iDreamPost

ప్రచారానికెళతారంటావా..

ప్రచారానికెళతారంటావా..

గ్రేటర్‌ హైదరాబాదు మున్సిపల్‌ కార్పొరేషన్‌ (జీహెచ్‌యంసీ) ఎన్నికల్లో టీడీపీ జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబునాయుడు, ఆయన కొడుకు లోకేష్‌లు ప్రచారానికి వెళతారంటావా బావా.. అంటూ అనుమానం లేవనెత్తాడు మణి. మరోవైపు వాట్సాప్‌లో వస్తున్న మెస్సేజ్‌లను పైకి స్క్రోల్‌చేస్తూనే ఈ మాట అన్నాడు.

ఇప్పుడెందుకొచ్చిందిరా నీకా డౌటు అంటూ.. చదువుతున్న పేపర్‌ను మడతపెట్టి తలపైకి చూసాడు కిట్టయ్య.

అదేం లేదు బావా.. దుబ్బాక ఉప ఎన్నిక అయిపోయాక తెలంగాణా సీయం కేసీఆర్‌ వెంటనే జీహెచ్‌యంసీ ఎన్నికలకు సిద్ధమైపోతున్నట్లు సంకేతాలిచ్చారు. దీంతో అక్కడ టీఆర్‌ఎస్‌తో పాటు పోటీలో ఉన్న బీజేపీ, కాంగ్రెస్‌ తదితర పార్టీలు ఈమేరకు ఏర్పాట్లు చేసుకుంటున్నాయంటూ వాట్సాప్‌లలో మెస్సేజ్‌లు హోరెత్తిపోతున్నాయి.. వీటిని చదివాక టీడీపీ తరపున అక్కడ ప్రచారం చేసేందుకు వీళ్ళిద్దరూ వెళతారా? లేదా? అన్న అనుమానం వచ్చింది బావా అంటూ చెప్పుకొచ్చాడు మణి.

అక్కడున్న నాయకులు కోరితే ఎందుకు వెళ్ళరు, తప్పకుండా వెళతార్రా అంటూ మణిగాడి మాటలను ఆపే ప్రయత్నం చేసాడు కిట్టయ్య.

అయితే టీఆర్‌ఎస్‌ గుండెల మీద చెయ్యివేసుకోవచ్చన్నమాట అంటూ ఆగాడు మణి.

అదేంట్రా మణీ అలా అనేసావు.. గ్రేటర్‌ హైదరాబాదులో ఉన్న సమస్యలు, నిన్నగాక మొన్నొచ్చి వరదలు ఇలా చెప్పుకుంటే పోతే అనేక సమస్యలు ఉన్నాయని ప్రతిపక్షాలు గగ్గోలు పెట్టేస్తున్నాయి. వీటినే అజెండాగా తీసుకుని ఎన్నికలకు వెళ్ళాలని రాజకీయ పక్షాలు కత్తులు నూరుతున్నాయి.. అటువంటప్పుడు టీఆర్‌ఎస్‌ గుండెలమీద చెయ్యివేసుకుని ఏ విధంగా కూర్చుంటుందిరా? అంటూ అనుమానం వ్యక్తం చేసాడు కిట్టయ్య.

అది కాదు బావా.. గతంలో జరిగిన రెండు ఎన్నికల్లోనూ చంద్రబాబునాయుడు, లోకేష్‌లు ఒక సారి బీజేపీ, రెండోసారి కాంగ్రెస్‌ పార్టీతో కలిసి ఎన్నికల ప్రచారం చేసారు. ఆ రెండుసార్లూ కూడా దాదాపు డిపాజిట్లు కూడా దక్కనంత పనైంది. దీంతో చెప్పుకోదగ్గ పేరున్న టీడీపీ నాయకులంతా ఇతర పార్టీల్లోకి వలసలెల్లిపోయారు. దాదాపుగా టీడీపీ అక్కడ కనుమరుగైపోయిందే ప్రత్యర్ధులు చెప్పుకుంటుంటారు. కరుడుగట్టిన కార్యకర్తలు, నాయకులు సైతం గుండెలపై చేయి వేసుకుని టీడీపీకి ఓటు వెయ్యమని ప్రజలకు చెప్పలేని పరిస్థితులు తెలంగాణాలో ఉన్నాయంటుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు మళ్ళీ జీహెచ్‌యంసీ ఎన్నికల్లో గనుక చంద్రబాబు, లోకేష్‌లు ప్రచారం చేస్తే అవే ఫలితాలు వస్తాయేమోనని అలా అన్నాను బావా అంటూ గుక్కతిప్పుకోవడానికి ఆగాడు మణి.

ఒరేయ్‌.. ఒరేయ్‌.. మణీ.. నువ్వు పైకి కనబడవుగానీ చాలా లెక్కలున్నాయిరా నీలో.. అప్పుడెప్పుడో ప్రచారం చేస్తే ఓడిపోయారు కాబట్టి, ఇప్పుడు ప్రచారానికి వస్తారా? రారా? అని ఇప్పుడే ఆరాలు తీస్తున్నావా.. అంటూ ఆశ్చర్యపోయాడు కిట్టయ్య.

మరేంటనుకున్నావ్‌ బావా.. నీతో తిరిగాక నాక్కూడా కొన్ని లెక్కలు తెలిసిపోతున్నాయ్‌.. అంటూ కాలరెగరేసుకుంటూ వెళ్ళిపోయాడు మణి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి