iDreamPost

దొనకొండ కి రానున్న డిఫెన్స్ క్లస్టర్

దొనకొండ కి రానున్న డిఫెన్స్ క్లస్టర్

ప్రకాశం జిల్లా దొనకొండ ప్రాంతంలో కేంద్ర ప్రభుత్వానికి చెందిన రక్షణ రంగ ఉత్పత్తుల క్లస్టర్ (డిఫెన్స్ క్లస్టర్) ఏర్పాటుకి ప్రయత్నాలు జరుగుతున్నాయని రాష్ట్ర ఐటి పరిశ్రమల శాఖ మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి వెల్లడించారు. బుదవారం ఉత్తరప్రదేశ్ రాజదాని లక్నోలో జరగుతున్న ఫ్రెంచ్‌-ఇండో డిఫెన్స్‌ ఎక్స్‌పో-2020 కార్యక్రమానికి మంత్రి మేకపాటి గౌతమ్‌ రెడ్డి హాజరయ్యారు. ఈ సందర్భంగా డిఫెన్స్ ఎక్స్పోకు హాజరైన 35 దేశాల ప్రతినిధులతో మంత్రి గౌతమ్ రెడ్డి భేటీ అయ్యారు. ఈ నేపధ్యంలో మంగళ బుదవారాల్లో తన ట్విట్టర్ ఎకౌంట్ ద్వారా కుడా ఆయన ఈ విషయాన్ని వెల్లడించారు.

ఫ్రెంచ్‌-ఇండో డిఫెన్స్‌ ఎక్స్‌పో-2020 లో మంత్రి మేకపాటి గౌతమ్ రెడ్డి మాట్లాడుతూ దొనకొండ కేంద్రంగా డిఫెన్స్‌ క్లస్టర్‌ ఏర్పాటు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు చేస్తొందని పేర్కొన్నారు. మేకిన్‌ ఇండియా ప్రాజెక్టులో భాగంగా రక్షణ ఉత్పత్తుల పరిశ్రమకు దొనకొండ అనువైన ప్రాంతమని, దీనికి సంబంధించి ఇప్పటికే ఏపీ పరిశ్రమల శాఖ ప్రతిపాదనలు కేంద్రానికి పంపిందని ఆయన తెలిపారు. డిఫెన్స్‌ క్లస్టర్ ఏర్పాటుకు అవసరమైన భూమి దొనకొండలో అందుబాటులో ఉందని, ఏరోస్పేస్, రక్షణ, పరిశ్రమల స్థాపనకు దొనకొండ ప్రాంతం కీలకంగా మారనుందని మంత్రి గౌతమ్ రెడ్డి స్పష్టం చేశారు.

ఫ్రెంచ్ కంపెనీలతో కలసి పనిచేసేందుకు ఏపీలోని జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం సిద్ధంగా ఉందని మంత్రి అభిప్రాయపడ్డారు. దొనకొండకు దగ్గరలో ఉన్న కృష్ణపట్నం, చెన్నై పోర్టుల నుంచి ఎగుమతి, దిగుమతులను జరుపుకునే అవకాశముందని గౌతమ్‌ రెడ్డి తెలిపారు. రాబోయే రోజుల్లో ఇండియా రక్షణ పరికరాల తయారీ రంగంలో కీలక స్థానం ఆక్రమించనుందని, ముఖ్యమైన కంపెనీలకు ఇది సదవకాశమని గౌతమ్ రెడ్డి తెలిపారు. అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ రంగంలో భారి పెట్టుబడులను ఆహ్వానిస్తున్నట్టుగా చెప్పారు.

అత్యంత వెనుకబడిన దొనకొండ ప్రాంతం పేరును రాష్ట్ర విభజన తర్వాతి కాలంలో తరచుగా వార్తల్లో నిలుస్తు వస్తుంది. అప్పట్లొ రాష్ట్ర విభజన పై ఏర్పాటయిన శివరామ కృష్ణన్ కమిటీ ప్రభుత్వ భూమి అందుబాటులో ఉండడంతో దొనకొండ ప్రాంతాన్ని రాజధాని ఏర్పాటు కు ఒక ఆప్షన్ గా సూచించడం తో దొనకొండ వెలుగులోకి వచ్చింది. 2014 లో జగన్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే దొనకొండ ప్రాంతంలో రాజధాని ఏర్పాటు కావొచ్చంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.

అయితే 2014 లో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అమరావతిని రాజదానిగా ఎంచుకోవడం తో దొనకొండలో రాజధాని ప్రతిపాదన కి తెరపడింది. చంద్రబాబు ప్రభుత్వంలో 5 వేల ఎకరాల్లో ప్రత్యేక పారిశ్రామిక సెజ్ ని ఏర్పాటు చేస్తామని ప్రకటించినప్పటికీ, స్వయంగా ఆప్రాంతం నుండి ప్రాతినిధ్యం వహించిన మాజీ మంత్రి శిద్దా రాఘవరావు కుడా అనేకసార్లు దొనకొండ కి భారి పరిశ్రమలు రాబొతున్నాయని ప్రకటించినప్పటికీ వాస్తవానికి అవేవి కార్యరూపం దాల్చలేదు.

బ్రిటిష్ కాలం నాటి విమానాశ్రయంతో పాటు రైల్, రోడ్ కనెక్టివిటి, దగ్గరలోనే నౌకాశ్రయాలు ఉన్న దొనకొండ ప్రాంతం స్వతహాగా పరిశ్రమలు స్థాపనకు చాలా అనుకూలంగా ఉంటుంది. దొనకొండ లో పారిశ్రామిక అభివృద్ది కి అపారమైన అవకాశాలు ఉన్నాయి. ఇక్కడ భూములు కుడా చాలా కారుచౌక గా దొరుకుతాయి. ఈ నేపధ్యంలో కనీసం రక్షణ రంగ పారిశ్రామిక క్లస్టర్ అయినా రావాలని వెనుకబడిన ప్రకాశం జిల్లా వాసులు ఆశ గా ఎదురుచూస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి