iDreamPost

ఢిల్లీ ఫ‌లితాలు: చ‌రిత్ర పున‌రావృతం అవుతుందా..? మ‌ళ్లీ ప్రాంతీయ పార్టీల హ‌వా ప్రారంభ‌మ‌వుతున్న‌ట్టేనా!

ఢిల్లీ ఫ‌లితాలు: చ‌రిత్ర పున‌రావృతం అవుతుందా..? మ‌ళ్లీ ప్రాంతీయ పార్టీల హ‌వా ప్రారంభ‌మ‌వుతున్న‌ట్టేనా!

ఆస‌క్తి రేపిన హ‌స్తిన ఫ‌లితాలు ఎగ్జిట్ పోల్స్ అంచ‌నాల‌ను మించి ఆప్ వైపు మొగ్గు చూప‌డం చ‌ర్చ‌నీయాంశంగా మారింది. బీజేపీకి చెంప పెట్టులా మారిన ప‌రిణామాలు రాజ‌కీయ‌నేత‌ల‌ను ఆలోచ‌న‌కు గురిచేస్తున్నాయి. వ‌రుస‌గా రెండు ఎన్నిక‌ల్లో సింగిల్ డిజిట్ కే స‌రిపెట్టుకోవాల్సిన ప‌రిస్థితి బీజేపీకి ప‌ట్ట‌డం విశేషంగా క‌నిపిస్తోంది. అదే స‌మ‌యంలో సుదీర్ఘ‌కాలం పాటు ఏలిన త‌ర్వాత కాంగ్రెస్ బోణీ కొట్ట‌లేని ప‌రిస్థితి ఏర్ప‌డ‌డం గ‌మ‌నార్హం. దాంతో బ‌ల‌మైన ప్రాంతీయ పార్టీలున్న రాష్ట్రాల్లో జాతీయ పార్టీల‌కు క్ర‌మంగా అవ‌కాశాలు స‌న్న‌గిల్లుతున్నాయ‌నే అభిప్రాయం బ‌ల‌ప‌డుతోంది. మ‌రోసారి దేశంలో ప్రాంతీయ పార్టీల హ‌వాకు అవ‌కాశాలు ఏర్ప‌డుతున్నాయ‌నే అంచ‌నాలు కూడా వినిపిస్తున్నాయి.

1980 ద‌శ‌కం చివ‌రిలో దేశ‌వ్యాప్తంగా ప్రాంతీయ పార్టీల హ‌వా ప్రారంభ‌మ‌య్యింది. సుమారు రెండు ద‌శాబ్దాల పాటు అది కొన‌సాగింది. ముఖ్యంగా ఇందిరా మ‌ర‌ణానంత‌రం మొద‌ల‌యిన ప్రాంతీయ ప‌క్షాల హ‌వా యూపీఏ రూపంలో కాంగ్రెస్ కూడా వాటిపై ఆధార‌ప‌డాల్సిన స్థితి వ‌ర‌కూ సాగాయి. ఆ త‌ర్వాత మోడీ ప్ర‌భావం మొద‌ల‌యిన త‌ర్వాత క్ర‌మంగా ప్రాంతీయ ప‌క్షాల ప్రాభ‌వం త‌గ్గుతుంద‌నే వాద‌న వినిపించింది. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో సంపూర్ణ మెజార్టీని సాధించిన మోడీ మూడు ద‌శాబ్దాల త‌ర్వాత పార్ల‌మెంట్ లో పూర్తి ఆధిప‌త్యం సాధించిన నేప‌థ్యంలో ప్రాంతీయ పార్టీల‌కు కాలం చెల్లుతుంద‌ని బీజేపీ నేత‌లు చెప్పుకొచ్చారు. ఓవైప‌పు కాంగ్రెస్ ముక్తి భార‌త్ అని చెబుతూనే బ‌ల‌మైన నాయ‌క‌త్వమే దేశానికి భ‌రోసా అంటూ ప్ర‌చారం సాగించారు.

తీరా చూస్తే ప్ర‌స్తుతం ప‌రిణామాలు కాంగ్రెస్ కుచించుకోవ‌డ‌మే కార‌ణంగా బీజేపీకి కూడా ఎదురుగాలి దిశ‌గా సాగుతున్న‌ట్టు స్ప‌ష్ట‌మ‌వుతున్నాయి. వ‌రుసగా ఆర్థిక మాంధ్యం, నిరుద్యోగం, ఎన్నార్సీ వంటి విధానాల‌తో రాజ్యాంగ విలువ‌ల‌కు తిలోద‌కాలిస్తున్నార‌నే ప్ర‌చారం కార‌ణంగా ఉద్య‌మాలు పెరుగుతున్నాయి. అదే స‌మ‌యంలో ఒక్కో రాష్ట్రంలో బీజేపీ బ‌లం కుచించుకుపోతోంది. ఉత్త‌రాది రాష్ట్రాల్లో కూడా బీజేపీ బ‌ల‌హీన‌ప‌డుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఇప్ప‌టికే ద‌క్షిణాదిన క‌ర్ణాట‌క‌కే ప‌రిమితం అయిన బీజేపీ కీల‌కమ‌యిన మ‌హారాష్ట్ర , మ‌ధ్య‌ప్ర‌దేశ్, రాజ‌స్తాన్ వంటి రాష్ట్రాల‌ను ఇప్ప‌టికే కోల్పోయింది. అదే స‌మ‌యంలో పంజాబ్, ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో బీజేపీ ప‌ట్టు స‌డ‌లుతున్న‌ట్టు క‌నిపిస్తోంది. తాజా ఢిల్లీ ఫ‌లితాల్లో మ‌ధ్య‌త‌ర‌గ‌తిలో కూడా బీజేపీకి ఆద‌ర‌ణ ద‌క్క‌క‌పోవ‌డం గుర్తించాల్సిన అంశం. భావోద్వేగాల కోసం ఎంత ప్ర‌య‌త్నించినా ఫ‌లితం ఇవ్వ‌లేదు. చివ‌ర‌కు దేశ‌భ‌క్తి, పాకిస్తాన్ నినాదాలు ప‌ల్ల‌వించినా బీజేపీకి క‌లిసివ‌చ్చిన దాఖ‌లాలు లేవు. దాంతో బీజేపీ అస్త్రాల‌కు ప‌దును త‌గ్గుతుంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది.

అదే స‌మ‌యంలో మ‌రోసారి దేశంలో ప్రాంతీయ పార్టీల కూట‌మికి కాలం అనుకూలంగా మారుతుంద‌నే అంచ‌నాలు వినిపిస్తున్నాయి. ఇప్ప‌టికే ఉభ‌య తెలుగు రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీల హ‌వా సాగుతోంది. త‌మిళ‌నాడులో కూడా అదే తీరు. మ‌హారాష్ట్ర‌లో శివ‌సేన సీఎం పీఠంపై ఉంది. ఒడిశాలో న‌వీన్ ప‌ట్నాయ‌క్ పార్టీకి ప్ర‌స్తుతానికి తిరుగులేన్న‌ట్టే క‌నిపిస్తోంది. బీహార్ లో జేడీయూ , ఆర్జేడీ ప్ర‌ధాన పక్షాలుగా ఉన్నాయి. ప‌శ్చిమ బెంగాల్ లో మ‌మ‌త కు ఏమేర‌కు బీజేపీ చెక్ పెట్ట‌గ‌ల‌ద‌నే సందిగ్ధం క‌నిపిస్తోంది. ఇలా కీల‌క రాష్ట్రాల‌లో ప్రాంతీయ పార్టీల ప్రాభ‌వం కొన‌సాగుతున్న నేప‌థ్యంలో సుమారుగా 300 పార్ల‌మెంట్ స్థానాలున్న రాష్ట్రాల్లో ఆ పార్టీలు అధికారంలో ఉండ‌డం గ‌మ‌నార్హం.

ఇక బీజేపీకి మిగిలిన రాష్ట్రాల్లో కేవ‌లం యూపీ మిన‌హా మిగిలిన వ‌న్నీ చిన్న రాష్ట్రాలే కావ‌డం విశేషం. అందులో క‌ర్ణాట‌క‌, గుజ‌రాత్ కొంత ప్ర‌ధాన రాష్ట్రాలుగా ఉండ‌గా, ఇక ఈశాన్య రాష్ట్రాలు, ఉత్త‌రాఖండ్, హ‌ర్యానా, హిమాచ‌ల్ ప్ర‌దేశ్ వంటివి త‌క్కువ పార‌ల్మెంట్ సీట్లున్న రాష్ట్రాలే కావ‌డం గుర్తించాల్సిన అంశం. కాంగ్రెస్ ప్ర‌భావం క‌నిపిస్తున్న రాష్ట్రాలోల ఎంపీ, రాజ‌స్తాన్ కీల‌కం కాగా, పంజాబ్, చ‌త్తీస్ ఘ‌డ్ లో ఆపార్టీ అధికారం ఉంది. దాంతో రెండు జాతీయ పార్టీల క‌న్నా ప్రాంతీయ పార్టీల పాల‌న‌లో ఉన్న రాష్ట్రాలే కీల‌కంగా ఉన్నాయి. దాంతో ఆయా పార్టీల మ‌ధ్య ఐక్య‌త ఏర్ప‌డితే దేశ రాజ‌కీయాల్లో ప‌లు మార్పుల‌కు అవ‌కాశం ఉంటుంద‌నే అభిప్రాయం వినిపిస్తోంది. అప్ప‌ట్లో కూడా బ‌ల‌మైన ఇందిరాగాంధీ నాయ‌క‌త్వం కోల్పోయిన త‌ర్వాత మారిన దేశ రాజ‌కీయాల‌కు అనుగుణంగానే ఇప్పుడు కూడా బ‌లంగా క‌నిపించిన మోడీ నాయ‌క‌త్వం ప‌ట్ల జ‌నంలో మొగ్గు త‌గ్గుతున్న కొద్దీ మ‌ళ్లీ ప్రాంతీయ ప‌క్షాల‌కు చోటు ద‌క్క‌వ‌చ్చ‌ని భావిస్తున్నారు. చ‌రిత్ర పున‌రావృతం అవుతుంద‌నే వాద‌న ముందుకొస్తోంది. అయితే ఇప్పుడు ఆయా పార్టీల‌ను స‌మ‌న్వ‌య ప‌రిచే బాధ్య‌త ఎవ‌రు తీసుకుంటారు..వాటి ఫ‌లితాలు ఎలా ఉంటాయ‌న్న‌దే ప్ర‌స్తుతానికి అంతుబ‌ట్ట‌ని విష‌యం. ఏమ‌యినా ఢిల్లీ ఫ‌లితాలు మాత్రం హ‌స్తిన రాజ‌కీయాల్లోనే కాకుండా దేశ‌మంతా ప‌లుమార్పుల‌కు అవ‌కాశం ఇస్తుంద‌నే వారు క‌నిపిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి