iDreamPost

కెకె – మరణం లేని గాత్రం.. ప్రముఖ సింగర్ KK హఠాన్మరణం..

కెకె – మరణం లేని గాత్రం.. ప్రముఖ సింగర్ KK హఠాన్మరణం..

నిన్న రాత్రి హఠాత్తుగా గుండెపోటుతో కన్నుమూసిన బాలీవుడ్ సింగర్ కెకె అలియాస్ కృష్ణకుమార్ కున్నత్(53) మరణం పట్ల యావత్ సినీ ప్రపంచం తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యింది. కోల్కతాలో జరిగిన ఒక లైవ్ కన్సర్ట్ లో పాల్గొని పాటలు పాడాక అస్వస్థత గురయ్యారు కెకె. ఆసుపత్రికి సకాలంలో తీసుకెళ్ళినప్పటికీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఆయన తుది శ్వాస తీసుకున్నట్టు వైద్యులు పేర్కొన్నారు. కేవలం హిందీ సినిమా సంగీతంలోనే కాదు కెకె ముద్ర తెలుగులోనూ బలంగా ఉంది. ఖుషిలో ఏ మేరా జహా అంటూ పవన్ కళ్యాణ్ ఇంట్రో సాంగ్ తో అప్పటి యూత్ కి బాగా కనెక్ట్ అయ్యారు. బాలులో ఇంతే ఇంతింతేలో ఉచ్చారణకు ఎవరైనా వాహ్ అనాల్సిందే.

నువ్వు నేనులో నీ కోసమే ఈ అన్వేషణ పాటలో గాఢత కెకె గొంతులో అద్భుతంగా పలికింది. ఘర్షణలో చెలియా చెలియా ఎంత పెద్ద ఛార్ట్ బస్టరో ప్రత్యేకంగా గుర్తు చేయాల్సిన పనిలేదు. ఇంద్రలో దాయి దాయి దామ్మా ఇప్పటికీ మెగా ఫ్యాన్స్ కు ఆల్ టైం ఫెవరెట్. జల్సాలో మై హార్ట్ ఈజ్ బీటింగ్, నువ్వే నువ్వేలో యాం వెరీ సారీ,సంతోషంలో దేవుడే దిగి వచ్చినా, ఆర్యలో ఫీల్ మై లవ్ ఇలా చెప్పుకుంటూ పోతే కెకె ముద్ర మన మీద ఎంత బలంగా ఉందో అర్థమవుతుంది. ఎస్బి బాలు, శంకర్ మహదేవన్, హరిహరన్, ఉదిత్ నారాయణ్ లాంటి ఉద్దండులు చక్రం తప్పుతున్న టైంలోనే కెకె తనకంటూ ప్రత్యేకమైన ఫాలోయింగ్ ఏర్పరుచుకోగలిగారు.

ఇక కెకె బాలీవుడ్ ప్రస్థానం చాలా పెద్దది. హిందీలోనే కాదు తమిళం, కన్నడ, మరాఠీ, ఒడియా, బెంగాలీ, అస్సామీ, గుజరాతి ఇలా ఏ భాషలోనూ అవకాశాలు విడిచిపెట్టేవారు కాదు. 1968 ఆగస్ట్ 23 జన్మించిన కెకె భార్య పేరు జ్యోతి కాగా ఆయనకు ఇద్దరు పిల్లలు. ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన ఒక యాడ్ ద్వారా కెకె పరిశ్రమలో అడుగుపెట్టారు. 1999లో పల్ అనే స్వంత ఆల్బమ్ ద్వారా శ్రోతలకు పరిచయమైన కెకె అక్కడి నుంచి వెనుదిరిగి చూసుకోవాల్సిన అవసరం పడలేదు. హం దిల్ దే చుకే సనమ్, ఆషీకీ 2, ఓం శాంతి ఓం, హేరా ఫెరీ, దిల్ చాహ్ తా హై, సాతియా లాంటి ఎన్నో సూపర్ హిట్స్ కెకె ఖాతాలో ఉన్నాయి. ఆ గాత్రానికి మరణం ఉండదు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి