్ రాజ్ పుత్ ఉన్నారు. ఇందులో ముగ్గురు కాంగ్రెస్ తిరుగుబాటు నేత జ్యోతిరాదిత్య సిందియా వర్గం నేతలున్నారు. 230 శాసన సభ స్థానాలు ఉన్న మధ్య ప్రదేశ్ లో.. 35 మంది మంత్రులు ఉండొచ్చు. ప్రస్తుతం నియమించిన ఐదుగురు కాకుండా ఇంకా 30 మందికి చోటు కల్పించొచ్చు.

కరోనా వైరస్ విజృంభిస్తున్న సమయంలో రాష్ట్రానికి ఆరోగ్యశాఖ మంత్రి, హోంశాఖ మంత్రి లేరననే విమర్శలు ఇటీవల అన్ని వర్గాల నుంచి వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలోనే శివరాజ్ సింగ్ తన క్యాబినెట్ కూర్పు చేపట్టారు. మార్చి 23వ తేదీన సీఎంగా శివరాజ్ సింగ్ చౌహాన్ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆయన ఒక్కడే కరోనా వైరస్ కట్టడి నియంత్రణ చర్యలు, పరిపాలనను చేస్తున్నారు. కరోనా పై సమీక్షలు నిర్వహిస్తూ అధికారులకు దిశానిర్దేశం చేస్తున్నారు.

Also Read:మంత్రి మండలి లేని ముఖ్యమంత్రి

పదిహేనేళ్ల తర్వాత మధ్యప్రదేశ్ లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అయితే కాంగ్రెస్ పార్టీలో నెలకొన్న అంతర్గత విభేదాల వల్ల 15 నెలలకే ప్రభుత్వం పడిపోయింది. జ్యోతిరాదిత్య సింధియా కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి తన వర్గం ఎమ్మెల్యేలు 23 మంది తో బిజెపిలో చేరారు. దీంతో ప్రభుత్వం మైనార్టీలో పడడంతో బలం నిరూపించుకోవాలని గవర్నర్ సీఎం కమలనాథ్ ను ఆదేశించారు.

కొద్దిరోజుల పాటు మధ్యప్రదేశ్లో నాటకీయ పరిణామాలు జరిగాయి. ఆఖరకు అసెంబ్లీలో బలనిరూపణకు ముందే సీఎం కమల్నాథ్ రాజీనామా చేశారు. ఆ మరుసటి రోజే బిజెపి ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వరుసగా 15 ఏళ్లపాటు మధ్యప్రదేశ్ సీఎంగా పనిచేసిన శివరాజ్ సింగ్ చౌహాన్ నాలుగోసారి సీఎంగా బాధ్యతలు చేపట్టారు. బీజేపీలో చేరిన జ్యోతిరాదిత్య సింధియాకు రాజ్యసభ అభ్యర్థిత్వాన్ని బిజెపి అధిష్టానం ఖరారు చేసింది. ఆయనను కేంద్ర కేబినెట్ లోకి తీసుకునే అవకాశాలు ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి