iDreamPost

టీడీపీ ఓటమికి రెండేళ్లు.. ఎందుకు ఓడిపోయారో ఇప్పటికైనా తెలిసిందా బాబూ..?

టీడీపీ ఓటమికి రెండేళ్లు.. ఎందుకు ఓడిపోయారో ఇప్పటికైనా తెలిసిందా బాబూ..?

ఆంధ్రప్రదేశ్‌ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడి నేటికి రెండేళ్లు అవుతోంది. ఆ ఎన్నికల్లో ఏపీ ప్రజలు వైసీపీకి పట్టం కట్టారు. ఐదేళ్లపాటు అధికారంలో ఉన్న చంద్రబాబు ఘోర ఓటమి పాలయ్యారు. ప్రజలు స్పష్టమైన అవగాహనతో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. టీడీపీకి ఎందుకు ఓటు వేయకూడదు..? వైసీపీకే ఎందుకు వేయాలి..? అనే క్లారిటీ ప్రజల్లో ఉంది. అందుకే వైసీపీకి 175 సీట్లకు గాను 151 సీట్లు కట్టబెట్టి చారిత్రాత్మక తీర్పు ఇచ్చారు.

ప్రజలు ఇచ్చిన తీర్పుతో చంద్రబాబు మైండ్‌ బ్లాక్‌ అయిందనే చెప్పాలి. ప్రజలు తనను ఎందుకు ఆదరించలేదో తెలిసినప్పటికీ.. ఆయా కారణాలను మాత్రం బాబు పైకి చెప్పడం లేదు. ఇప్పటికీ కూడా నాకు ఓట్లు ఎందుకు వేయలేదో అనే మాటనే బాబు వల్లెవేస్తున్నారు. ఎన్నికల ఫలితాల తర్వాత నేనేలా ఓడిపోయానో తెలియడం లేదన్న బాబు గారిని ఓదార్చేందుకు రోజుల తరబడి మహిళలు ఆయన ఇంటికి వెళ్లారు. మీరెట్లా ఓడిపోయారయ్యా అంటూ మహిళలు చెప్పిన డైలాగ్‌ అప్పట్లో ఫేమస్‌ అయింది.

సందర్భం వచ్చిన ప్రతిసారి నాటి ఫలితాలను చంద్రబాబు గుర్తు చేసుకుంటూనే ఉన్నారు. ఈ ఏడాది సంక్రాంతి వేడుకల్లో పాల్గొన్న చంద్రబాబు.. ‘‘ప్రజలు పూనకం వచ్చినట్లు జగన్‌కు ఓట్లు వేశారు. నేను ఏమి తప్పు చేశానో తెలియడం లేదు’’ అంటూ నిట్టూర్చారు. ప్రజల అభివృద్ధి చెందాలని కృషి చేశాను.. అదే తప్పైతే నన్ను క్షమించండి’’ అంటూ కూడా చంద్రబాబు సన్నాయి నొక్కులు నొక్కారు తప్పా.. తనకు ఎందుకు ఓట్లు వేయాలేదనే విషయాన్ని మాత్రం ప్రస్తావించలేదు.

ఏ పార్టీ అయిన ఎన్నికల్లో ఓటమికి గల కారణాలను అన్వేషించి.. తిరిగి ప్రజల విశ్వాసాన్ని చూరగొనేందుకు పని చేస్తుంది. కానీ బాబు గారు మాత్రం చేసిన తప్పులు ఏమిటో తెలిసినా.. వాటిని ఒప్పుకునేందుకు మాత్రం మనసు రావడంలేదు. తప్పులను గుర్తించి సరి చేసుకున్న రోజునే మళ్లీ విజయం వైపు సాగుతారు. ఇది జగమెరిగిన సత్యం. ఈ విషయం బాబుకు తెలియంది కాదు.

Also Read : రాష్ట్రంలో కొత్త చరిత్రకు రెండేళ్లు, విశిష్ట ప్రజాతీర్పు మారిన భవితవ్యం

2014 ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన హామీలు ఏమిటి..? అధికారంలోకి వచ్చిన తర్వాత అమలు చేసినవి ఎన్ని..? అనే విషయం అందరికీ తెలిసిన విషయమే. దాదాపు 650 హామీలు ఇచ్చిన బాబు గారు.. వాటిలో అమలు చేసినవి ఎన్ని..? ఎంత మేర చేశారు..? అనేది బాబుకు తెలియంది కాదు. ఇచ్చిన మాట తప్పడం వల్లే ప్రజలు గుణపాఠం చెప్పారనేది జగమెరిగిన సత్యం. అయినా బాబు మాత్రం ఇవేమి ఆలోచించడం లేదు. పైగా ప్రజల అభివృద్ధికి కృషి చేయడమే తన తప్పు అయితే.. క్షమించండి అనే సన్నాయి నొక్కుళ్లకు కాలం చెల్లిందనే విషయం గుర్తిస్తేనే భవిష్యత్తు ఉంటుంది. చేసిన తప్పులను ఒప్పుకుంటేనే ప్రజలు హర్షిస్తారనే విషయం బాబు ఎంత త్వరగా గుర్తిస్తే అంత మంచిదని తమ్ముళ్లు కూడా అంటున్నారు.

ప్రజా తీర్పును అవహేళన చేసేలా ఈవీఎం సీఎం అంటూ హేళన చేశారు. ఒక్క ఛాన్స్‌ అంటేనే ప్రజలు అవకాశం ఇచ్చారన్నారు. ప్రజలకు పూనకం వచ్చినట్లు జగన్‌కు ఓట్లేశారని పేర్కొన్నారు. ఇలా ఈ రెండేళ్లలో వైసీపీ విజయంపై పలు రకాల వ్యాఖ్యలను చంద్రబాబు చేశారు. ఎప్పుడు కూడా ఓటమిని అంగీకరిస్తున్నానని, ప్రజా తీర్పును గౌరవిస్తున్నాననే మాట చంద్రబాబు నోట నుంచి రాలేదు.

ఎన్నికల ప్రచారంలో చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను, బాబు హామీ ఇచ్చి అమలు చేయని అంశాలను జగన్‌ ప్రస్తావిస్తూ.. తాను అధికారంలోకి వస్తే ఏం చేస్తానో స్పష్టంగా చెప్పారు. ప్రజలు జగన్‌ మాటలను విశ్వసించారు. అవకాశం ఇచ్చారు. ఇచ్చిన మాటను నిలబెట్టుకుంటూ వైఎస్‌ జగన్‌ పాలన సాగిస్తున్నారు. ఇచ్చిన ప్రతి హామీని అమలు చేస్తున్నారు. ఇప్పటికే మేనిఫెస్టోలో పెట్టిన హామీలలో 90 శాతానికి పైగా అమలు చేశారు.

చెప్పిన మాట నిలబెట్టుకున్నాను.. ఇచ్చిన హామీ నెరవేర్చాను.. అంటూ జగన్‌ 2024 ఎన్నికల్లో ఓట్లు వేయాలని అడుగుతారు. మరి ఎన్నికల ఫలితాలు వచ్చి రెండేళ్లు అవుతున్నా.. ఓటమికి కారణం తెలుసుకోని చంద్రబాబు.. వచ్చే ఎన్నికల్లో ఏం చెప్పి ప్రజలను ఓట్లు అడుగుతారు..? జగన్‌ పాలన బాగోలేదని చెప్పగలరా..? బూటకపు హామీలు ఇచ్చి అమలు చేయలేదంటారా..? 2014–19 కాలంలో తన పాలనను చూసి ఓట్లేయమని అడుగుతారా..? తేల్చుకోవడం కష్టమైన పనే.

Also Read : బుచ్చయ్య చౌదరి ఇలా మారిపోయారేంటి..?

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి