iDreamPost

భేషుగ్గా బొజ్జల… మంత్రి పదవి ఎందుకు తొలగించినట్లు..?

భేషుగ్గా బొజ్జల…  మంత్రి పదవి ఎందుకు తొలగించినట్లు..?

టీడీపీ సీనియర్‌ నేత, ఐదు సార్లు ఎమ్మెల్యే, రెండు సార్లు మంత్రిగా పని చేసిన చిత్తూరు జిల్లా శ్రీకాళహస్తి నేత, మాజీ మంత్రి బొజ్జల గోపాలకృష్ణారెడ్డి దాదాపు రెండేళ్ల తర్వాత మరోసారి వార్తల్లో నిలిచారు. ఆయనకు ఆరోగ్యం బాగోలేదంటూ 2017 ఏప్రిల్‌లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు తన మంత్రివర్గం నుంచి తొలగించారు. ఈ వ్యవహారం అప్పట్లో హాట్‌ టాపిక్‌ అయింది.

సాధారణ ఆనారోగ్యాన్ని కారణంగా చూపి అత్యంత అవమానకరమైన రీతిలో తమ నాయకుడుని మంత్రి పదవి నుంచి తొలగించారని బొజ్జల అనుచరులు, అభిమానులు అప్పట్లో ఆవేదన చెందారు. ఆయన కుటుంబ సభ్యులు కూడా చంద్రబాబు వ్యవహరించిన తీరుపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇన్నేళ్లు పార్టీని నమ్ముకున్న వ్యక్తి, తనకు స్నేహితుడైన బొజ్జలకు చంద్రబాబు అన్యాయం చేశారంటూ బొజ్జల సతీమని ఎండగట్టారు. వైఎస్‌ రాజశేఖరరెడ్డి, మాజీ మంత్రి జక్కంపూడి రామ్మోహన్‌ రావు స్నేహాన్ని బొజ్జల సతీమని ఆ సందర్భంగా గుర్తు చేస్తూ చంద్రబాబుకు, వైఎస్సార్‌కు మధ్య ఉన్న వ్యత్యాసాన్ని ఎత్తి చూపారు.

బొజ్జలకు కేసీఆర్‌ పరామర్శ..  

తాజాగా బొజ్జల ఇంటికి తెలంగాణ సీఎం కేసీఆర్‌ వెళ్లారు. ఆయన్ను ఆప్యాయంగా పలకరించారు. వారి కుటంబంతో కలసి భోజనం చేశారు. కేసీఆర్‌ తెలుగుదేశంలో ఉన్నప్పటి నుంచి బొజ్జలతో మంచి స్నేహం ఉంది. టీఆర్‌ఎస్‌ పార్టీ స్థాపించిన తర్వాత కూడా ఆ స్నేహం కొనసాగింది. అనారోగ్యం నుంచి బొజ్జల కోలుకుని చాలా కాలమైనా బిజీ షెడ్యూల్‌ వల్ల ఇన్నాళ్లు కేసీఆర్‌ ఆయన్ను ఫోన్‌లో తప్పా నేరుగా పరామర్శించలేదు. తాజాగా ఆదివారం బంజార హిల్స్‌లోని బొజ్జల ఇంటికి వెళ్లి పరామర్శించారు.

రాజకీయ ప్రయోజనాలే బాబుకు మఖ్యం..

బొజ్జలతో కేసీఆర్‌ ఉన్న ఫొటోలు మీడియాలో రావడంతో బొజ్జలను చూసిన వారు ‘బొజ్జల భేషుగ్గా ఉన్నారు. అయినా చంద్రబాబు మంత్రి పదవి నుంచి తొలగించారు’’ అంటూ వ్యాఖ్యానిస్తున్నారు. బాబు తన రాజకీయ జీవితంలో ఎన్నడూ స్నేహానికి విలువివ్వలేదని బొజ్జల ఎపిసోడ్‌ను గుర్తు చేసుకుంటున్నారు. 2017లో జరిగిన మంత్రి వర్గ విస్తరణలో వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన వారికి మంత్రిపదవులు ఇచ్చేందుకు అనారోగ్య కారణాలు చూపి బొజ్జలను మంత్రి పదవి నుంచి తొలగించారని భావిస్తున్నారు. ఆ సమయంలో.. వైఎస్సార్‌సీపీ నుంచి టీడీపీలోకి ఫిరాయించిన అమర్‌నాథ్‌ రెడ్డి, ఆదినారాయణ రెడ్డి, సుజయ్‌కృష్ణరంగారావు, అఖిల ప్రియలకు మంత్రిపదవులు ఇచ్చారు.

ఎన్టీఆర్‌ను గద్దె దింపే వ్యవహారంలో వైశ్రాయ్‌ హోటల్‌ ఘటన కీలకమైంది. ఈ వైశ్రాయ్‌ హోటల్‌ స్వయానా బొజ్జల బావమరిది ప్రభాకర్‌ రెడ్డి కావడం గమనార్హం. వైశ్రాయ్‌ వ్యవహారంలో బొజ్జలది ముఖ్యపాత్రని రాజకీయ విశ్లేషకులు, అప్పటి తరం నేతలు ఇప్పటికీ వ్యాఖ్యానిస్తుంటారు. ఎన్టీఆర్‌ నుంచి ముఖ్యమంత్రి పీఠంతోపాటు పార్టీని చేజిక్కించుకోవడంలో చంద్రబాబుకు ఇంతలా సహకరించిన బొజ్జలను తన మంత్రి వర్గం నుంచి తొలగించి ఎన్టీఆర్‌ ఘటనను తలపించారని వ్యాఖ్యానిస్తున్నారు. ఏమైనా బొజ్జల భేషుగ్గా ఉండడం, ఆయన్ను కేసీఆర్‌ కలవడం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌లో చర్చనీయాంశమవుతోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి