iDreamPost

ఎలా ఉండేవాడు..? ఎలా అయిపోయాడు..?

ఎలా ఉండేవాడు..? ఎలా అయిపోయాడు..?

మాజీ ఎమ్మెల్యే, టీడీపీ నేత బోండా ఉమామహేశ్వరరావును ఓ ఘటన పీడకలలా వేంటాడుతున్నట్లుగా ఆయన మాటలను బట్టి తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో మాచర్లలో జరిగిన ఘటన బోండా ఉమామహేశ్వరావు వ్యవహారశైలినే పూర్తిగా మార్చివేసింది. ఆ ఘటన జరగకముందు భీకర వాయిస్‌తో రాజకీయ ప్రత్యర్థులపై విరుచుకుపడే బోండా ఉమామహేశ్వరరావు ఆ తర్వాత పూర్తిగా ఢీలా పడ్డారు. నిత్యం ఆందోళనతో గడుపుతున్నట్లుగా పలు సందర్భాల్లో ఆయన చేస్తున్న వ్యాఖ్యలను బట్టి అర్థం అవుతోంది. తాజాగా ఆయన ఎప్పటిలాగే.. తమను చంపేస్తారని, అందుకోసం ప్రణాళికలు రచించారని, ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేశారని, తమకు ఏదైనా జరిగితే వైసీపీ ప్రభుత్వానిదే బాధ్యతంటూ.. బోండా ఉమామహేశ్వరరావు వాపోయారు.

ప్రాథమిక విద్యార్హతే ఉన్న బోండా ఉమామహేశ్వరావుకు తన నోరే బలం. ప్రత్యర్థులపై విరుచుకుపడుతూ మాటల తూటాలు, హెచ్చరికలు చేయడంలో ఆయనకు ఆయనే సాటి. గత ప్రభుత్వంలో అసెంబ్లీ సాక్షిగా బోండా ఉమామహేశ్వరరావు చేసిన హంగామా ఇప్పటికీ రాష్ట్ర ప్రజలకు గుర్తు ఉంది. ఆ ఘటనతోనే బోండా ఉమా రాష్ట్ర వ్యాప్తంగా ఫేమస్‌ అయ్యారు. ప్రస్తుత పౌరసరఫరాల శాఖ మంత్రి, అప్పటి ప్రతిపక్ష ఎమ్మెల్యే అయిన కొడాలి నానిపై బోండా బూతులు తిడుతూ విరుచుకుపడిన వైనం అప్పట్లో సంచలనం కలిగించింది. అసభ్యపదజాలం ఉపయోగిస్తూ.. పాతేస్తా.. నరికేస్తా.. వంటి డైలాగులతో బోండా ఉమా అసెంబ్లీలో హల్‌చల్‌ చేశారు.

ఈ ఘటనే.. ఆయనను 2018లో జరిగిన మంత్రివర్గ విస్తరణలో మంత్రిపదవి ఆశించేలా చేసింది. అయితే మంత్రిపదవి ఆశ తీరలేదు. ఆ సమయంలో బోండా ఉమా కొన్ని రోజులపాటు అలకపాన్పు ఎక్కారు కూడా. ఆ తర్వాత సర్దుకున్నారు.

ఇలాంటి వ్యవహార శైలితో రాజకీయం చేసిన బోండా ఉమామహేశ్వరరావు ఇప్పుడు అందుకు పూర్తి భిన్నమైన ప్రవర్తనతో బేల మాటలు మాట్లాడుతుంటే ఆయన అనుచరులే విస్తుబోతున్నారు. పులిలా ఉండే తమ నేతను.. ఒక్క మాచర్ల ఘటన ఇలా మార్చేసిందని వాపోతున్నారని చెబుతున్నారు. కార్పొరేటర్‌ నుంచి ఎమ్మెల్యే అయిన బోండా ఉమాను దగ్గరగా చూసిన విజయవాడ వాసులు కూడా బోండా ఉమా ప్రస్తుత తీరును చూసి.. ‘ఎలా ఉండేవాడు.. ఎలా అయిపోయాడు’ అని అనుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి