iDreamPost

వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ మంత్రి

వైఎస్సార్‌సీపీలో చేరిన మాజీ మంత్రి

స్థానిక సంస్థల ఎన్నికల సమయంలో జనసేన పార్టీకి గట్టి షాక్‌ తగిలింది. విశాఖ జిల్లాలో ఆ పార్టీకి పెద్ద దిక్కుగా ఉన్న మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు ఈ రోజు మంగళవారం వైఎస్సార్‌సీపీలో చేరారు. విశాఖలో ఆ పార్టీ రాజ్యసభ సభ్యుడు వి. విజయసాయి రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. ఆయనతోపాటు మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్‌ కూడా అధికారపార్టీలో చేరారు.

పసుపులేటి బాలరాజు..

మాజీ మంత్రి పసుపులేటి బాలరాజు రాజకీయ జీవితం కాంగ్రెస్‌ పార్టీతో ప్రారంభమైంది. 1989లో విశాఖ జిల్లా చింతపల్లి నుంచి తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచారు. 2009 ఎన్నికలకు ముందు జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో చింతపల్లి నియోజకవర్గం పాడేరులో విలీనమైంది. 2009లో పాడేరు నుంచి పోటీ చేసిన బాలరాజు సీపీఐ అభ్యర్థి గొడ్డేటి దేముడుపై కేవలం 587 స్వల్ప ఓట్లతో గెలిచారు. వైఎస్సార్‌ కేబినెట్‌లో గిరిజన సంక్షేమ శాఖ మంత్రిగా పని చేశారు.

2014లోనూ బాలరాజు కాంగ్రెస్‌ పార్టీలోనే ఉన్నారు. పాడేరు నుంచి పోటీ చేశారు. రాష్ట్రాన్ని విభజించారనే కోపం ప్రజల్లో పెల్లుబుకి కాంగ్రెస్‌ పార్టీ తుడిచిపెట్టుకుపోయిన సమయంలోనూ బాలరాజు పాడేరులో 21,086 ఓట్లు సాధించి తన సత్తాను చాటారు. ఆ ఎన్నికల్లో గిడ్డి ఈశ్వరి వైఎస్సార్‌సీపీ తరఫున గెలిచారు. 2019 ఎన్నికల్లోనూ బాలరాజు కాంగ్రెస్‌ పార్టీ తరఫునే పోటీ చేస్తారని అందరూ బావించారు. గిడ్డి ఈశ్వరి టీడీపీలోకి ఫిరాయించడంతో.. ఆ ఎన్నికల్లో బాలరాజుకు గెలుపు అవకాశాలున్నాయని అంచనా వేశారు. అయితే ఆశ్చర్యంగా ఆయన ఎన్నికలకు ముందు జనసేన పార్టీలో చేరారు. పాడేరు నుంచి జనసేన తరఫున బరిలోకి దిగి కేవలం 6,038 ఓట్లు మాత్రమే సాధించారు. ఈ ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అభ్యర్థి భాగ్యలక్ష్మీ గెలుపొందారు.

తైనాల విజయ్‌కుమార్‌…

విశాఖ ఉత్తర నియోజకవర్గం మాజీ ఎమ్మెల్యే తైనాల విజయ్‌కుమార్‌ తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు. 2019 ఎన్నికల్లో టిక్కెట్‌ రాదని నిర్ణయానికొచ్చిన విజయ్‌కుమార్‌ ఏప్రిల్‌లో టీడీపీ చేరారు. న్యాయవాది అయిన విజయ్‌కుమర్‌ గ్రేటర్‌ విశాఖ కార్పొరేషన్‌లో కార్పొరేటర్‌గా తన రాజకీయ జీవితం ప్రారంభించారు. 2009 ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ విశాఖ ఉత్తరం నుంచి పోటీ చేసి గెలిచారు. 2014లో వైఎస్సార్‌సీపీలో చేరారు. 2019 ఎన్నికల వరకు వైఎస్సార్‌సీపీలో వివిధ పదవులు చేపట్టారు. తాజాగా విశాఖ కార్పొరేషన్‌ ఎన్నికల సమయంలో తిరిగి వైఎస్సార్‌సీపీలో చేరారు.

స్థానిక సంస్థల ఎన్నికలకు ముందు బాలరాజు, తైనాల విజయ్‌కుమార్‌లు వైఎస్సార్‌సీపీలో చేరడంతో ఆ పార్టీకి మరింత బలం చేకూరినట్లైంది. విశాఖ కార్పొరేషన్‌లో జెండా ఎగురవేయాలని ఆశిస్తున్న వైఎస్సార్‌సీపీకి నేతల చేరిక లాభించనుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి