iDreamPost

ఏపీ డిప్యూటీ సీఎంకు కరోనా పాజిటివ్‌

ఏపీ డిప్యూటీ సీఎంకు కరోనా పాజిటివ్‌

తెలుగు రాష్ట్రాల్లో కరోనా వైరస్‌ బారిన పడిన ప్రజా ప్రతినిధుల జాబితాలో ఆంధ్రప్రదేశ్‌ ఉప ముఖ్యమంత్రి కూడా చేరారు. కడప జిల్లాకు చెందిన డిప్యూటీ సీఎం అంజాద్‌ బాషకు కరోనా పాజిటివ్‌ నిర్థారణ అయింది. ఆయనతోపాటు ఆయన కుటుంబ సభ్యులకు కూడా కరోనా సోకింది. వైరస్‌ సోకిన విషయం నిర్థారణ కావడంతో అంజాద్‌ బాష అప్రమత్తమయ్యారు. కుటుంబంతో సహా రాత్రి హైదరాబాద్‌కు చికిత్స కోసం వెళ్లారు. యశోద ఆస్పత్రిలో కుటుంబ సభ్యులకు ప్రత్యేకంగా ఏర్పాట్లు చేయించుకుని చికిత్స తీసుకుంటున్నారు.

కరోనా వైరస్‌ ప్రారంభంలో కూడా అంజాద్‌ బాష వార్తల్లో నిలిచారు. ఢిల్లీ మర్కజ్‌కు వెళ్లి వచ్చిన అంజాద్‌కు అప్పట్లో కరోనా పాజిటివ్‌ అంటూ ప్రచారం సాగింది. అయితే అవన్నీ అసత్యాలేనని అంజాద్‌ స్వయంగా వివరణ ఇచ్చారు. దుష్ప్రచారం మానుకోవాలని హితవుపలికారు. అయితే దాదాపు రెండు నెలల తర్వాత ఆయన కరోనా బారిన పడడం గమనార్హం.

ఇప్పటికే తెలుగు రాష్ట్రాల్లో పలువురు ప్రజా ప్రతినిధులు కరోనా వైరస్‌ బారిన పడ్డారు. ఏపీలో శృంగవరపు కోట, కొడుమూరు, పొన్నూరు ఎమ్మెల్యేలు, బీజేపీ నేత, మాజీ మంత్రి పైడికొండల మాణిక్యాలరావుతో సహా పలువురు ప్రజా ప్రతినిధుల సిబ్బంది కరోనా వైరస్‌ బారిన పడ్డారు. తెలంగాణలో డిప్యూటీ సీఎం మహమూద్‌ ఆలి, పలువురు ఎమ్మెల్యేలకు వైరస్‌ సోకింది. వీరిలో పలువురు ఇప్పటికే వైరస్‌ నుంచి కోలుకోగా, మరికొంత మంది చికిత్స తీసుకుంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి