iDreamPost

కేసీఆర్‌ టార్గెట్‌ గా ఈటల తూటాలు

కేసీఆర్‌ టార్గెట్‌ గా ఈటల తూటాలు

రెండు మూడు రోజులుగా తన విషయంలో జరుగుతున్న పరిణామాలపై ఆచితూచి స్పందించిన మాజీ మంత్రి ఈటల రాజేందర్‌.. తాజాగా నిప్పులు చెరిగారు. కేసీఆర్‌ టార్గెట్‌ గానే కామెంట్లు చేశారు. ‘నీ అధికారులకు వావివరసలు లేవు’ అంటూ మండిపడ్డారు. కేసులకు, అరెస్టులకు భయపడబోనని స్పష్టం చేశారు. ‘ఈటల నా తమ్ముడు అని చెప్పుకున్నారు కదా?.. ఇప్పుడు ఆ తమ్ముడు దెయ్యం అయ్యాడా?’ అని కేసీఆర్‌ను సూటిగా ప్రశ్నించారు.

తనను మంత్రి పదవి నుంచి బర్తరఫ్‌ చేయడంపై ఆవేదన వ్యక్తం చేశారు. కనీసం తన వివరణ కూడా తీసుకోలేదని వాపోయారు. మీరు చెబితే ఏ కలెక్టర్‌​ అయినా.. మీరు చెప్పిన రిపోర్టే ఇస్తారని కుండ బద్ధలు కొట్టారు. అధికారులు సమర్పించిన నివేదికలో అన్నీ తప్పులే ఉన్నాయన్నారు. జమున హ్యాచరీస్‌లో తాను డైరెక్టర్‌ను కాదని, అది తన కొడుకు, కోడలికి చెందినదని ఈటల స్పష్టం చేశారు. తనపై వచ్చిన ఆరోపణలపై, తనను తొలగించడంపై లీగల్‌ గా ఏం చేయాలో అది చేస్తానని ప్రకటించారు.

ప్రభుత్వం దగ్గర కనీసం ఐదు పైసల విలువైన భూమి కూడా తీసుకోలేదని, ఐదు పైసల రాయితీ కూడా తీసుకోలేదని ఈటల స్పష్టం చేశారు. మరి అలాంటిది ఈ పని చేయడం తగునా కేసీఆర్‌ అని నిలదీశారు. ఇదేనా మన సంస్కృతి, మన సంప్రదాయం అని ప్రశ్నించారు. అణచివేత చేయాలనుకుంటే చెల్లదని హెచ్చరించారు. ప్రజాస్వామ్యంలో ప్రజలే అంతిమ నిర్ణేతలని చెప్పారు. నీ కేసులకు, నీ అరెస్టులకు భయపడబోనని స్పష్టం చేశారు. నమస్తే తెలంగాణ పేపర్‌కు లోన్‌ కావాలంటే.. తన పౌల్ట్రీ ఫామ్‌​ కుదవ పెట్టానని చెప్పారు. నీ ఫామ్ హౌస్‌ కు అసైన్డ్‌ భూముల నుంచి ఎన్ని రోడ్లు తీయలేదు అని కేసీఆర్‌ ను ప్రశ్నించారు.

Also Read : దేనికైనా రె‘ఢీ’ – ఈటల

నీ చర్యలు ప్రజలను మెప్పించవు

పార్టీకి, ప్రభుత్వానికి, కేసీఆర్‌కు మచ్చ తెచ్చే పని ఎప్పుడూ చేయలేదని ఈటల చెప్పారు. ధర్మం నాలుగు పాదాల మీద నడవకపోవచ్చు కానీ.. ధర్మం అనేది కచ్చితంగా ఉంటదని చెప్పారు. కేసీఆర్‌ చేస్తున్న​ ప్రయత్మాలు తెలంగాణ ప్రజలను మెప్పిచలేవని చురకలంటించారు. ఇవి కేసీఆర్‌ స్థాయికి తగ్గ పనులు కావన్నారు. వందల మంది ఆఫీసర్లను పెట్టుకుని భయానక వాతవారణం సృష్టిస్తున్నారని ఆరోపించారు. ముఖ్యమంత్రి కేసీఆర్ లాంటి ఉద్యమ నాయకులు మామూలు మనిషినైన తన మీద శక్తినంతా ఉపయోగిస్తున్నారని అన్నారు. భూకబ్జా పేరుతో అసత్య ఆరోపణలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సంబంధం లేని భూములను తనకు అంటగడుతున్నారని ఆరోపించారు.

కోర్టుకెళ్తా

నోటీస్ ఇవ్వకుండా తన భూముల్లో సర్వే చేసినందుకు కోర్టుకు వెళ్తానని ఈటల స్పష్టం చేశారు. సంబంధం లేని భూములను తనకు అంటగడుతున్నారన్న ఆయన.. అరెస్టులకు, కేసులకు భయపడేంత చిన్నవాడిని కానని తేల్చిచెప్పారు. వ్యక్తులు శాశ్వతం కాదని.. వ్యవస్థ శాశ్వతం అని పేర్కొన్నారు. నయీం గ్యాంగ్ తనను చంపేందుకు రెక్కీ నిర్వహించిందన్న ఈటల రాజేందర్.. అప్పుడే భయపడలేదని, ఇప్పుడు భయపడుతానా? అని చెప్పారు.

పార్టీ పెట్టే ఆలోచన లేదు..

కొత్త పార్టీ పెడుతారన్న ఊహాగానాలను ఈటల రాజేందర్‌​ కొట్టిపారేశారు. తనకు అలాంటి ఆలోచన ఏమీ లేదని చెప్పారు. పార్టీ మారడంపైనా ఆయన క్లారిటీ ఇవ్వలేదు. నియోజకవర్గ ప్రజలతో చర్చించి భవిష్యత్ కార్యాచరణను త్వరలోనే ప్రకటిస్తానని అన్నారు. గులాబీ కండువా వేసుకున్న ప్రతి కార్యకర్తకు.. పార్టీకి ఓనర్ అనే ఫీలింగే ఉంటుందన్నారు. పార్టీ బీఫామ్ ఉంటే కాదు.. ప్రజల ఆమోదం ఉంటేనే గెలుస్తారని చెప్పారు. తనకు అన్యాయం జరిగిందన్న భావన ప్రజల్లో ఉందని చెప్పారు.

రాజీనామా చేయాలేమో

తాను రాజీనామా చేయాల్సిన అవసరం వస్తుందని ఈటల అన్నారు. కారు గుర్తుపై గెలిచాను కాబట్టి తనను రాజీనామా చేయాలని అడగవచ్చని చెప్పారు. తాను పదవుల కోసం పెదవులను మూయబోనని తేల్చిచెప్పారు.

Also Read : ఈటల భూ కబ్జా పర్వం సమాప్తం

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి