iDreamPost

రాజకీయాల్లో ఆదర్శం అనుకుంటుండగానే.. ట్విస్ట్‌ ఇచ్చిన మాజీ హోం మంత్రి

రాజకీయాల్లో ఆదర్శం అనుకుంటుండగానే.. ట్విస్ట్‌ ఇచ్చిన మాజీ హోం మంత్రి

నెలకు వంద కోట్ల రూపాయల ముడుపులు వసూలు చేయాలనే లక్ష్యాలను పోలీసులకు పెట్టినట్లు వచ్చిన ఆరోపణలపై ముంబై హైకోర్టు సీబీఐ విచారణకు ఆదేశించిన మరుక్షణమే పదవి నుంచి తప్పుకున్నారు మహారాష్ట్ర హోం మంత్రి అనిల్‌ దేశ్‌ముఖ్‌. ముంబై కమిషనర్‌ పరం బీర్‌ సింగ్‌ చేసిన ఆరోపణలను తేలిగ్గా తీసుకోకూడదని, 15 రోజుల్లో ప్రాథమిక దర్యాప్తు పూర్తి చేసి ఆధారాలు లభిస్తేనే ఎఫ్‌ఐఆర్‌ వేయాలంటూ సీబీఐని ముంబై హైకోర్టు ఆదేశించింది.

కేవలం ఆరోపణలు నిజమో కాదో తేల్చేందుకు విచారణ జరగబోతున్న తరుణంలో పదవిలో ఉండడం నైతికత కాదంటూ హోం మంత్రి పదవికి అనిల్‌ దేశ్‌ముఖ్‌ రాజీనామా చేయడం ఈ తరం రాజకీయాల్లో కొత్త ఒరవడి. 80వ దశకంలో ఆరోపణలు వచ్చినా, శాఖ పనితీరులో వైఫల్యమైనా నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి పదవులకు రాజీనామా చేసేవారు. నాటి విధానాన్ని అనిల్‌ దేశ్‌ముఖ్‌ పాటిస్తున్నారని. కేవలం ఆరోపణలు వచ్చిన వెంటనే పదవి నుంచి తప్పుకున్నారంటూ ఆయన తీరుపై ప్రశంసలు వెల్లువెత్తాయి.

ఈ తరం రాజకీయ నాయకులకు ఆయన ఆదర్శమని అనుకుంటున్నంతలోనే.. తానేమి ప్రత్యేకం కాదని అనిల్‌ దేశ్‌ముఖ్‌ నిరూపించుకున్నారు. అవినీతి ఆరోపణలపై సీబీఐ దర్యాప్తునకు ఆదేశించిన ముంబై హైకోర్టు ఆదేశాలను నిలిపివేయాలంటూ అనిల్‌ దేశ్‌ముఖ్‌ సుప్రిం కోర్టును ఆశ్రయించారు. తనపై సీబీఐ దర్యాప్తు చేయవద్దని ఆ పిటిషన్‌లో కోరారు. ముంబై హైకోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వాలని విన్నవించి.. తాను ఈ తరం రాజకీయ నేతనేనంటూ చాటుకున్నారు.

తమపై వచ్చే ఆరోపణలపై విచారణను ఎదుర్కునే నేతలు కొందరైతే.. అసలు విచారణే వద్దంటూ వివిధ కారణాలను చూపుతూ కోర్టులను ఆశ్రయించే వారు మరికొందరు. అనిల్‌ దేశ్‌ముఖ్‌ రెండో జాబితాలోకి వెళ్లారు. విచారణ వద్దంటూ అనిల్‌ దేశ్‌ముఖ్‌ దాఖలు చేసిన పిటిషన్‌ తెలుగు రాజకీయాలను గుర్తు చేస్తోంది. అవినీతి, అక్రమాలపై విచారణే వద్దంటూ టీడీపీ అధినేత చంద్రబాబు కోర్టులను ఆశ్రయిస్తున్న విషయం అనిల్‌ దేశ్‌ముఖ్‌ ఘటనతో అందరి మదిలోనూ మెదులుతోంది. బాబు వారసులు మహారాష్ట్రలోనూ ఉన్నారంటూ అనిల్‌ దేశ్‌ముఖ్‌ను ఉద్దేశించి సోషల్‌ మీడియాలో నెటిజన్లు సెటైర్లు వేస్తున్నారు.

Also Read : అంబానీ కేసు అనిల్ మెడకు..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి