iDreamPost

ఆధారాలు ఉంటే రెండేళ్లు ఏంచేస్తున్నారు రావు గారు..?

ఆధారాలు ఉంటే రెండేళ్లు ఏంచేస్తున్నారు రావు గారు..?

కేంద్ర దర్యాప్తు సంస్థ అచేతనంగా మారింది.. ఏడాదిగా మీనమేషాలు లెక్కిస్తోంది.. నేను రెండుసార్లు ఫోన్ చేసినా దర్యాప్తు అధికారి స్పందించలేదు.. ఇదీ మాజీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఏబీవీ వెంకటేశ్వరరావు వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసుకు సంబంధించి సీబీఐకి రాసిన లేఖలోని కొంత భాగం. మాజీ మంత్రి వివేకా హత్య కేసుకు సంబంధించిన సమాచారం తన వద్ద ఉందంటూ ఆయన రాసిన లేఖ సీఎం జగన్ కుటుంబంపై వేలెత్తి చూపే ప్రయత్నంగా కనిపించినప్పటికీ.. దాన్ని నిశితంగా పరిశీలిస్తే.. పలు దురుద్దేశాలు, నాటి ప్రభుత్వ అసమర్థత, నిఘా విభాగం చీఫ్ గా ఏబీవీ వైఫల్యాన్ని ఎక్కువగా ఎత్తి చూపుతోంది.

లేఖలో ఏం రాశారంటే..

వివేకా హత్య కేసు విచారణ మళ్లీ ప్రారంభమైన తరుణంలో దర్యాప్తు చేస్తున్న సీబీఐ తీరునే తప్పుపట్టిన ఏబీవీ.. వైఎస్ కుటుంబంపై పలు అభాండాలు వేసేందుకు తన లేఖలో ప్రయత్నించారు. హత్య జరిగినప్పుడు తాను ఇంటెలిజెన్స్ అధిపతిగా ఉన్నానని.. సంఘటన స్థలానికి హెడ్ కానిస్టేబుల్ ను, ఇంటెలిజెన్స్ హోమ్ గార్డును పంపగా ఎంపీ అవినాష్ రెడ్డి, ఆయన బంధువులు ఇంటిని తమ అదుపులోకి తీసుకొని మీడియాను, పోలీసులను లోపలికి వెళ్లకుండా అడ్డుకున్నారని లేఖలో ఆరోపించారు. ఆధారాలు చేరిపేశారని పేర్కొన్నారు. తన వద్ద ఉన్న ఈ కేసు వివరాలు చెప్పడానికి దర్యాప్తు అధికారి ఎన్. ఎం.సింగ్ కు పలుమార్లు ఫోన్ చేసినా స్పందన లేదన్నారు. కేసును సీబీఐకి అప్పగించి ఏడాది గడుస్తున్నా పురోగతి లేదని లేఖలో ఏబీవీ ఆక్షేపించారు.

హత్యను పసిగట్టలేకపోవడం నిఘా వైఫల్యం కాదా!

ఏబీ వెంకటేశ్వరరావు సీనియర్ ఐపీఎస్ అధికారి. హత్య జరిగిన సమయంలో రాష్ట్ర నిఘా విభాగం అధిపతిగా ఉన్నారు. వాస్తవానికి అవాంఛనీయ ఘటనలు జరకుండా నిఘా వేయడం.. అటువంటి సమాచారం ఏదైనా ఉంటే పోలీసు అధికారులను అప్రమత్తం చేయడం.. నేరాలు జరగకుండా చూడటం ఇంటెలిజెన్స్ విభాగం ప్రధాన బాధ్యత. ఆ విభాగానికే బాస్ గా ఉన్నానని.. నాటి సమాచారమంతా తన వద్ద ఉందని గొప్పగా చెప్పుకొన్న ఏబీవీ మరి నాడు ఏం చేశారో.. తమ నిఘా ప్రతాపంతో ఎందుకు ఆ ఘటనను ముందుగా పసిగట్టి పోలీసులను అప్రమత్తం చేయలేకపోయారో సెలవివ్వలేదు.

హత్య జరిగిన ఇంట్లోకి తమ సిబ్బందిని వైఎస్ కుటుంబ సభ్యులు వెళ్ళనివ్వలేదన్నది ఏబీవీ మరో ఆరోపణ. 2019 సార్వత్రిక ఎన్నికలకు దాదాపు నెల రోజుల ముందు వివేకా హత్య జరిగింది. అప్పటికి టీడీపీ ప్రభుత్వమే అధికారం చెలాయిస్తోంది. పోలీసు వ్యవస్థతోపాటు మొత్తం ప్రభుత్వమే వాళ్ళ చేతుల్లో ఉంది. నిఘా విభాగం అధిపతిగా సర్వం సహాధికారాన్ని ఏబీవీ చెలాయిస్తున్నారు.

Also Read : చేతల్లోనూ.. మాటల్లోనూ దిగజారుడేనా.. అచ్చెన్నా!

కానీ ప్రతిపక్షంలో ఉన్న వైఎస్ కుటుంబం నిఘా సిబ్బందిని, పోలీసులను అడ్డుకున్నారని చెప్పడం విడ్డూరం. నిజంగా అదే జరిగి ఉంటే అది నాటి సర్కారు వైఫల్యంగానే భావించాలి. మాజీమంత్రి హత్య కేసులో నిజంగా జగన్, అవినాష్ కుటుంబాల ప్రమేయమే ఉంటే.. అందుకు ఏ చిన్న ఆధారమైనా ఉంటే అప్పటి చంద్రబాబు ప్రభుత్వం వదిలి పెడుతుందా.. దీన్ని ఎవరైనా నమ్మగలరా.. సీనియర్ ఐపీఎస్ అయిన ఏబీవీ ఈ లాజిక్ విస్మరించి ఫక్తు రాజకీయ నేతలా ఆరోపణలు చేయడం విస్మయం కలిగిస్తోంది.

కర్తవ్యం మరచి.. టీడీపీ సేవలో తరించి..

వివేకా హత్యకేసులో నిఘా వైఫల్యానికి ఏబీవీ నిర్వాకమే కారణమన్న ఆరోపణలు ఉన్నాయి. అప్పటి సీఎం చంద్రబాబు కోటరీ సభ్యుడిగా పేరున్న ఏబీవీ.. నిఘా విభాగం బాధ్యతలను గాలికొదిలేశారు. నిరంతరం చంద్రబాబు, ఆయన పార్టీ సేవలో తరించారు. ఎన్నికలకు చాలా నెలల ముందు నుంచి మొత్తం నిఘా సిబ్బందిని పార్టీ సేవకే మళ్లించారు. ప్రధాన ప్రతిపక్షమైన వైఎస్సార్సీపీ నేతల కదలికలపై నిఘా పెట్టి.. ఆ సమాచారాన్ని టీడీపీ నేతలకు ఎప్పటికప్పుడు చేరవేసే బాధ్యతలు అప్పగించారు. స్వయంగా ఆయన కూడా టీడీపీ నేతలకు ఎస్సెమ్మెస్ ల రూపంలో సూచనలు పంపేవారన్న ఆరోపణలు ఉన్నాయి. ఫలితంగా రాష్ట్రంలో నేరాలు, ఇతర పరిణామాలపై నిఘా కొరవడింది. దాని ఫలితమే వివేకా హత్య అన్న వాదనలు ఉన్నాయి.

వివేకా హత్య జరిగి రెండేళ్లయ్యింది. కేసును ఏడాది క్రితమే సీబీఐకి అప్పగించారు. మరి ఇన్నాళ్లు మౌనం వహించిన ఏబీవీ తన వద్ద సమాచారం ఉందంటూ ఇప్పుడే ఎందుకు లేఖ రాయాల్సి వచ్చిందన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత గతంలో ఇంటెలిజెన్స్ చీఫ్ హోదాలో నిఘా పరికరాల కొనుగోలు వ్యవహారంలో ఏబీవీ పాల్పడిన అవినీతి, అంతర్గత రహస్యాలను విదేశీ సంస్థకు లీక్ చేశారన్న ఆరోపణల కేసును వెలికితీసి అతనిపై సస్పెన్షన్ వేటు వేసింది. దీనిపై కోర్టులో పోరాడుతున్న ఆయన.. ఆ కక్షతో వివేకా హత్య కేసులో జగన్ కుటుంబాన్ని ఇరికించేందుకు ప్రయత్నిస్తున్నట్లు కనిపిస్తోంది.

Also Read : అదునాతన 108కు రఘువీరా రెడ్డి సలాం..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి