iDreamPost

తెలంగాణలో మరో ఉప ఎన్నిక పక్కా.. రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన ఈటల

తెలంగాణలో మరో ఉప ఎన్నిక పక్కా.. రాజీనామాపై క్లారిటీ ఇచ్చిన ఈటల

తెలంగాణలో మరో ఉప ఎన్నికల జరగడం ఖాయమైంది. మాజీ మంత్రి, టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే ఈటల రాజేందర్‌ తన రాజీనామాపై క్లారిటీ ఇచ్చారు. అసైన్మెంట్‌ భూముల కొనుగోలు, కబ్జా ఆరోపణలతో మంత్రి పదవిని కోల్పోయిన ఈటల రాజేందర్‌ టీఆర్‌ఎస్‌కు, ఎమ్మెల్యేకు రాజీనామా చేస్తారనే ప్రచారం సాగింది. కేసీఆర్‌కు, ఈటలకు మధ్య మొదలైన గ్యాప్‌తోనే ఈ పరిణామాలు చేటుచేసుకున్నాయి. అందుకే ఈటల, టీఆర్‌ఎస్‌ మధ్య వాడీ వేడీ రాజకీయాలు సాగుతున్నాయి.

టీఆర్‌ఎస్‌ వల్లే ఎమ్మెల్యేగా గెలిచారు.. రాజీనామా చేయాలంటే చేస్తానని ఈటల ప్రకటించారు. అయితే ఆ తర్వాత ఈ విషయంపై మిన్నుకుండిపోవడంతో.. రాజీనామా, హుజురాబాద్‌ ఉప ఎన్నికపై రకరకాల చర్చలు జరిగాయి. ఎమ్మెల్యే పదవికి ఈటల రాజీనామా చేయకపోతే.. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడ్డారనే అభియోగాలు మోపి.. అనర్హుడిగా చేస్తారనే ప్రచారం సాగింది. అయితే ఆ అవసరం లేకుండానే.. ఈటల రాజేందర్‌ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసేందుకు సిద్దమయ్యారు.

వివిధ పార్టీలు, ప్రజా సంఘాలు, కుల సంఘాల నేతలతో వరుస భేటీలు నిర్వహిస్తున్న ఈటల రాజేందర్‌.. రాజకీయ పయనంపై అనేక ఊహాగానాలు ప్రచారంలోకి వచ్చాయి. ఆయన సొంతంగా పార్టీ పెడతారని, కాంగ్రెస్, బీజేపీలలో ఏదో ఒక పార్టీలో చేరతారనే ప్రచారం ముమ్మరంగా సాగుతోంది. బీజేపీలో చేరతారనే ప్రచారం రెండు రోజులుగా బలంగా జరుగుతోంది. ఈ ప్రచారంపై ఈటల క్లారిటీ ఇచ్చారు.

తాను ఏ పార్టీలోనూ చేరబోవడం లేదని ఈటల చెప్పారు. స్వతంత్రంగానే ఉంటానని, త్వరలో ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి, హుజురాబాద్‌ ఉప ఎన్నికల్లో పోటీ చేస్తానని స్పష్టం చేశారు. రాజీనామా ఎప్పుడు చేస్తాననేది త్వరలోనే వెల్లడిస్తానని ఈటల తెలిపారు. అయితే స్వతంత్రంగా ఉంటానన్న ఈటల.. స్వతంత్ర అభ్యర్థిగానే పోటీ చేస్తారా..? లేక పార్టీ పెట్టి పోటీ చేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి