iDreamPost

ఎస్వీబీసీ ఎండీ గా ధర్మారెడ్డి..

ఎస్వీబీసీ ఎండీ  గా ధర్మారెడ్డి..

తిరుమల తిరుపతి దేవస్థానం భక్తి ఛానల్ కి సంబంధించి ఇటీవల పలు వివాదాలు చెలరేగిన విషయం తెలిసిందే.. తాజాగా ఎస్వీబీసీ ఛైర్మన్‌ పదవికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్వీబీసీ ఎండీగా తిరుమల తిరుపతి దేవస్థానం అదనపు ఈవో ధర్మారెడ్డిని ప్రభుత్వం నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేయగా ఇవాళ (బుధవారం) ఆయన బాధ్యతలు స్వీకరించారు. ధర్మారెడ్డి ప్రస్తుతం టీటీడీ అడిషనల్ ఈవోగా పని చేస్తున్నారు. ఛానల్ లో నెలకొన్న వివాదాల నేపథ్యంలో ఛానెల్‌ ప్రక్షాళనపై ప్రభుత్వం దృష్టిపెట్టింది. ఈ క్రమంలో ధర్మారెడ్డికి ఎండీగా బాధ్యతలు అప్పగించారు. ఛానల్ కు అదనంగా మరో ఇద్దరు డైరెక్టర్లను నియమించనున్నారట.

గతంలో ఎస్వీబీసీ బోర్డు ఏర్పాటు చేసిన తర్వాత చైర్మన్ పోస్టులో టీటీడీ ఈఓనే ఉండేవారు. గత తెలుగుదేశం ప్రభుత్వ హయాంలో ఛానెల్ బాధ్యతల్ని రాఘవేంద్రరావు పర్యవేక్షించారు. వైసీపీ ప్రభుత్వం ఏర్పడ్డాక రాఘవేంద్రరావు ఆ పదవికి రాజీనామా చేశారు. దాంతో ఆ పదవికి సినీనటుడు, వైసీపీకోసం పనిచేసిన 30 ఇయర్స్ ఇండస్ట్రీ పృథ్వీరాజ్‌‌ను నియమించారు. పృథ్వీరాజ్‌ కు బాధ్యతలు అప్పగించాక ఛానల్ ను సమర్ధవంతంగా నడిపించారు. ఇంతలో పృథ్వీరాజ్ ఛానల్ లో పనిచేసే ఉద్యోగినితో అసభ్యకరంగా మాట్లాడినట్లు ఓ ఆడియో క్లిప్ వైరల్ అవడంతో వివాదం చెలరేగింది. దీంతో పృథ్వీరాజ్ పార్టీ అధిష్టానం ఆదేశాలతో ఛైర్మన్ పదవికి రాజీనామా చేశారు. ఈ వ్యవహారంపై విచారణ జరిపేందుకు టీటీడీ ఓ కమిటీని ఏర్పాటు చేయగా.. తాను ఎలాంటి తప్పు చేయలేదని పృథ్వీ రాజ్ చెప్పుకొచ్చారు. తనపై తప్పుడు ఆరోపణలు చేశారని, త్వరలో నిజం బయటపడుతుందని చెప్పుకొచ్చారు.

అయితే ఈ ఎపిసోడ్ జరిగి దాదాపుగా నెలరోజులు గడిచింది. ఈ గ్యాప్ లో పలువురిని ఛానల్ చైర్మన్ గా నియమిస్తున్నారంటూ పేర్లు వినిపించాయి. సీనియర్ జర్నలిస్ట్, ఛానల్ డైరెక్టర్ గా ఉన్న స్వప్న, ఛానల్ లో డైరెక్టర్ గా ఉన్న ప్రముఖ దర్శకుడు శ్రీనివాస రెడ్డి పేర్లు వినిపించాయి. అయినా ఆ నియామకాన్ని నిలిపివేశారు. ఈక్రమంలో అనూహ్యంగా ఎటువంటి వివాదాలు లేని ధర్మారెడ్డిని ఎండీగా నియమించారు. మరి కొంతకాలం ఛానల్ ఛైర్మన్ పదవిని ఖాళీగా ఉంచాలని ప్రభుత్వం భావించింది. అందుకే ఛైర్మన్ పదవిని పక్కన పెట్టి.. ఎండీగా ధర్మారెడ్డిని నియమించినట్టు తెలుస్తోంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి