iDreamPost

ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకు.. పుల్లారావు..!

ఎన్నాళ్లకు.. ఎన్నాళ్లకు.. పుల్లారావు..!

అమరావతి రాజధాని.. అంతా రహస్యమే. ఎన్నో చిక్కు ప్రశ్నలు.. మరెన్నో సందేహాలు.. భూముల నుంచి రాజకీయ నేతల వరకూ ప్రతి అంశంలోనూ అంతుచిక్కని వ్యవహారాలెన్నో ఇప్పటి వరకూ అమరావతిలో కనిపించాయి. రాజకీయ నేతల వ్యవహార శైలి అయితే అంతుబట్టకుండా ఉంది. అమరావతి ఉద్యమంలో తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడు క్రియాశీలక పాత్ర పోషిస్తున్నారు. ఫిజికల్‌గా పోరాటంలో లేకపోయినా.. జూమ్‌ యాప్‌ ద్వారా తన ఉద్యమాన్ని కొనసాగిస్తున్నారు. మూడు రాజధానులకు గవర్నర్‌ ఆమోదముద్ర వేసిన తర్వాత అమరావతి ఉద్యమం 2.0 మొదలైందన్న చంద్రబాబు.. ఆ దిశగా తన నోటికి పని చెబుతున్నారు. ఆయనకు అండగా.. అమరావతి ఉద్యమం తొలి దశలో కనిపించిన టీడీపీ మాజీ ప్రజా ప్రతినిధులు కూడా ఇప్పుడు బయటకు వస్తున్నారు.

గుంటూరుకు చెందిన మాజీ మంత్రి ప్రత్తిపాటి పుల్లారావు.. అమరావతి తొలి దశ ఉద్యమంలో పెద్దగా ఎక్కడా కనిపించలేదు. అయితే గత నాలుగు రోజుల నుంచి ఆయన అమరావతి ఉద్యమంలో కనిపిస్తున్నారు. అమరావతికి మద్ధతుగా, మూడు రాజధానులకు వ్యతిరేకంగా మాట్లాడుతూ ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్నారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌లో అమరావతిలో భూములు కొనుగోలు చేశారన్న ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిలో ప్రత్తిపాటి పుల్లారావు కూడా ఒకరు. కుటుంబ సభ్యుల పేర్ల మీద కూడా భూములు కొనుగోలు చేశారనే ఆరోపణలు వచ్చిన సమయంలో వాటిని ఖండించేందుకు మీడియా ముందుకు వచ్చిన ప్రత్తిపాటి.. ఆ తర్వాత కనిపించకుండా పోయేవారు. ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ వ్యవహారంపై విచారణ సాగిస్తున్న సీఐడీ.. ప్రత్తిపాటిపై కూడా కేసులు నమోదు చేసింది. అయితే ఇన్నాళ్లు కనిపించని ప్రత్తిపాటి పుల్లారావు.. ఇప్పుడు అకస్మాత్తుగా బయటకు రావడం వెనుకు మతలబేంటి..? అనే ప్రశ్న వినిపిస్తోంది.

తనదైన శైలిలో అమరావతి ఉద్యమాన్ని నడిపిస్తున్న చంద్రబాబు రాయలసీమ నేతలతో మూడు రాజధానులకు వ్యతిరేకంగా రాజీనామాలు, ప్రకటనలు ఇప్పిస్తున్నారు. అయితే రాజధాని ప్రాంతమైన కృష్ణా, గుంటూరు జిల్లాల నేతలు మాత్రం పెద్దగా స్పందించడం లేదనే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే చంద్రబాబు.. కృష్ణా, గుంటూరు నేతలు ఉద్యమంలో పాలుపంచుకునేలా మంతనాలు జరిపారనే టాక్‌ నడుస్తోంది. అందుకే ఇన్‌సైడర్‌ ట్రేండిగ్‌లో ఆరోపణలు ఎదుర్కొంటూ ఇన్నాళ్లు అజ్ఞాతంలో ఉన్న మాజీ మంత్రి ప్రత్తిపాటి వెలుగులోకి వచ్చారని చెబుతున్నారు. అమరావతి భూముల వ్యవహారంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న టీడీపీ నేతలు చాలా మంది ఇంకా అజ్ఞాతంలోనే ఉన్నారు. మరి వారు కూడా ప్రత్తిపాటి దారిలోనే నడుస్తారా..? లేక అజ్ఞాతంలోనే ఉంటారా..? వేచి చూడాలి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి