iDreamPost

కరోనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్

కరోనా వైరస్ పై తెలంగాణ ప్రభుత్వం హై అలర్ట్

తెలంగాణలో సోమవారం తోలి కరోనా కేసు నమోదవడంతో ప్రభుత్వ పరంగా తీసుకోవాల్సిన చర్యలపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఈటెల రాజేంద్ర ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులతో అత్యున్నత సమావేశం నిర్వహించారు. అనంతరం మీడియాతో మాట్లాడిన ఈటెల రాజేందర్ నిన్న సాయంత్రం హైదరాబాద్ కు చెందిన వ్యక్తి (24) కోవిడ్ వైరస్ వ్యాధి లక్షణాలతో గాంధీ ఆసుపత్రి లో చేరాడని తెలిపారు. అనుమానంతో అతని రక్త నమూనాలు పరిశీలించగా ఈరోజు మధ్యాహ్నం అతనికి కరోనా వైరస్ సోకిందని తేలిందని చెప్పారు. ఈ విషయాన్ని కేంద్ర ప్రభుత్వానికి తెలియచేశామని మంత్రి స్పష్టం చేశారు.

భాదిత వ్యక్తి బెంగుళూరుకు చెందిన ఒక సాఫ్ట్వేర్ కంపెనీలో ఉద్యోగిగా తెలుస్తుంది. ఆయన గత నెలలో దుబాయ్ లో హాంకాంగ్ ఉద్యోగులతో కలసి పని చేసిన సందర్భంగా ఈ వైరస్ సోకి ఉంటుందని మంత్రి ఈటెల రాజేంద్ర అనుమానం వ్యక్తం చేశారు. గతనెల 19 న దుబాయ్ నుండి వచ్చిన సదరు వ్యక్తి 21 న హైదరాబాద్ నగరానికి వచ్చినట్టు మంత్రి తెలిపారు. అప్పటి నుండి జలుబు జ్వరంతో భాదపడుతున్న ఆయన 4 రోజుల పాటు అపోలో ఆసుపత్రిలో చికిత్స పొందాడని ఈ నేపథ్యంలో అపోలో ఆసుపత్రిలో భాదిత వ్యక్తి కి ట్రీట్మెంట్ అందించిన వైద్యులు నర్సులతో పాటు అతని కుటుంబ సభ్యులను కూడా ప్రత్యేకంగా అబ్సర్వేషన్ లో ఉంచామని మంత్రి తెలియచేశారు.

గత రెండు నెలలుగా చైనా దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ఇప్పుడు ప్రపంచమంతా విస్తరిస్తుండడంతో WHO తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. గత వారం రోజులనుండి ఇరాన్, ఇటాలీ దుబాయ్ వంటి దేశాలలో కరోనా వైరస్ ఆందోళనకరంగా విస్తరిస్తుంది. ఇండియాలో కూడా సోమవారం ఢిల్లీలో ఒకటి, హైదరాబాద్ లో ఒకటి చొప్పున రెండు కోవిడ్ వైరస్ పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దింతో ఇప్పటివరకు దేశంలో 5 కరోనా పాజిటివ్ కేసులు నమోదయినట్టు కేంద్ర వైద్య ఆరోగ్య శాఖా మంత్రి హర్షవర్ధన్ తెలియచేశారు. ప్రజల్లో నెలకొన్న అనుమానాల నేపథ్యంలో పలు జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా కేంద్ర ప్రభుత్వం హెచ్చరించింది. సాధ్యమైనంత వరకు దూరప్రయాణాలు మానుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. కోవిడ్ వైరస్ విషయంలో వృద్దులు, పిల్లలు ఎక్కువ జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా వైద్యులు సూచిస్తున్నారు. హైదారాబాద్ లో తోలి కరోనా పాజిటివ్ కేసు నమోదవడంతో నగరవాసులు ఈ వైరస్ పట్ల కొంత ఆందోళన చెందుతున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి