iDreamPost

శశికళను వెంటాడుతోన్న దురదృష్టం..!!

శశికళను వెంటాడుతోన్న దురదృష్టం..!!

తమిళనాడు దివంగత ముఖ్యమంత్రి జయలలిత నిచ్చెలి శశికళను దురదృష్టం వెంటాడుతోంది. జయలలిత మరణం తర్వాత అక్రమాస్తుల కేసులో జైలుకు వెళ్లిన శశికళ.. ఈ నెల 27వ తేదీన విడుదల కావాల్సి ఉంది. ఈ లోపే ఆమె కరోనా బారినపడ్డారు. బెంగుళూరులోని జైలులో శిక్ష అనుభవిస్తున్న శశికళ అనారోగ్యానికి గురయ్యారు. జ్వరం, వెన్ను నొప్పి, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతుండడంతో ఆమెకు కరోనా పరీక్షలు నిర్వహించగా పాజిటివ్‌గా తేలింది. చికిత్స కోసం ఆమెను బెంగూళూరులోని విక్టోరియా ఆస్పత్రికి తరలించారు. శశికళ ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, పరిస్థితి ప్రస్తుతం విషమంగా ఉందని వైద్యులు వెల్లడించడంతో ఆమె అభిమానుల్లో ఆందోళన నెలకొంది.

తమిళనాడు ముఖ్యమంత్రిగా జయలలిత వరుసగా రెండోసారి ఎన్నికైన తర్వాత ఏడాదికే ఆమె ఆనారోగ్యంతో మరణించారు. అన్నాడీఎంకేకు కర్త, కర్మ, క్రియ అయిన జయలలిత తర్వాత.. ఆ పార్టీలో, ప్రభుత్వంలో చీలికలు వచ్చాయి. పన్నీర్‌ సెల్వం, పళణి స్వామి మధ్య విభేదాలు ఏర్పడ్డాయి. ఈ క్రమంలో అన్నాడీఎంకే పార్టీ బాధ్యతలు శశికళ చేపట్టేందుకు సిద్ధమయ్యారు. ఆ తర్వాత ముఖ్యమంత్రి పీఠం కూడా అధిరోహిస్తారనే ప్రచారం సాగింది. అయితే ఈలోపే రాజకీయ సమీకరణాలు మారిపోయాయి. జయ మరణం తర్వాత అక్రమాస్తుల కేసు మళ్లీ తెరపైకి వచ్చింది. శశికళ జైలుపాలయ్యారు.

ఈ ఏడాది ఏప్రిల్‌లో తమిళనాడు శాసనసభకు ఎన్నికలు జరగబోతున్నాయి. ఎన్నికలకు మూడు నెలల ముందే శశికళ జైలు నుంచి విడుదల కాబోతుండడంతో.. తమిళనాడులో రాజకీయ సమీకరణాలు వేగంగా మారతాయని అందరూ అంచనా వేశారు. మాజీ ముఖ్యమంత్రి కరుణానిధి కుమారుడు స్టాలిన్‌ నేతృత్వంలోని డీఎంకే బలీయంగా ఉండగా.. అన్నాడీఎంకేలో నాయకత్వ లోపం కనిపిస్తోంది. ఈ పరిణామాలను శశికళ తనకు అనుకూలంగా మలుచుకుని ఎన్నికల్లో కీలక పాత్ర పోషిస్తారనే ఊహాగానాలు నడిచాయి. మరో వారం రోజుల్లో జైలు నుంచి విడుదలవుతారనగా.. శశికళ కరోనా బారినపడడం ఆమె అభిమానుల్లో నిరాశను నింపింది. పైగా.. శశికళ ఊపిరితిత్తులు దెబ్బతిన్నాయని, ఆరోగ్యం విషమించిందని వైద్యులు చెప్పడంతో శశికళ వర్గం ఆందోళనలో ఉంది.

Read Also : కేంద్రానికి ముచ్చెమటలు పట్టిస్తున్న అన్నదాత ఐక్యత..!

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి