iDreamPost

మూణ్నాళ్ల ముచ్చట

మూణ్నాళ్ల ముచ్చట

వాళ్లంతా రాజకీయ ఉద్ధండులు. వారి కుటుంబాలు చాలా కాలంగా రాజకీయాల్లో ఉన్నాయి. 2019 ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ తరఫున పోటీ చేసి ఓటమి చవిచూసిన తర్వాత ఆ నేతలు ప్రస్తుతం గడ్డుపరిస్థితి ఎదుర్కొంటున్నారు. వారెవరో కాదు.. దుగ్గుబాటి వెంకటేశ్వరరావు, తోట వాణి, ఆమంచి కృష్ణమోహన్‌లు. ఎన్నికలకు కొద్ది రోజుల ముందు ఈ ముగ్గురు వైఎస్సార్‌సీపీలో చేరారు.

వీరు వైఎస్సార్‌సీపీలో చేరారనడం కంటే చేర్చుకున్నారనడం సబబుగా ఉంటుంది. 2014 ఎన్నికల్లో ఓటమి తర్వాత వైఎస్‌ జగన్‌కు 2019 ఎన్నికలు చావో రేవోలాగా మారాయి. గెలిస్తేనే నిలుస్తాం..అనే పరిస్థితి వచ్చింది. ఈ నేపథ్యంలోనే టికెట్ల కేటాయింపులో ఆయన తన విధానాలకు కొంత భిన్నంగా వ్యవహరించారు. గెలుపు గుర్రాలను వెతికి సీట్లు ఇచ్చారు. ఈ క్రమంలోనే పలు నియోజకవర్గాల్లో కో ఆర్డినేటర్లను కాదని కొత్త వారికి టికెట్లు ఇచ్చారు.

దగ్గుబాటి.. ప్రకాశం జిల్లా పర్చూరులో కో ఆర్డినేటర్‌ను రావి రామనాథం బాబును కాదని సీనియర్‌ నేత, మాజీ మంత్రి దగ్గుబాటి వెంకటేశ్వరరావుకి అసెంబ్లీ సీటు ఇచ్చారు. గతంలో పర్చూరు నుంచి ప్రాతినిధ్యం వహించడం, బలమైన రాజకీయ నేపథ్యం ఉండడంతో దగ్గుబాటికి వైఎస్సార్‌సీపీ ప్రాధాన్యత ఇచ్చింది. అయితే ఎన్నికల్లో అంచనాలు తలకిందులయ్యాయి. దగ్గుబాటి ఓటమిపాలయ్యారు. ఈ నేపథ్యంలో ఏ మాత్రం ఆలస్యం చేయకుండా వైఎస్సార్‌సీపీ తిరిగి కో ఆర్డినేటర్‌గా రావి రామనాథం బాబును నియమించింది. కుటుంబం అంతా ఒకే పార్టీలో ఉండాలని పెట్టిన షరతుతో వైఎస్సార్‌సీపీలో దగ్గుబాటి పూర్తిగా సైలెంట్‌ అయ్యారు.

తోట వాణి.. తూర్పుగోదావరి జిల్లా రాజకీయాల్లో తోట కుటుంబానికి ప్రత్యేక గుర్తింపు ఉంది. తోట నరశింహం 2014లో కాకినాడ లోక్‌సభకు టీడీపీ అభ్యర్థిగా పోటీ చేశారు. ఆ ఎన్నికల్లో గెలిచారు. 2019 ఎన్నికల్లో తోట నరశింహం కుటుంబం వైఎస్సార్‌సీపీలో చేరింది. బలమైన కాపు నేతగా పేరున్న తోట నరశింహం కుంటుంబలో వైఎస్సార్‌సీపీ.. ఆయన సతీమణి తోట వాణికి పెద్దాపురం అసెంబ్లీ టిక్కెట్టు ఇచ్చింది. అప్పటి వరకు అక్కడ కో ఆర్డినేటర్‌గా ఉన్న పెండెం దొరబాబు పార్టీ ఆదేశాన్ని పాటించి ఎన్నికల్లో పని చేశారు. అయితే తోట వాణికి అదృష్టం కలిసి రాలేదు. ఆమెపై టీడీపీ అభ్యర్థి అప్పటి డిప్యూటీ సీఎం నిమ్మకాయల చినరాజప్ప గెలిచారు. ఎన్నికల తర్వాత తోట వాణి సైలెంట్‌ అయ్యారు. తిరిగి పెండెం దొరబాబను కో ఆర్డినేటర్‌గా వైఎస్సార్‌సీపీ నియమించింది.

ఆమంచి.. ప్రకాశం జిల్లా చీరాల నియోజకవర్గంలో మండల స్థాయి నుంచి నియోజకవర్గ స్థాయికి ఎదిగిన నేత ఆమంచి కృష్ణమోహన్‌. ఎంపీపీ, జడ్పీటీసీగా పని చేసిన ఆమంచికి 2009 ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి రోశయ్య ఆశీస్సులతో చీరాల అసెంబ్లీ సీటు దక్కింది. ఆ ఎన్నికల్లో కాంగ్రెస్‌ అభ్యర్థిగా ఆమంచి గెలిచారు. 2014 ఎన్నికలకు ముందు చీరాల నవ నిర్మాణ పార్టీని స్థాపించి మళ్లీ పోటీచేశారు. ఆ ఎన్నికల్లో టీడీపీ, వైఎస్సార్‌సీపీ అభ్యర్థులను కాదని చీరాల ప్రజల ఆమంచిని ఆదరించారు. ఈ నేపథ్యంలోనే బలమైన నాయకుడిగా ఎదిగిన ఆమంచికి 2019 ఎన్నికలకు ముందు పార్టీలో చేర్చుకుని వైఎస్సార్‌సీపీ టిక్కెట్‌ ఇచ్చింది. అప్పటి వరకు కో ఆర్డినేటర్‌గా ఉన్న యాడం బాలజీ పార్టీని వీడారు. ఆమంచిపై టీడీపీ అభ్యర్థి కరణం బలరామకృష్ణమూర్తి గెలిచారు. టీడీపీ టిక్కెట్‌ ఆశించిన పోతుల సునీతకు ఆ తర్వాత ఎమ్మెల్సీ ఇచ్చారు. ఆమె వైఎస్‌ జగన్‌ను ఇటీవల కలిశారు. ప్రస్తుతం చీరాలలో వైఎస్సార్‌సీపీ తరఫున పోతుల సునీతకు ప్రాధాన్యత ఇస్తారన్న ప్రచారం జరుగుతోంది. కో ఆర్డినేటర్‌గా ఆమంచి ఉన్నా.. అది మూణ్నాళ్ల ముచ్చటగానే ఉండనుందని ప్రచారం జరుగుతోంది. ఈ నేపథ్యంలో ఆమంచికి ప్రాధాన్యం ఏ మాత్రం తగ్గదని ఆ జిల్లా మంత్రి బాలినేని శ్రీనివాసుల రెడ్డి (వాసు) ప్రకటించడం గమనార్హం.

ఎన్నికలకు ముందు పార్టీలోకి వచ్చి పోటీ చేసి ఓడిపోయిన నేతల పరిస్థితి మూణ్నాళ్ల ముచ్చటగా మారిందని పరిశీలకులు వ్యాఖ్యానిస్తున్నారు. అందుకు దగ్గుబాటి, తోట, ఆమంచి పేర్లను ఉదహరిస్తున్నారు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి