iDreamPost

ఏరికోరి తెచ్చుకున్న వారు ఎందుకు వెళ్లిపోతున్నారు..?

ఏరికోరి తెచ్చుకున్న వారు ఎందుకు వెళ్లిపోతున్నారు..?

ప్రధానమంత్రిగా నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి కొన్ని అనూహ్య పరిణామాలు చోటు చేసుకున్నాయి. సాధారణంగా కీలక స్థానాల్లో ఉన్న వారు తమ స్థానాల్ని వదిలిపెట్టేందుకు అస్సలు ఇష్టపడరు. అందులోని ప్రపంచంలోనే అత్యంత పెద్దదైన దేశానికి సంబంధించి ప్రధానమంత్రితో కలిసి పనిచేసేందుకు ఉత్సాహాన్ని ప్రదర్శిస్తారు.

అందుకు భిన్నంగా ప్రధాని నరేంద్ర మోడీ బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఆర్థిక రంగానికి చెందిన పలువురు తమకు తాముగా పదవుల నుంచి వైదొలిగితే.. మరికొందరిని మాత్రం ఆయనే పక్కకు తప్పించారు. దేశ ఆర్థిక పరిస్థితిని ఒక కొలిక్కి తీసుకొచ్చారన్న పేరున్న రిజర్వుబ్యాంకు మాజీ గవర్నర్ రఘరాం రాజన్ ను మోడీనే పక్కన పెట్టినట్లుగా చెబుతారు.

ప్రధానమంత్రి స్థానంలో ఉన్న మోడీ.. తాను అనుకున్నది అనుకున్నట్లుగా చేయాలన్న ఆదేశాల్ని ఇస్తారని.. అత్యుత్తమ స్థాయి అధికారులకు ఇవ్వాల్సిన స్వేచ్ఛ ఇవ్వరన్న పేరుంది. ఈ కారణంతోనే పలువురిని ఆయన తప్పించినట్లుగా చెబుతారు. మరికొందరు తమకుతాముగా ముందుగానే వెళ్లిపోయారు. ఈ జాబితాలో తాజాగా మరో ఆర్థికవేత్త పేరు చేరింది. నీతి ఆయోగ్ ఉపాధ్యక్షుడు రాజీవ్ కుమార్ తన పదవికి రాజీనామా చేశారు. ఆయన నిష్క్రమణ ఇప్పుడు అనూహ్యంగా మారింది.

దేశ ఆర్థిక పరిస్థితిని ఎప్పటికప్పుడు దిశానిర్దేశం చేసే నీతి ఆయోగ్ లాంటి శాఖలో ఉపాధ్యక్ష స్థానంలో ఉన్న రాజీవ్ తన పదవికి ఎందుకు రాజీనామా చేశారు? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. ఎందుకిలా జరిగిందన్న దానికి సమాధానం లేదు. ఆయన స్థానంలో సుమన్ కే బెరిని ఉపాధ్యక్షుడిగా మోడీ సర్కారు నియమించింది.

తన పదవీకాలం పూర్తికాక ముందే రాజీవ్ వెళ్లిపోవటం వెనుక మోడీ సర్కారు అనుసరిస్తున్న ఆర్థిక విధానాలే కారణంగా చెబుతున్నారు. మోడీ ప్రభుత్వంలో ఆర్థిక విభాగంలో పనిచేసిన పలువురు.. తమ పదవీకాలాన్ని పొడిగించాలని అస్సలు కోరుకోలేదంటున్నారు.

ఆసక్తికరంగా మోడీ సర్కారు ఏరికోరి తెచ్చుకున్న అరవింద్ పనగరియా.. ఉర్జిత్ పటేల్ లాంటి వారు పదవీకాలం పూర్తి కాకముందే వెళ్లిపోయిన వారి జాబితాలో ఉన్నారు. చివరకు ప్రస్తుతం ఆర్బీఐ గవర్నర్ గా వ్యవహరిస్తున్న శక్తికాంత్ దాస్ సైతం మోడీ సర్కారు తీరుపై గుర్రుగా ఉన్నట్లు చెబుతున్నారు. ఏమైనా.. ప్రధానమంత్రి కుర్చీలో మోడీ కూర్చున్న తర్వాత దేశ ఆర్థిక పరిస్థితుల్లో మార్పులు చోటు చేసుకుంటాయని చాలామంది ఆశించారు. కానీ.. అందుకుభిన్నంగా ప్రస్తుత దేశ ఆర్థిక పరిస్థితి ఏ మాత్రం బాగోలేదన్న మాట వినిపిస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి