iDreamPost

ఇదెక్కడి లాజిక్ సర్?

ఇదెక్కడి లాజిక్ సర్?

నిన్నటి నుంచి మొదలైన టాలీవుడ్ షూటింగుల బందులో కొందరు నిర్మాతల అనాసక్తి స్పష్టంగా కనిపిస్తోంది. ఒకవైపు దిల్ రాజు నిర్మాణంలో విజయ్ వారసుడు వైజాగ్ లో చిత్రీకరణ జరుపుకుంటోంది. అడిగితే ఇది తమిళ సినిమా కాబట్టి మన నిబంధనలు దానికి వర్తించవనేది యూనిట్ చెబుతున్నలాజిక్. సందీప్ కిషన్ టైటిల్ రోల్ పోషిస్తున్న మైకేల్ కూడా ఇదే దారి పట్టింది. విజయ్ సేతుపతి ఉన్నాడన్న సాకు చూపించి తమకూ నో రూల్ అంటున్నారు. ఈ సినిమా ప్రొడక్షన్ హౌస్ ఏషియన్. ధనుష్ హీరోగా వెంకీ అట్లూరి దర్శకత్వంలో రూపొందుతున్న సర్ కూడా హ్యాపీగా షూట్ చేసుకుంటోంది. సితార సంస్థ కూడా పైన ఇద్దరితో రాగం కలిపింది.

వాస్తవానికి సర్ ని తెలుగులోనూ తీస్తున్నారు. ఇటీవలే రిలీజైన టీజర్ చూస్తే అందులో ధనుష్ చాలా తెలుగులో మాట్లాడినట్టుగా లిప్ సింక్ లో స్పష్టంగా గమనించవచ్చు. టాలీవుడ్ నిర్మాత, దర్శకుడు కలిసి చేస్తున్న సినిమాని కేవలం బందు నుంచి తప్పించుకోవడం కోసం ఇలా అనడం ఏంటనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. ఇక వారసుడు, మైకేల్ కూడా అంతే. ఇప్పటికే తెలంగాణ నిర్మాతలు కొందరు ఈ బందుతో విభేదిస్తున్నారు. అయినా కూడా ప్రొడ్యూసర్స్ గిల్డ్, ఫిలిం ఛాంబర్లు సంయుక్తంగా నిర్ణయం తీసుకున్నాయి. మీడియా టాక్ ప్రకారం ఈ మూడే కాదు సుమారు ఇరవై పైగా యూనిట్లు నిన్న షూటింగ్ లో ఉన్నాయట. ఇవేవి బందులో లేవు.

ఇండస్ట్రీ సమస్యల మీద వీళ్ళే ఒకతాటి మీద లేనప్పుడు పరిష్కారం ఎలా దొరుకుతుందనే లాజిక్ కి సమాధానం చెప్పాల్సిన బాధ్యత వాళ్లదే. తమది తమిళ చిత్రమని లేదా ప్యాన్ ఇండియా కాబట్టి మినహాయింపు ఉంటుందని చెప్పుకోవడం కేవలం స్వార్థం కిందకే వస్తుందనే వాదనలో నిజం లేకపోలేదు. మరోవైపు ఉన్నట్టుండి బంద్ అంటే ఆర్టిస్టుల కాల్ షీట్లు, లొకేషన్లు, ఏర్పాట్లు, అనుమతులు ఇలా ఎన్నో ప్రాక్టికల్ ప్రాబ్లమ్స్ ఉంటాయని, వాటి తాలూకు నష్టాలను ఎవరు భరిస్తారని మరికొందరు అంటున్నారు. ఎవరి వెర్షన్ లో వాళ్ళు కరెక్ట్ గానే అనిపిస్తున్నా వీలైనంత త్వరగా ఈ అయోమయానికి చెక్ పెట్టి విభేదాలు రాకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి