iDreamPost

ఆ గూటిలో అస‌హ‌నంగా క‌నిపిస్తున్న బాబు స‌న్నిహితులు

ఆ గూటిలో అస‌హ‌నంగా క‌నిపిస్తున్న బాబు స‌న్నిహితులు

ఏపీ రాజ‌కీయాల్లో బ‌ళ్లు ఓడ‌లు, ఓడ‌లు బ‌ళ్లు కావడంతో అనివార్యంగా ప‌లువురు నేత‌లు బీజేపీ పంచ‌న చేరాల్సి వ‌చ్చింది. ముఖ్యంగా బీజేపీ తో నాలుగేళ్ల స్నేహం త‌ర్వాత ఏడాది కాలం పాటు వివిధ రూపాల్లో విరుచుకుప‌డిన చంద్ర‌బాబు స‌న్నిహితులు మ‌ళ్లీ క‌మ‌లం గూటికే చేరాల్సి వ‌చ్చింది. న‌లుగురు ఎంపీలు పార్టీని వీడినా క‌నీసం వారి మీద విమ‌ర్శ‌లు చేసేందుకు గానీ, ఫిరాయింపుల నిరోధ‌క చ‌ట్టం కింద ఫిర్యాదు చేయ‌డానికి కూడా టీడీపీ అధిష్టానం సిద్ధ‌ప‌డ‌లేదు.

అదే స‌మ‌యంలో పార్టీ ఫిరాయించిన మ‌రునాడే స‌భ‌లో అర్హ‌త కోల్పోయేలా చ‌ర్య‌లుండాల‌ని సుద్దులు ప‌లికిన రాజ్య‌స‌భ చైర్మ‌న్ వెంక‌య్య నాయుడు కూడా ఉలుకూ ప‌లుకూ లేకుండా ఉన్నారు. దాంతో చంద్ర‌బాబు సూచ‌న‌ల‌తోనే న‌లుగురు రాజ్య‌స‌భ స‌భ్యులు బీజేపీలో చేరార‌నేందుకు ఇంతక‌న్నా సాక్ష్యాలు ఏం కావాల‌నే వాద‌న‌కు బ‌లం చేకూరుతోంది. అదే స‌మ‌యంలో బీజేపీలో చేరిన న‌లుగురు నాయ‌కులు కూడా త‌మ మాజీ బాస్ బాబుని ప‌ల్లెత్తు మాట అన‌డానికి కూడా సాహసించ‌క‌పోవ‌డంతో బాబు స‌న్నిహితులు ఉద్దేశ్య‌పూర్వ‌కంగానే బీజేపీ తీర్థం పుచ్చుకున్న‌ట్టు స్ప‌ష్టం అవుతోంది.

మారుతున్న ప‌రిణామాల‌తో రాజ‌ధాని వికేంద్రీక‌ర‌ణ‌, మండ‌లి ర‌ద్దు స‌హా అనేక నిర్ణ‌యాల‌తో జ‌గ‌న్ దూకుడుగా ఉన్నారు. పైగా కేంద్రం నుంచి సానుకూల‌త‌ను కూడా సంపాదిస్తున్నారు. దాంతో ఏపీలో జ‌గ‌న్ మీద ఒంటికాలిపై లేచే ప్ర‌య‌త్నాలు చేస్తున్న కాషాయ‌ధారులైన బాబు స‌న్నిహితుల‌కు చికాకుగా మారుతోంది. అమ‌రావ‌తిని క‌దిలించ‌డం ఎవ‌రి త‌రం కాద‌ని ప్ర‌క‌ట‌న‌లు ఇస్తున్నా ప‌రిణామాలు భిన్నంగా ఉండ‌డంతో వారిలో అస‌హ‌నం పెరుగుతున్న‌ట్టు చెబుతున్నారు. పైగా జీవీఎల్ వంటి నేత‌లు నేరుగా హెచ్చ‌రిక‌లు చేయ‌డానికి కూడా సిద్ధ‌ప‌డ‌డం అస‌లు స‌హించ‌లేక‌పోతున్నట్టు క‌నిపిస్తోంది.

పేరుకి బీజేపీ నాయ‌కులుగా ఉన్న‌ప్ప‌టికీ పార్టీ విధానాల‌ను, కార్యాచ‌ర‌ణ‌కు వారంతా అల‌వాటు ప‌డ‌లేద‌నే అభిప్రాయం జీవీఎల్ వ్య‌క్త ప‌రుస్తున్నారు. పార్టీలో ఉండాలంటే బీజేపీ వ్య‌వ‌హార‌శైలికి అలవాటు ప‌డాల్సిందేన‌ని వార్నింగ్ కూడా ఇచ్చారు. దాంతో జీవీఎల్ కి వ్య‌తిరేకంగా కేంద్రంలో లాబీయింగ్ చేసేందుకు ఈ ఫిరాయింపుల‌లో కీల‌క‌నేత‌గా ఉన్న సుజ‌నా చౌద‌రి వంటి వారు శ‌త‌విధాలా ప్ర‌య‌త్నించారు. అయినా ఫ‌లితం ద‌క్క‌లేదు. దాంతో అటు ప్ర‌భుత్వ‌ప‌రంగానూ, ఇటు పార్టీ ప‌రంగానూ త‌మ మాట‌కు విలువ లేకుండా పోయింద‌ని వారంతా అంత‌రంగీకుల ముందు వాపోవాల్సి వ‌స్తోంది.

బీజేపీలో చేర‌డ‌మే బాబు అండ్ అద‌ర్స్ ని కాపాడేందుకేన‌ని కొంద‌రు విమ‌ర్శించారు. వీరిని “పచ్చ బీజేపీ” అని కూడా మీడియాలో అంటున్నారు .కానీ ఇప్పుడు అలాంటి కాపాడే ప్ర‌య‌త్నాలు ఫ‌లిస్తున్న దాఖ‌లాలు లేవు. సీఎం ర‌మేష్ వంటి వారి మీద ఐటీ, సుజ‌నా మీద ఈడీ దూకుడు త‌గ్గినా తాజాగా చంద్ర‌బాబు శిబిరంలో ఐటీ ప్ర‌కంప‌న‌లు పుట్టించాయి. నేరుగా 2 వేల కోట్ల అక్ర‌మాలు ల‌భ్య‌మ‌య్యాయంటూ ప్ర‌క‌ట‌న ఇచ్చి రాజ‌కీయంగానూ టీడీపీని డిఫెన్స్ లోకి నెట్టారు. ఈ ప‌రిస్థితులు కూడా సుజ‌నా శిబిరానికి రుచించ‌డం లేదు. తాము చేస్తున్న ప్ర‌య‌త్నాల‌కు ఫ‌లితాలు లేవ‌నే అభిప్రాయం వారికి క‌లుగుతోంది. రెంటికీ చెడ్డ రేవడిలా మారుతున్న‌ట్టు వారిలో క‌ల‌వ‌రం మొద‌ల‌యిన‌ట్టు భావిస్తున్నారు. తామంతా ఎంత‌గా ప్ర‌య‌త్నించినా ఓవైపు బాబుని దిగ్బంధ‌నం చేసేందుకు దారితీస్తున్న వ్య‌వ‌హారాల‌తో మ‌ధ‌న‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. దాంతో ఏం చేయాల‌నే విష‌యంలో మ‌ల్ల‌గుల్లాలు ప‌డుతున్న‌ట్టు చెబుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి