iDreamPost

మా పేపర్‌ మా ఇష్టం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి..

మా పేపర్‌ మా ఇష్టం.. ఈనాడు, ఆంధ్రజ్యోతి..

మేము చెప్పాలనుకుందే చెబుతాం.. వాటినే తాటికాయంత అక్షరాలతో అచ్చెస్తాం.. మీరు చెప్పింది మాకనవసరం.. అన్నట్లుగా ఉంది ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల తీరు. ఒక అంశానికి సంబంధించి తమకు అనుకూలమైతే ఒకలా.. వ్యతిరేకమైతే మరోలా వ్యవహరించడం తెలుగు పత్రికల్లోకి ఎప్పుడో జోచ్చుకొచ్చింది. పార్టీలను బట్టీ పత్రికలు నడవడం ఆరంభించినప్పటి నుంచి ఈ తంతు కొనసాగుతోంది. ఇందులో ఎవరికీ మినహాయింపు లేదు.

నిన్న జరిగిన ఓ ఘటన తెలుగు పత్రికల స్వరూప స్వభావాన్ని తేటతెల్లం చేసింది. కియా కార్ల పరిశ్రమ రాష్ట్రం నుంచి తరలిపోతోందంటూ మొదటిపేజీలోనే బ్యానర్‌ కథనాన్ని ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు వండాయి. ప్రతిపక్ష పార్టీ నేతల స్పందనలతోపాటు చిలువలు పలువలు చేసి రాశాయి. ఎవరో రాసిన కథనాన్ని ఉటంకిస్తూ తమ పత్రికల్లో అచ్చెసుకున్నాయి. తమిళనాడుతో కియా సంప్రదింపులు జరుపుతోందనీ.. పంజాబ్‌ వాళ్లు ఆహ్వానిస్తున్నారనీ.. ఇలా వార్త చదివిన వారికి.. కియా వెళ్లిపోతోందన్న భ్రమ కలిగించేలా కథ అల్లారు.

ఇంత వరకు బాగానే ఉంది. అది తమ పాలసీ కాబట్టి రాసేశారనుకోవచ్చు. అయితే అదే అంశానికి సంబంధించి నిన్న మరో ముఖ్యమైన ఘటన చోటు చేసుకుంది. కియా కార్ల కంపెనీ ఎక్కడికీ పోదంటూ.. ఆ సంస్థ ఎండీ పంపిన లేఖను సంస్థ పీఆర్‌వో మీడియా ముఖంగా చదివి వినిపించారు. అయితే ఇది తమకు అక్కరులేని విషయం. అంతేగాక తమ పాలసీకి విరుద్ధం అనుకున్నారేమో.. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలు ఆ అంశానికి కనీస ప్రాధాన్యత ఇవ్వలేదు. మొదటి పేజీలో కాకపోయినా… కనీసం లోపలి పేజీలో వార్తగా రాయకపోవడం వారి విధానాన్ని అర్థం చేసుకోవచ్చు.

లక్నోలో జరిగిన ఆటో ఎక్స్‌పోలో పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి తో కలసి కియా ప్రతినిధులు మీడియాతో మాట్లాడారు. తమ ఎండీ కుక్‌యున్‌ షిమ్‌ పంపిన లేఖను చదివారు. ఈ విషయాన్ని ఆంధ్రజ్యోతి పత్రిక.. మేకపాటి మాట్లాడినట్లుగా ఓ వార్తను ప్రచురించి… అందులో మేకపాటి గౌతమ్‌ రెడ్డి కియా ప్రతినిధులతో మాట్లాడించారు.. తాము ఇతర ప్రాంతాలకు తరలిపోతున్నట్లుగా వస్తున్న వార్తల్లో నిజం లేదని వారు స్పష్టం చేశారు.. అనే ఒకే ఒక్క వాక్యంతో ముగించేసింది. చంద్రబాబు చెప్పిన ట్లు సర్వమత గ్రంధమైన ఈనాడు కూడా ఇదే దారిలో నడిచింది. అందరికీ ఒకే తరహా రాయితీలు ఇవ్వలేం అనే శీర్షికన మేకపాటి గౌతమ్‌రెడ్డి మాట్లాడినట్లుగా వార్త రాసి.. మధ్యలో ఒక చోట.. కియా మోటార్‌ సంస్థ ఏపీ నుంచి తరలిపోతుందని వచ్చిన వార్తల్లో వాస్తవం లేదని సంస్థ పీఆర్‌వో ఖుష్బూ గుప్తా మీడియా ముందు ఓ పక్రటన చేశారు.. అని ఆ ప్రకనట ఏక వాక్యంలో ఉన్నట్లుగా రాసింది. అంతే తప్పా.. రెండు పత్రికల్లో ఎక్కడా ఆ ప్రకటన కియా ఎండీ పంపారు అనే పదం కనిపించలేదు.

కియా ఎండీ ప్రకటనను నిన్న ఎలక్ట్రానిక్‌ మీడియా, వెబ్‌సైట్లలో చూసిన వీక్షకులు.. పత్రికల్లో ఏం రాశారోనని ఆసక్తితో చూశారు. సాక్షి మొదటి పేజీలో..ఏపీలోనే కియా.. అనే శీర్షికతో ఎండీ చేసిన ప్రకటన గురించి రాసింది చదివిన పాఠకులు.. ఆంధ్రజ్యోతి, ఈనాడు పత్రికలను రెండు మూడు సార్లు తిరగేసినా.. కియా ఎండీ ప్రకటన వార్త కనిపించలేదు. చివరికి మేకపాటి గౌతమ్‌ రెడ్డి చెప్పినట్లు రాసిన వార్తను చదవంగా.. దారి మధ్యలో ఎదో కాలికితగిలినట్లు ఒక చోట తగిలింది. ఆ విషయాన్ని చదివిన పాఠకులు.. తప్పుముందిలే.. వాళ్ల లైన్‌ ప్రాకారం వారు ప్రాధాన్యత ఇచ్చారనుకున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి