iDreamPost

సిట్ విచారణపై స్టే కోసం చంద్రబాబు కోర్టుకు వెళ్లకుండా ఉంటారా..?

సిట్ విచారణపై స్టే కోసం చంద్రబాబు కోర్టుకు వెళ్లకుండా ఉంటారా..?

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర రాజకీయాలు గత రెండు నెలలుగా రాజధాని అమరావతి చుట్టూనే తిరుగుతున్నాయి. డిసెంబర్‌ 16వ తేదీన అసెంబ్లీలో అమరావతిలో జరిగిన ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌ను ప్రభుత్వం బట్టబయలు చేయడంతో అందరి దృష్టి అమరావతిపై పడింది. అసలు అమరావతిలో ఏం జరిగిందో తెలుసుకునేందుకు అందరూ ఆసక్తి చూపారు.

టీడీపీ ప్రభుత్వ హాయంలోనే అమరావతిలో జరిగిన భూ కుంభకోణంపై జగన్‌ పత్రిక కథనాలు ప్రచురించింది. అయితే కాలగమనంలో అవి మరుగునపడిపోయాయి. తాను అధికారంలోకి వస్తే టీడీపీ అక్రమాలపై విచారణ జరిపిస్తానని ఎన్నికల సమయంలోనే సీఎం జగన్‌ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలోనే గతేడాది డిసెంబర్‌లో అసెంబ్లీలో భూ అక్రమాలపై ఆర్థిక మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్‌ రెడ్డి స్పష్టమైన ప్రకటన చేశారు.

కుంభకోణం ఎలా జరిగింది..? ఆధారసహితంగా వైఎస్సార్‌సీపీ వీడియో ప్రజెంటేషన్‌ ఇచ్చింది. బుగ్గన ప్రకటనపై, వైఎస్సార్‌సీపీ ఆరోపణలపై టీడీపీ ఘాటుగా బదులిచ్చింది. అక్రమాలు జరిగితే విచారణ జరిపించుకోవచ్చని, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని సవాల్‌ విసిరింది. అమరావతి ఇన్‌సైడర్‌ ట్రేడింగ్‌పై గత నెల్లో మంత్రిమండలి, అసెంబ్లీ ప్రత్యేక సమావేశాల్లో ప్రభుత్వం తీర్మానాలు చేసింది. ఈ మేరకు తాజాగా నిన్న శుక్రవారం సిట్‌ను ఏర్పాటు చేసి ఈ వ్యవహారంలో కీలక నిర్ణయం తీసుకుంది. ఇక సిట్‌ విచారణ ప్రారంభం కావడమే తరువాయి.

ఇలాంటి పరిస్థితుల్లో ఎప్పటిలాగే మాజీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు తనయుడు మాజీ మంత్రి నారాలోకేష్‌ ట్విట్టర్‌లో స్పందించారు. ‘‘ మహామేత అధికారంలో ఉన్నప్పుడు చంద్రబాబు గారిపై 26కుపైగా విచారణలు, 14 సభా సంఘాలు, 4 న్యాయ విచారణలు, 3 మంత్రివర్గ ఉప సంఘాలు, 4 అధికారులతో విచారణలు, 1 సీబీసీఐడీ విచారణ చేయించారు. ఏమైంది..?’’ అంటూ ప్రశ్నించారు. అంతేకాకుండా ‘‘ గత 9 నెలలుగా మంత్రుల సబ్‌కమిటీలు, అధికారుల కమిటీలు, విజిలెన్స్‌ విచారణ, సీఐడీ విచారణ, ఐటీకి, ఈడీకి ఉత్తరాలు రాసి విచారణ చేయమన్నారు. ఏమైంది..? ’’ అంటూ ట్వీట్‌ చేశారు.

జగన్‌ సర్కార్‌పై నారా లోకేష్‌ ఎప్పటికప్పుడు ట్విట్టర్‌ వేదికగా స్పందిస్తూ అసలైన రాజకీయ నేతగా రూపొందుతున్నారు. ప్రభుత్వనిర్ణయాలపై విమర్శలు, ఆరోపణలు, సెటైర్లు, వ్యంగ్యోక్తులు విసురుతూ టీడీపీకి భావి నేతగా ఆవిర్భవించేందుకు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే లోకేష్‌ ట్వీట్‌ చేసిన విధంగా వైఎస్సార్‌ ప్రభుత్వం చంద్రబాబు అక్రమాలపై విచారణలకు ఆదేశించిన మాట వాస్తవమేనని వైఎస్సార్‌సీపీ నేతలు అంటున్నారు. ఆయా దర్యాప్తులు జరగకుండా చంద్రబాబు హైకోర్టు, సుప్రిం కోర్టులకు వెళ్లి స్టే తెచ్చుకున్న విషయం లోకేష్‌కు తెలియదా..? అన్ని ఈ సందర్భంగా వారు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా నందమూరి లక్ష్మీ పార్వతి వేసిన అక్రమాస్తుల కేసుపైనా, తెలంగాణలో జరిగిన ఓటుకు నోటు కేసు దర్యాప్తులోనూ..తనపై విచారణ జరగకుండా చంద్రబాబు స్టేలు తెచ్చుకున్న విషయం గుర్తు చేస్తున్నారు.

స్టే గడువు ఆరు నెలల్లో ముగిపోతుందన్న సుప్రిం కోర్టు ఆదేశాలతో.. ఇటీవల మళ్లీ చంద్రబాబు అవినీతి, ఆస్తులపై లక్ష్మీ పార్వతి వేసిన కేసు ఏసీబీ కోర్టులో విచారణకు వచ్చిన విషయం గుర్తు చేస్తున్న వైఎస్సార్‌సీపీ నేతలు.. చంద్రబాబు నిజాయతీ పరుడైతే విచారణకు సిద్ధ పడకుండా.. ఎందుకు స్టేలు తెచ్చుకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. ఓటుకు నోటు కేసులో తన తప్పేమి లేకపోతే.. విచారణ ఎదుర్కొకుండా స్టే కోసం సుప్రిం కోర్టుకు ఎందుకు వెళ్లారని ప్రశ్నిస్తున్నారు.

కేసులు, విచారణల్లో ఇలాంటి ఘన చరిత్ర ఉన్న చంద్రబాబు అమరావతి రాజధానిపై వేసిన సిట్‌ విచారణపై స్టే కోసం కోర్టుకు వెళ్లరన్న గ్యారెంటీ ఉందా..? అని వైఎస్సార్‌సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. అక్రమాలకు పాల్పడకుంటే.. ఈ సారైనా స్టేకోసం వెళ్లకుండా అమరావతిపై తన చిత్తశుధ్ధిని నిరూపించుకునేలా తన తండ్రి చంద్రబాబుకు లోకేష్‌ గట్టిగా చెప్పాలని సూచిస్తున్నారు. అప్పుడే లోకేష్‌ పెట్టిన తాజా ట్వీట్లకు అర్థం ఉంటుందంటున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి