iDreamPost

Eshwar : డార్లింగ్ ప్రభాస్ ‘ఈశ్వర’ మాయ – Nostalgia

Eshwar : డార్లింగ్ ప్రభాస్ ‘ఈశ్వర’ మాయ – Nostalgia

ఇప్పుడు జాతీయ స్థాయిలోనే కాక చైనా జపాన్ లాంటి దేశాల్లోనూ బాహుబలి వల్ల స్టార్ గుర్తింపు తెచ్చుకున్న ప్రభాస్ కు ఇదంతా రెండు మూడేళ్ళలో జరిగిపోలేదు. ఇప్పుడు మనం చూస్తున్న ఈ స్థాయికి చేరుకోవడానికి పదిహేనేళ్లకు పైగా పట్టింది. ఆ తొలి అడుగు విశేషాలు చూద్దాం. 2002 సంవత్సరం. సీనియర్ స్టార్ హీరోల వారసులందరూ ఇండస్ట్రీలో సెటిలయ్యారు. బాలకృష్ణ, నాగార్జున, మహేష్ బాబు వీళ్లకంటూ భారీ మార్కెట్ ఏర్పడింది. కానీ రెబెల్ స్టార్ గా గుర్తింపు పొందిన కృషంరాజు గారి కుటుంబం నుంచి ఏ కథానాయకుడు రాలేదేనన్న లోటు అభిమానులను వెంటాడుతూ ఉండేది. ఆయనకు మగ సంతానం లేకపోవడమే కారణం.

అదే సమయంలో తమ్ముడు సూర్యనారాయణరాజు కొడుకు ప్రభాస్ నటన పట్ల ఆసక్తి చూపిస్తున్నాడని గ్రహించిన పెదనాన్న వెంటనే ఆ శిక్షణకు కావాల్సిన ఏర్పాట్లు చేసేసారు. అతని చురుకుదనం యాక్టర్ గా మలుచుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోనివ్వలేదు. రావోయి చందమామ, టక్కరి దొంగ వరుసగా రెండు పెద్ద ఫెయిల్యూర్స్ తో ఉన్న దర్శకుడు జయంత్ సి పరాన్జీ ఎవరైనా కొత్త హీరోతో చేసేందుకు మంచి మాస్ టచ్ ఉన్న ప్రేమకథ ఒకటి రాసుకున్నారు. అదే ఈశ్వర్. అప్పుడే ప్రభాస్ తారసపడ్డాడు. తనలో స్పార్క్ ని గుర్తించిన జయంత్ ఆలస్యం చేయలేదు. అశోక్ కుమార్ నిర్మాతగా వెంటనే సినిమాన సెట్స్ పైకి తీసుకెళ్లారు.

హీరోయిన్ గా క్యారెక్టర్ ఆర్టిస్ట్ విజయ్ కుమార్ మంజుల కుమార్తె శ్రీదేవిని తీసుకున్నారు. తెలుగులో చాలా సెలెక్టివ్ గా చేస్తున్న రేవతిని తల్లి పాత్రకు ఒప్పించారు. తండ్రిగా శివరామకృష్ణ ఫిక్స్. విలన్ గా అశోక్ కుమార్ నే బెస్ట్ ఛాయస్ గా ఫీలయ్యారు జయంత్. దీనరాజ్ అందించిన కథకు పరుచూరి సోదరులు చక్కని సంభాషణలు సమకూర్చారు. సంగీత దర్శకుడు ఆర్పి పట్నాయక్ మీద పెద్ద భారమే పడింది. గల్లీలో ఉండే ఒక మాస్ పోరడికి డబ్బున్న ఎమ్మెల్యే కూతురికి మధ్య లవ్ స్టోరీగా ఈశ్వర్ మెప్పించాడు. అయితే అంచనాలను పూర్తిగా అందుకునే స్థాయిలో కాదు కానీ ప్రభాస్ పొటెన్షియాలిటీ ఏంటో పరిశ్రమకు తెలిసింది. 2002 నవంబర్ 11న విడుదలైన ఈశ్వర్ సినిమా కంటే మ్యూజికల్ గా మంచి పాటలు జనానికి రిజిస్టర్ అయ్యాయి. ఫలితం ఏదైనా వంద రోజులు ఆడిన ఈశ్వర్ ఫ్యాన్స్ కి మాత్రం స్పెషలే

Also Read : Manoharam : ఊహించని భావోద్వేగాల మనోహరం – Nostalgia

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి