iDreamPost

పార్టీల‌కు ఢిల్లీ ఓట‌రు నేర్పుతున్న పాఠం

పార్టీల‌కు ఢిల్లీ ఓట‌రు నేర్పుతున్న పాఠం

పార్టీల‌న‌గానే ఎవ‌రి విధానాలు వారికుంటాయి. ఒక్కో పార్టీ ఒక్కో నినాదంతో ప్ర‌జ‌ల‌ను ఆక‌ట్టుకునే ప్ర‌య‌త్నం చేస్తుంది. అంతిమంగా ప్ర‌జ‌ల అభిమానాన్ని సంపాదించిన వారికే విజ‌యం ద‌క్కుతుంది. అయితే ఢిల్లీ ఎన్నిక‌ల ప్ర‌చారం, ఫ‌లితాలు గ‌మ‌నిస్తే ప్ర‌జా స‌మ‌స్య‌ల‌కు ప్రాధాన్య‌త‌నివ్వ‌కుండా ప్ర‌తీ సారి భావోద్వేగం రాజేస్తామ‌నుకుంటే ప్ర‌జ‌లు బుద్ధి చెప్ప‌క త‌ప్ప‌ద‌నే విష‌యం బోధ‌ప‌డుతుంది. ఎన్నిక‌ల్లో ప్ర‌జ‌ల సంక్షేమానికి త‌గిన ప్రాధాన్య‌త ఇవ్వ‌క‌పోతే వారి మ‌న‌సులు గెలుచుకుకోవ‌డం సాధ్యం కాద‌నే విష‌యం ప్ర‌స్ఫుటం అయ్యింది. కేజ్రీవాల్ విజ‌యంలో ప్ర‌జానుకూల ప‌థ‌కాలు పెద్ద పాత్ర పోషించిన నేప‌థ్యంలో ఈ విష‌యంపై పార్టీల‌కు పెద్ద పాఠంగా మారుతుంది.

ఏపీలో వైఎస్ జ‌గ‌న్ ప‌లు ప‌థ‌కాలకు శ్రీకారం చుట్టారు. న‌వ‌రత్నాల పేరుతో ప్ర‌క‌టించిన వాటికే ఆయ‌న ప్రాదాన్య‌త‌నిస్తున్నారు. వాటితో పాటుగా ఇత‌ర ప‌థ‌కాల ద్వారా పాల‌న సాగిస్తున్నారు. దాని మీద ప‌లు ర‌కాల వాద‌న‌లు కూడా ఉన్నాయి. ప్ర‌భుత్వ ఖ‌జానా కి చిల్లుపెట్టేలా ప‌థ‌కాల పేరుతో పంపిణీ లు స‌రికాద‌నే వాద‌న‌లు కూడా ఉన్నాయి. అదే స‌మ‌యంలో ప్ర‌జ‌ల్లోకి వివిధ ప‌థ‌కాల ద్వారా ధ‌నం చేరితే అది మ‌ళ్లీ మార్కెట్ లోకి చేరుతుంద‌ని, త‌ద్వారా ఆర్థిక వ్య‌వ‌స్థ పుంజుకునేందుకు తోడ్ప‌డుతుంద‌నే అంచ‌నాలు కూడా ఉన్నాయి. ఏమ‌యినా జ‌గ‌న్ మాత్రం త‌న ప్రాధాన్య‌త ప‌థ‌కాల‌కేన‌ని ప్ర‌క‌టించేశారు. రాజ‌ధాని క‌న్నా వాటికే పెద్ద‌పీట వేస్తున్న‌ట్టు చెబుతున్నారు. దాంతో ఇప్ప‌టికే జ‌గ‌న్ అవ‌లంభిస్తున్న ప‌లు విధానాల‌ను దేశ‌మంతా గ‌మ‌నిస్తోంది. కొన్ని రాష్ట్రాల్లో అమ‌లుకి రంగం సిద్ధం అవుతోంది.

అదే స‌మ‌యంలో కేజ్రీవాల్ కూడా గ‌తంలో స‌మాచార‌హ‌క్కు చ‌ట్టం కార్య‌క‌ర్త‌గా వెల్ల‌డించిన అభిప్రాయాల‌కు భిన్నంగా పాల‌న సాగించారు. ప్ర‌జానుకూల ప‌థ‌కాల‌తో సామాన్యుడికి చేరువ‌య్యారు. పార్టీ పేరులోనే కాకుండా పాల‌న‌లో కూడా సామాన్యుడికే పెద్ద పీట అని చాటుకున్నారు. ముఖ్య‌మంత్రిగా తొలి నాళ్ల‌లో ప‌లు ఒడిదుడుకులు ఎదుర‌యిన‌ప్ప‌టికీ వాటిని అధిగ‌మించి విద్య‌, వైద్యం, తాగునీరు, విద్యుత్ రంగాల్లో విశేషంగా ప్ర‌జాద‌ర‌ణ పొందారు. వాటికి పెద్ద మొత్తంలో ఖ‌ర్చు చేయ‌డానికి నిధులు కేటాయించారు. ప్ర‌జ‌ల‌కు స‌బ్సిడీల ద్వారా చేరువ‌య్యారు. త‌న విజ‌యంలో వాటిదే పెద్ద పాత్ర అని ఆయ‌న కూడా చెప్పుకున్నారు. ప్ర‌చారంలో కూడా వాటినే ప్ర‌ధాన అస్త్రాలుగా మ‌ల‌చుకున్నారు. త‌న పాల‌న న‌చ్చితేనే ఓట్లువేయండి అంటూ ఆశ్చ‌ర్య‌ప‌రిచారు. ప్ర‌త్య‌ర్తులు సెంటిమెంట్ కోసం మ‌తం, దేశ‌భ‌క్తి సంబంధిత అంశాల‌నే ప్ర‌స్తావిస్తున్నా స‌హ‌నంతో ముందుకు సాగారు. చివ‌ర‌కు సంపూర్ణ విజ‌యం సాధించారు.

కేజ్రీవాల్ తీరుకి పూర్తి భిన్నంగా బీజేపీ వ్యూహం ర‌చించింది. 11 మంది ముఖ్య‌మంత్రులు, 60 మంది మంత్రులు, 200 మంది ఎంపీల‌ను రంగంలో దించినా అంద‌రూ పాకిస్తాన్ గురించి ప్ర‌స్తావించ‌డం, షాహీన్ బాగ్ స‌హా ఎన్నార్సీ వ్య‌తిరేక ఆందోళన‌ల మీద గురిపెట్ట‌డ‌మే త‌ప్ప సామాన్యుడి గురించి పెద్ద‌గా ప్రాధాన్య‌త‌నివ్వ‌లేదు. మ‌త సంబంధిత అంశాల మీద పెట్టిన శ్ర‌ద్ధ మామూలు ఓట‌రు ఏం ఆశిస్తున్నాడ‌న్న‌ది గుర్తించ‌లేదు. గ‌త సాధార‌ణ ఎన్నిక‌ల్లో సంపూర్ణ ఆధిక్యం సాధించ‌డానికి తోడ్ప‌డిన అంశాల‌నే ఇప్పుడు అసెంబ్లీ ఎన్నిక‌ల‌లో కూడా వినియోగించారు. దాంతో బీజేపీ ప్ర‌ణాళిక‌లు బెడిసికొట్టాయి. సామాన్యుడిని ఆక‌ట్టుకోలేక‌పోయాయి. అదే స‌మ‌యంలో కాంగ్రెస్ కూడా త‌న రాజ‌కీయ వ్యూహాల అమ‌లులో విఫ‌లం కావ‌డంతో వ‌రుస‌గా రెండోసారి కూడా ఢిల్లీ అసెంబ్లీలో చోటు ద‌క్కించుకోలేని స్థితికి చేరింది. చివ‌ర‌కు 54 శాతం మంది ఓట‌ర్ల‌తో ఆప్ డిస్టింక్ష‌న్ లో పాస్ కాగా, బీజేపీ 38 శాతం ఓట్లు మాత్ర‌మే సాధించి బోల్తా ప‌డింది. ఇక కాంగ్రెస్ కేవ‌లం 4.5 శాతానికి చేరువ‌లో మిగిలి పోవ‌డంతో హ‌స్తిన లో హ‌స్తం పార్టీ ఆశ‌లు చెరిగిపోతున్న‌ట్టు క‌నిపిస్తోంది. ఏమ‌యినా ఫ‌లితాల‌ను గ‌మ‌నిస్తుంటే ప్ర‌జా సంక్షేమం మ‌ర‌చిపోయిన పాల‌కుల‌కు పెద్ద గుణ‌పాఠం త‌ప్ప‌ద‌ని, ప్ర‌జానుకూల పాల‌న ద్వారానే వారిని మెప్పించ‌గ‌ల‌మ‌ని చాటుతున్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి