iDreamPost

బాబు బాధ టీటీడీ భూములు అమ్మటం మీదనా? లేక తమ వారు కొనుక్కునే అవకాశం లేదనా ?

బాబు బాధ టీటీడీ భూములు అమ్మటం మీదనా? లేక తమ వారు కొనుక్కునే అవకాశం లేదనా ?

తిరుమల తిరుపతి దేవస్ధానం ఆస్తుల అంశం ఎంతటి వివాదం సృష్టించిందో అందరికీ తెలిసిందే. అలాంటి వివాదం విషయంలో మహానాడులో చంద్రబాబునాయుడు తన మనసులోని మాటను బయటపెట్టారు. ఇదే అంశంపై నేతలను ఉద్దేశించి చంద్రబాబు మాట్లాడుతూ ఎవరి దగ్గర డబ్బులు లేనపుడు టిటిడి ఆస్తులను అమ్మకానికి పెడితే ఎలాగంటూ ప్రభుత్వాన్ని నిలదీశాడు. కరోనా వైరస్ సంక్షోభంలో ఎవరి దగ్గరా డబ్బులు లేవని, ఇలాంటి సమయంలో ఆస్తులు వేలం వేయాలని టిటిడి నిర్ణయించటం ఏమిటన్న చంద్రబాబు మాటలు వింటుంటే విచిత్రంగా ఉంది.

చంద్రబాబు మాటలు విన్న వారికి రెండు సందేహాలు వచ్చాయి. అవేమిటంటే అసలు టిటిడి ఆస్తులు అమ్మటం తప్పా ? లేకపోతే ఎవరి దగ్గరా డబ్బులు లేనపుడు ఆస్తులు వేలం వేయటం తప్పా ? అని. ఎందుకంటే టిటిడి ఆస్తులను వేలం వేస్తే కొనేవాళ్ళు కొంటారు లేనివాళ్ళు లేదు. మధ్యలో చంద్రబాబుకు ఏమిటి సమస్య ? అంటే కరోనా వైరస్ సంక్షోభంలో ఎవరి దగ్గర డబ్బులున్నాయని అడగటంలో టిడిపి నేతల దగ్గర డబ్బులు లేవని చంద్రబాబు చెప్పదలిచాడా ? కొంత కాలం తర్వాత అమ్మితే టిడిపి నేతలు కూడా వేలంపాటలో పాల్గొంటారన్నదే చంద్రబాబు ఉద్దేశ్యమా ? అన్నదే ఎవరికీ అర్ధం కావటం లేదు.

కొంత కాలమైన తర్వాత ఆస్తులను వేలం వేసేట్లయితే టిడిపి వాళ్ళు కూడా వేలంపాటలో పాల్గొనే వారనే అర్ధమే వస్తోంది ఫార్టీ ఇయర్స్ మాటల్లో. ఎలాగంటే టిడిపి హయాంలో సదావర్తి సత్రం ఆస్తుల వివాదం అందరికీ గుర్తుకు వస్తోంది. అప్పట్లో తన మద్దతుదారుడైన రామానుజయ్యకు చంద్రబాబు కారుచౌవకగా సదావర్తి భూములను రూ 22 కోట్లకు సొంతం చేసేశాడు. బహిరంగ వేలం ద్వారా అమ్ముంటే సదావర్తి భూములకు ఇంకా ఎక్కువ ధరలు వచ్చేవని వైసిపి ఎంఎల్ఏ ఆళ్ళ రామకృష్ణారెడ్గి కోర్టులో కేసు వేశాడు. చివరకు భూముల బహిరంగ వేలాన్ని చంద్రబాబు వేయలేదు. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు సాగిన బహిరంగ వేలంలో సదావర్తి సత్రం భూములు మూడింతల ఎక్కువ ధర పలికాయి.

అదే విధంగా తిరుమల తిరుపతి దేవస్ధానం ఆస్తులమ్మే విషయాన్ని ఎవరు రివర్సు చేయమన్నారంటూ ప్రభుత్వాన్ని ప్రశ్నించాడు. టిటిడికి చెందిన 50 ఆస్తులను అమ్మాలని చంద్రబాబు హయాంలో నియమించిన ట్రస్టుబోర్డు తీసుకున్న నిర్ణయం అందరికీ తెలిసిందే. 2016లో చదలవాడ కృష్ణమూర్తి అధ్యక్షతన నిర్ణయించిన ఆస్తుల అమ్మకం నిర్ణయాన్ని అమలు చేయాలని తాజాగా వైవి సుబ్బారెడ్డి అధ్యక్షతన బోర్డు నిర్ణయించింది.

ఎప్పుడైతే బోర్డు తాజా నిర్ణయం బయటకు వచ్చిందో వెంటనే టిడిపితో పాటు ప్రతిపక్షాలన్నీ ఏకమైపోయి జగన్ ప్రభుత్వంపై ఎంత గోల చేస్తున్నాయో అందరూ చూస్తున్నదే. చంద్రబాబు హయంలోనే ఆస్తులను అమ్మాలనే నిర్ణయాన్ని మరుగున పరిచేసి ఆ నిర్ణయమేదో ఇపుడే తీసుకున్నట్లు నానా గోల చేస్తున్నాయి. బిజెపి అధ్యక్షుడు కన్నా లక్ష్మీనారాయణ నేతృత్వంలో ఆస్తుల అమ్మకం అంశంపై దీక్షలు కూడా చేశారు.

ఆస్తులను అమ్మాలంటే టిటిడి సమయం, సందర్భం చూసుకోవద్దా ? అంటూ మండిపడ్డాడు. ఆస్తుల అమ్మకం విషయంలో ఇంత గోల జరిగిన తర్వాత ఆస్తులు అమ్మే నిర్ణయం 2016లోనే తీసుకున్నారంటూ మనపైనే బురదచల్లుతున్నారంటు చంద్రబాబు చెప్పటమే విచిత్రంగా ఉంది. అందరూ గోల చేస్తే ఆస్తుల అమ్మాలన్న నిర్ణయాన్ని ప్రభుత్వం రివర్స్ చేసిందని చెబుతునే అమ్మకం నిర్ణయాన్ని రివర్సు తీసుకోమని ఎవరు అడిగారు ? అంటూ చంద్రబాబు వేసిన ప్రశ్నతో నేతలు ఆశ్చర్యపోయారు.

అసలు చంద్రబాబు ఉద్దేశ్యం ఏమిటో అర్ధంకాక నేతలకు పిచ్చెక్కటం ఖాయమే. అసలు ఆస్తులు అమ్మటమే తప్పా ? లేకపోతే సమయం, సందర్భం చూసుకోకుండా అమ్మాలన్న నిర్ణయం తప్పా ? అన్నదే ఎవరికీ అర్ధం కాలేదు. మరి నేతలతో పాటు జనాలపైన కూడా కాస్త కనికరం చూపి చంద్రబాబు తన మనసులోని మాటను స్పష్టంగా చెబితే బాటుంటుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి